అప్పుడు అజ్ఞానవాసం.. ఇప్పుడు అజ్ఞాతవాసం!

మహాభారతంలో అరణ్యవాసం, అజ్ఞాతవాసం తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అజ్ఞానవాసం ముగిసి ఇప్పుడు అజ్ఞాతవాసం నడుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో పైనున్న ప్రధాన నాయకుల దగ్గర్నుంచి చిట్టచివరన వున్న కార్యకర్తల వరకూ ఎవరూ విజ్ఞానంతో వ్యవహరించలేదన్న విమర్శలు వున్నాయి. మేం అధికారంలో వున్నాం, మేం ఏం చేసినా నడుస్తుంది. ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు. మేం చేసే పనులను కళ్ళు అప్పగించి చూడ్డం మినహా నోరు తెరచి ప్రశ్నించకూడదనే విధంగా వాళ్ళ ధోరణి వుండేది. దీనిని భరించలేక ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద వేధింపులు, కేసులు, అరెస్టులు, దాడులు తప్పేవి కావు. సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునే జైలుకు పంపిన స్థాయిలో ఆనాడు  వైసీపీ నాయకుల విజ్ఞానం వర్ధిల్లింది. అలా ఐదేళ్ళపాటు కొనసాగిన వైసీపీ నాయకుల అజ్ఞానవాసం ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అజ్ఞాతవాసంగా మారింది. ఐదేళ్ళ అధికార అంధకారంలో వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి కేసుల రూపంలో వాళ్ళనే చుట్టుకుంటున్నాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చాలామంది అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా ఎవరు చేసిన తప్పులు వాళ్ళని వెంటాడుతూ వేధిస్తున్నాయి.  తప్పులు చేయడం మావంతు.. తప్పించుకుని తిరగడమూ మావంతే అన్నట్టుగా తప్పించుకుని తిరుగుతున్నారు. తాము ఎక్కడున్నదీ బయటకి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. బ్యాడ్‌లక్ ఏంటంటే, కేసులలో ఇరుక్కున్న వైసీపీ నాయకులు ఎంత అజ్ఞాతంలో వున్నా పోలీసులు కలుగులోంచి ఎలుకలను బయటకి లాగినట్టుగా లాగుతూ అరెస్టు చేస్తున్నారు. అజ్ఞాతవాసాన్ని భగ్నం చేస్తున్నారు.

చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తిన లలితాజువెలర్స్ అధినేత 

డబ్డులు ఊరికే రావు అనే డైలాగ్ తో తెలుగునాట ఫేమస్ అయిన లలితా జువెలర్స్ అధినేత  కిరణ్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. భారీ వర్షాలకు ఎపిలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి దాతలు  విరాళాలు ఇవ్వడానికి ముందు కొస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదిరూపాయల నుంచి 100  రూపాల వరకు ఎంతైనా సరే మీ స్తోమతను బట్టి  వరద బాధితుల కోసం సాయం చేయండి అని ప్రజలను కోరారు. తన వంతుగా కోటి రూపాయలు వరదబాధితులకు ఇస్తున్నాను అని కిరణ్ ప్రకటించారు.  74 ఏళ్ళ వయసులో కూడాసీఎం చంద్రబాబు ప్రజల కోసం రాత్రిం బవళ్లు శ్రమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని ఆయన కితాబిచ్చారు. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని కిరణ్ పిలుపునిచ్చారు.   

ఆదిమూలం కేసులో ఊహించని ట్విస్ట్!

సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం అత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. ఆదిమూలం ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో బయటపడిన నేపథ్యంలో ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి, ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ఇప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు. తన స్వగ్రామంలో తన ఇంటిలోనే వుంటున్న ఆమె పోలీసులు సూచిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి సపోర్టు లేదని, తనకు భయమేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించడం కూడా ఆమెను ఎవరైనా బెదిరించారా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే, ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని తొక్కేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టిందని వారు అంటున్నారు. సదరు మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేస్తున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్న ఈ వ్యవహారం ముందు ముందు  ఇంకెన్ని టిస్టులు తిరుగుతుందో చూడాలి.

విరిగిపడ్డ కొండచరియలు...ఒకరు మృతి ముగ్గురు గల్లంతు 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. అల్లూరి జిల్లాలో కొండచరియలు విరిగి ఒకరు మృత్యువాతపడ్డారు. శిథిలాల క్రింద  చిక్కుక్కున్న నలుగురిని కాపాడిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. అలాగే చత్తీస్ ఘడ్ తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులను అంతరాష్ట్ర సరిహద్దు అయిన నర్సీపట్నం, భధ్రాచలం రహదారిపై కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఏకంగా 20 కిలో మీటర్ల వరకు కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.  అలాగే చత్తీస్ ఘడ్ తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులను అంతరాష్ట్ర సరిహద్దు అయిన నర్సీపట్నం, భధ్రాచలం రహదారిపై కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఏకంగా 20 కిలో మీటర్ల వరకు కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. 

బుడమేరు పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ!

విజయవాడను సగం ముంచేసిన బుడమేరు ఇంకా శాంతించలేదా? చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగి ప్రవహించింది. సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిలువులోతు వరద నీటిలో ప్రజలు నానా ఇబ్బందులూ పడ్డారు. గత వారంరోజులుగా ఇంకా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలతో బుడమేరు ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో మూడు చోట్ల గండ్లు పడటం కూడా ఈ పరిస్థితికి కారణం. కాగా ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేసి గండ్లను విజయవంతంగా పూడ్చివేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు వారం రోజులు బడమేరు ఒడ్డునే ఉండి స్వయంగా గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. రెండు గండ్లను విజయవంతంగా పూడ్చేసినా మూడో గండి పూడ్చివేతకు ఆర్మీని రంగంలోకి దింపాల్సి వచ్చింది. మొత్తానికి మూడో గండి పూడ్చివేత కూడా పూర్తయ్యింది. ఇక వరద ముంపు భయంలేదని అంతా భావిస్తున్న వేళ బుడమేరు మళ్లీ భయపెడుతోంది.  స్థిరంగా కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరులో ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం బుడమేరు పరిసరప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బడమేరు పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షాల కారణంగా బడమేరు మళ్లీ ప్రమాదకరంగా ప్రవహిస్తోందనీ, పరిసర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యంగా గుణదల, సింగ్ నగర్ ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు. వర్షాలు తగ్గేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  

తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీకి ఈసీ గుర్తింపు

తమిళనాడు అగ్రహీరోలలో ఒకరైన దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన తన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆయన పార్టీకి అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. తమిళనాట విశేష ప్రేక్షకాభిమానం, అసంఖ్యాక అభిమానుల బలం ఉన్న దళపతి విజయం తమిలగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ విషయాన్ని టీవీకే సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది.  ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు కోసం ఫిబ్రవరి 2న దరఖాస్తు చేసుకున్నట్లు టీవీకే పేర్కొంది. ఆ దరఖాస్తును పరిశీలంచి కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అధికారికంగా గుర్తింపు ఇచ్చిందని పేర్కొన్న టీవీకె ఇక నుంచి పార్టీ రాజకీయ కార్యకలాపాలను విస్తతం చేయనున్నట్లు తెలిపింది.  కాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పార్టీ ముందు ముందు సాధించబోయే విజయాలకు తొలి అడుగుగా టీవీకే అధినేత దళపతి విజయ్ పేర్కొన్నారు. పార్టీని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన దళపతి విజయం ఆ సమయంలోనే తన పార్టీ కుల రహిత, అవినీతి రహిత సమాజం కోసం పోరాడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఇటీవలే దళపతి విజయ్ తన పార్టీ జెండానూ, చిహ్నాన్ని ఆవిష్కరించారు. టీవీకే జెండాలో పైన ఎరుపు రంగు, మధ్యలో పసుపుపచ్చ రంగు, కింద కాషాయ రంగు ఉండగా. .  జెండా  మధ్యలో వాగాయ్‌ అనే పువ్వు, దానికి ఇరువైపులా ఏనుగులు ఉన్నాయి. అలాగే జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువళ్ళువర్‌ రాసిన ‘పిరపోక్కుమ్‌ ఎల్ల ఉయుర్కుమ్‌’ అనే కొటేషన్‌ కూడా ఉంది. ‘పుట్టుకతో అందరూ సమానమేఅనేది ఈ కొటేషన్ సారాంశం. ఆ కొటేషన్ తో తన పార్టీ కుల రహిత సమాజం కోసం పోరాడుతుందన్న సందేశాన్ని బలంగా చాటారు విజయ్.   తన రాజకీయ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేస్తుందని విజయ్ పేర్కొన్నారు.  అప్పటి వరకూ రాజకీయ కార్యకలాపాలలో విస్తృతంగా, విరివిగా పాల్గొనడం ద్వారా పార్టీని విస్తరించాలన్నది విజయ్ వ్యూహంగా కనిపిస్తున్నది.  

ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు 

వాయుగుండం కారణంగా ఎపిలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగాళఖాతంలో మరో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు   కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  కంటిన్యూగా ఇక్కడ వర్షం కురవడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.  విజయనగరం చీపురు పల్లిలో 10.35సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ పట్నం జిల్లా గోపాల పట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీవతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి.  స్థానికులు ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.      శ్రీకాకుళం జిల్లాలో బెజ్జిపురం, బుడతవలస, సెట్టిగడ్డ రూట్ లో వరదతాకిడికి గురై  ఓ వ్యాన్ కొట్టుకుపోయింది. స్థానికులు జోక్యం చేసుకుని డ్రైవర్ ను రక్షించగలిగారు.   

దువ్వాడ ఫ్యామిలీ డ్రామా మ‌ళ్లీ మొద‌లు.. ఇంకెన్నాళ్లు స్వామి!

కుండ‌పోత వ‌ర్షానికితోడు బుడ‌మేరు వ‌ర‌ద నీరు విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ముంచెత్తడంతో ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించ‌డంలో నిమ‌గ్న‌మైంది. తెలుగు రాష్ట్రాల్లోని మీడియా మొత్తం విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌పైనే ఫోక‌స్ పెట్టింది. గ‌త ఏడు రోజులుగా ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు.. అధికార ప‌క్షం ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న స‌హాయంపైనే ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఓ సిల్లీ మ్యాట‌ర్ మ‌రోసారి తెర‌ పైకి వ‌చ్చేసింది.  అదేనండీ.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్య‌వ‌హారం. దీంతో మీడియా అటెన్ష‌న్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది. ఆ ఇల్లు నాదంటే.. నాదంటూ దువ్వాడ శ్రీ‌నివాస్ స‌తీమ‌ణి వాణి, ఆయ‌న స్నేహితురాలిగా చెప్పుకునే మాధురి మ‌ధ్య మ‌రోసారి యుద్ధం మొద‌లైంది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు, మ‌ద్ద‌తుదారులు దువ్వాడ శ్రీ‌నివాస్ ఉంటున్న ఇంటిలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే స‌మ‌యంలో దివ్వెల మాధురి అదే ఇంట్లో ఉండి రెండో అంత‌స్తు పైనుంచి వీడియో తీస్తుండ‌టం చూసి వాణి, ఆమె కుమార్తెలు మ‌రింత ఆగ్ర‌హానికి లోన‌య్యారు. గ‌త ప‌ది రోజులుగా ఎలాంటి హ‌డావుడి లేక‌పోవ‌టంతో దువ్వాడ ఫ్యామిలీ వివాదం స‌ర్దుమ‌నిగింద‌ని అంద‌రూ భావించారు. కానీ, తాజా ప‌రిణామంతో వీరి మ‌ధ్య గొడ‌వ మళ్లీ తార స్థాయికి చేరింది.  వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం దాదాపు నెల రోజులగా నడుస్తోంది. దువ్వాడ శ్రీ‌నివాస్‌, ఆయ‌న స‌తీమ‌ణి వాణిల మ‌ధ్య స‌మ‌స్య‌  ప‌రిష్క‌రించేందుకు ఇరు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఈ ఫ్యామిలీ పంచాయితీని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేశారు. అయితే, దువ్వాడ శ్రీనివాస్ ముందు వాణి ప‌లు డిమాండ్లు ఉంచ‌గా.. అన్నింటికి ఓకే చెప్పిన శ్రీ‌నివాస్‌.. వాణితో విడాకులు తీసుకునే విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఉంటున్న ఇంటిని కుటుంబ స‌భ్యుల పేరుపై రాసేందుకు అంగీక‌రించ‌లేదు. అయితే, ఇప్ప‌టికే ఆ ఇంటిలో తనకు వాటా ఉందని దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలుగా చెప్పుకునే మాధురి మీడియా సాక్షిగా చెప్పారు. మరో వైపు వాణి, ఆమె కుమార్తెలు ఆ ఇంటి విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని తేల్చిచెప్పారు. ఈ క్ర‌మంలో   నెల రోజుల క్రితం ఆ ఇంటిలోకి ప్ర‌వేశించేందుకు వాణి, ఆమె ఇద్ద‌రు కుమార్తెలు ప్ర‌య‌త్నించగా..  పోలీసులు అడ్డుకోవ‌టంతో ఆ ఇంటి ముందే టెంటు వేసుకొని నిర‌స‌న తెలుపుతున్నారు. తాజాగా, దివ్వెల వాణి ఆ ఇంటిలోకి వెళ్ల‌డంతో దువ్వాడ ఫ్యామిలీ వివాదం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు ఇంటిలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘ‌ట‌న జ‌రుగుతుండ‌గానే దివ్వెల మాధురి ఓ వీడియోను రిలీజ్ చేశారు. వివాదాస్పదంగా మారిన ఇల్లు తనదేనిని స్పష్టం చేసింది. ఈ బిల్డింగ్ తన పేరు మీదే ఉందనీ, తన ఇంట్లోకి ఎవరూ రావడానికి వీల్లేదనీ ఆమె అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా ఇష్యూ ఉంటే బయటనే తేల్చుకోవాలి. ఈ ఇల్లు తాను కొనుక్కున్నానని చెబుతూ. పోలీసులు  క్షణ కల్పించాలని కోరారు. గతంలో తాను దువ్వాడ శ్రీనివాస్‌కు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాను. ఆ  డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే...  డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేనంటూ శ్రీనివాస్  బిల్డింగ్ రాసిచ్చాని చెప్పారు. సెల్ఫ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అంటూ దివ్వెల మాధురి వీడియోకు వివరించింది. అంతే కాకుండా ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్‌కు మరో రూ.50 లక్షలు ఇచ్చానని.. ఆయన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని కొత్త ఇంటిని నా పేరున రాస్తానని చెప్పి శుక్రవారం ఉదయం 11 గంటలకు తన పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా దివ్వెల మాధురి వీడియోలో పేర్కొన్నారు. మాధురి వీడియో విడుదల చేయడంతో శ్రీనివాస్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆయన భార్య వాణి‌, కుమార్తె హైందవి ఆందోళనకు దిగారు. కోర్టులో కేసు ఉందని, ఇంట్లో ప్రవేశానికి కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కోర్టు డైరెక్షన్ ఉండగా రిజిస్ట్రేషన్ చెల్లదని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని దివ్వెల మాధురికి కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌స్తుతం దివ్వెల మాధురి నేరుగా ఇంట్లోనే మకాం వేయడంతో రానున్న రోజుల్లో దువ్వాడ ప్యామిలీ డ్రామా మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  

ప్రకాశం బ్యారేజీకి డ్యామేజి.. కుట్రకోణంపై బలపడుతున్న అనుమానాలు!?

కృష్ణానది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా వరద వచ్చింది.  చరిత్రలోనే తొలిసారిగా గతంలో ఎన్నడూలేని విదంగా 12 లక్షల క్యూసెక్కుల వదర ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి  వచ్చింది.   ఆ సమయంలో అంటే ఈ నెల 1న భారీ మరపడవలు ఆ వరద ప్రవాహంలో వచ్చి ప్రకాశం బ్యారేసీ గేట్లను బలంగా ఢీ కొన్నాయి. బ్యారేజీ నుంచి దిగువకు నీరు వెళ్లే మార్గంలో అడ్డంగా చిక్కుకున్నాయి. దీంతో వరద ప్రవాహం దిగువకు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది. బ్యారేజీకి కూడా నష్టం వాటిల్లింది. బ్యారేజీ రెండు గేట్లకు ఉన్న  కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. అప్పట్లోనే వరద నీటిలో ఒకే సారి నాలుగు బోట్లు కొట్టుకు రావడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సంఘటన ప్రమాద వశాత్తూ జరిగింది కాదనీ.. ఎవరో ఉద్దేశపూర్వకంగా వదిలారనీ ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. గతంలో అంటే జగన్ హయాంలో కూడా ఇదే విధంగా వరద సమయంలో వరద ప్రవాహానికి అవరోధం కలిగి చంద్రబాబు నివాసం ముంపునకు గురయ్యేలా వైసీపీ ఓ బోటును అడ్డుగా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద వదర నీటిని అడ్డుకునేలా బోట్లు రావడంపై కూడా స్థానికులు నాటి ఘటనను గుర్తు చేస్తూ వైసీపీ కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా బోట్లు కొట్టుకురావడం వెనక కుట్రకోణం ఉందనే అంటున్నారు.  ఒకేసారి నాలుగు బోట్లు కొట్టుకురావడం అనుమానాస్పదంగా ఉందని అంటున్న ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.   నిండా ఇసుకతో  ఉన్న మూడు బోట్లు వరద ప్రవాహానికి అడ్డంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను డీకొన్న ఘటనపై ఒక పక్క పోలీసులు, మరో పక్క ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో ఆ బోట్లను తొలగించి ధ్వంసమైన రెండు గేట్ల కౌంటర్ వెయిట్ల స్థానంలో వేరేవి అమర్చే పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అది వేరే సంగతి. అసలు ఒకే సారి నాలుగు బోట్లు వరద ప్రవాహంలో కొట్టుకు రావడం వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటి? వాటిని ఏ అవసరాల కోసం వాడుతున్నారు? వరద తీవ్రంగా ఉన్న సమయంలో ప్రవాహంలోనికి వాటిని ఎవరు వదిలేశారు? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ బోట్లు  మాజీ ఎంపీ నందిగం సురేష్ కు చెందినవని ప్రాథమికంగా తేలింది. ఆ బోట్లను ఇసుక రవాణా కోసం వాడుతున్నారని చెబుతున్నారు. దీంతో ఈ ఘటన వెనుక   కుట్ర కోణంపై అనుమానాలు బలపడ్డాయి. కావాలనే బోట్లను ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టి భారీ నష్టం వాటిల్లితే.. ఆ నెపాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్థి పొందాలన్న కుట్రతో ఉద్దేశపూర్వకంగానే వదిలేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. 

బొజ్జ గ‌ణ‌ప‌య్య పూజ‌కు వేళాయె!

గణపతి నవరాత్రి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యారు. ప‌ట్ట‌ణం, ప‌ల్లెల్లో వాడ‌వాడ‌లా గ‌ణ‌నాథుడి మండ‌పాలు ఏర్పాటు చేశారు.  సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ప్ర‌తీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. తొమ్మిది నుంచి ప‌ద‌కొండు రోజుల పాటు గ‌ణేశ్ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. ఆది దంపతుల(శివ, పార్వతులు) మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు.  వినాయ‌క చ‌వితి హిందువుల‌కు తొలి పండుగ‌. భాద్ర‌ప‌ద శుద్ధ చ‌వితి రోజే గ‌ణ‌నాథుడు పుట్టాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. గ‌ణేషుడి ఆవిర్భావ గాథ‌లు పురాణాల్లో ర‌క‌ర‌కాలుగా చెప్ప‌బ‌డ్డాయి. శివ పురాణం ప్ర‌కారం.. ఒక‌సారి పార్వ‌తీదేవి స్నానం చేయ‌డానికి శ‌రీరానికి న‌లుగు పండిని రాసుకుంది. మిగిలిన న‌లుగు పండిని ఓ బొమ్మ‌ను త‌యారు చేసి దాని ప్రాణం పోసింది. అత‌నిని ద్వారం ద‌గ్గ‌ర కాప‌లాగా పెట్టింది. శివుడు లోప‌లికి వెళ్తుండ‌గా ద్వారం ద‌గ్గ‌ర బాలుడు అడ్డుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధం జ‌రిగింది. ఆగ్ర‌హంతో శివుడు ఆ బాలుడి త‌ల‌ను త్రిశూలంతో న‌రికివేశాడు. త‌ల తెగిప‌డి ఉన్న బాలుడిని చూసి పార్వ‌తీ దేవి క‌న్నీరుమున్నీరైంది. పార్వ‌తీదేవి బాధ‌ను చూడ‌లేకపోయిన శివుడు.. ఒక ఏనుగు త‌ల‌ను తీసుకొచ్చి అతికించి ప్రాణం పోశాడు. అత‌నికి గ‌జాన‌ణుడు అని పేరు పెట్టాడు. త‌న కార‌ణంగా ఆ బాలుడు వికార రూపాన్ని పొందాడ‌ని గ‌జాన‌నుడికి తొలిపూజ అందుకునేలా శివుడు వ‌ర‌మిచ్చాడు. దీంతో ప్ర‌తీయేడాది భాద్ర‌ప‌ద మాసంలో తొలి పూజ‌ను గ‌ణేశుడు అందుకుంటున్నాడు.  తెలుగు రాష్ట్రాల్లో ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌తీయేటా ఇక్క‌డ గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ప్ర‌తీ ఏడాది ఒక ప్ర‌త్యేక అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చే గ‌ణ‌నాథుడు.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో శ్రీ స‌ప్త‌ముఖ మ‌హాశ‌క్తి గ‌ణ‌ప‌తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. గ‌ణ‌నాథుడి ఉత్స‌వాలు ఒక్క భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం జ‌రుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ముస్లిం దేశాల్లో కూడా జ‌రుపుకుంటారు. జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలోనున్న ఇండోనేషియాలోసైతం గణపతి పూజలందుకుంటున్నారు. 270 మిలియన్ల జనాభా కలిగిన ఆ దేశంలో 87 శాతం మంది ముస్లింలే. వారంతా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. ఇక భారత దేశంలో బహిరంగంగా ఒక సామాజిక ఉత్సవంగా వినాయక చవితి నవరాత్రులను నిర్వహించడం అన్నది మాత్రం స్వాతంత్ర్యోద్యమ సమయంలో భారతీయుల ఐక్యతా చిహ్నంగా నిర్వహించడం ఆరంభమైంది. ఇందుకు స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కారణం. 1894లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక సామాజిక ఉద్యమంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. అలా మొదలైన గణేష్ చతుర్ధి ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 

ఆదిమూలం రాజీనామా? సత్యవేడుకు ఉప ఎన్నిక?

తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదు అయింది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నంబర్లు 105, 106ల్లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిమూలం రాసలీలలు నిర్వహించిన హోటల్ తాలూకు సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొన్నటిఎన్నికల సందర్భంగా జంప్ అయిన ఆదిమూలం తన అసలు పార్టీ లక్షణాలను కూడా తనవెంట తెచ్చుకున్నారు. తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నారు. వైసీపీలో అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకోరుగానీ, తెలుగుదేశంలో మాత్రం ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆదిమూలం రాసలీలల గురించి బయటపడిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఇంత రచ్చ అయిన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడం తెలుగుదేశం పార్టీలోని క్రమశిక్షణకు తార్కాణంగా నిలుస్తుంది.  ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేశాక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదిమూలాన్ని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం వుంది. మరి ఆదిమూలం మళ్ళీ తన సొంతగూటికి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఆదిమూలం సంగతి అలా వుంచితే, ఉప ఎన్నికలో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరన్న ప్రశ్న అప్పుడే ఉదయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక తెలుగుదేశం నాయకుడు జె.డి.రాజశేఖర్‌కి టీడీపీ టిక్కెట్ దక్కాల్సి వుంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం మారడం వల్ల టిక్కెట్ ఆదిమూలానికే ఇవ్వాల్సి వచ్చింది. దాంతో జె.డి.రాజశేఖర్ నిరాశకు గురయ్యారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ఆదిమూలం గెలుపుకు తనవంతు కృషి చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జె.డి.రాజశేఖర్‌కే టిక్కెట్ దక్కే అవకాశం వుందని తెలుస్తోంది. ఇక వైసీపీ వ్యూహం ఎలా వుండబోతోందో చూడాలి. ఆదిమూలానికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్నే సత్యవేడు నుంచి పోటీ చేయిస్తారా? లేక కొత్త అభ్యర్థిని ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి. మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపీ, సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని తన మీద వున్న ‘11’ ముద్రను చెరుపుకోవడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం వుంది.

ముంపుప్రాంతాల్లో  చంద్రబాబు ఏరియల్ సర్వే 

భారీ వర్షాల వల్ల ఎపి అతలాకుతలమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. నిన్న బుడమేరు వాగు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రికి  తృటిలో రైలు ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.    కాగా ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకున్న చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. . బుడమేరు కొల్లేరులో కలిసే ప్రక్రియను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుడమేరు కబ్జా అయిన వైనాన్ని చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజి నీళ్లు  కృష్ణానదిలో కలిసే తీరు , అక్కడ్నుంచి సముద్రంలో కలిసే తీరు చంద్రబాబు ఏరియల్ సర్వేలో తెలుసుకున్నారు. 

ఈటలకు ఝలక్.. బీజీపీ తెలంగాణ పగ్గాలు బండికేనా?

తెలంగాణలో బీజేపీలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కృత నిశ్చయానికి ఆ పార్టీ హైకమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా సంపాదించలేకపోయింది. ఎప్పటిలాగే సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో  సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అవి కొంత మేర ఫలించి కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రంలో లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడం వల్లనే బీజేపీ ఆ మాత్రం లోక్ సభ స్థానాలను గెలుచుకోగలిగిందని కమలనాథులకు అర్ధమైంది.  ఇప్పుడు ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉద్వాసన పలికిన బండి సంజయ్ కే మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిందని రాష్ట్ర బీజేపీ శ్రేణులలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.వాస్తవానికి గత కొన్ని రోజులుగా పార్టీ రాష్ట్ర పగ్గాలు మల్కజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కట్టబెట్టనున్నారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈటలకు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించే విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలో బీజేపీ వెనకడుగు వేసింది. కిషన్ రెడ్డినే కొనసాగించింది. అయితే కిషన్ రెడ్డి ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని సార్వత్రిక ఎన్నికల తరువాత నుంచీ పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న విషయంలోనే తేల్చుకోలేకపోతోంది.  పార్టీ అధ్యక్ష పగ్గాలు ఈటలకు అప్పగి స్తారన్నది దాదాపుగా ఖరారైందని కూడా అంతా భావించారు. అయితే అనూహ్యంగా బండి సంజయ్ రేసులోకి రావడం, ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో బీజేపీ హైకమాండ్ వెనక్కు తగ్గింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు బండి చేతుల్లో ఉన్న కాలంలో  బీజేపీకి రాష్ట్రంలో మంచి మైలేజీ ఉందని, ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాతనే పార్టీలో కుమ్ములాటలు, గ్రూపులు ఎక్కువయ్యాయన్న భావనలో పార్టీ హైకమాండ్ ఉంది. దీంతో ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబట్టడాన్ని బండి వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. అసలు వాళ్లూ వీళ్లూ అని వెతకడం ఎందుకు బండినే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే పోలా అన్న అభిప్రాయం ఇప్పుడు హైకమాండ్ లో వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తాజాగా ఖమ్మంను అతలాకుతలం చేసిన భారీ వరదల సమయంలో  కేంద్ర మంత్రి హోదాలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం, ఆయనకు పోటీగా ఈటల మరో బృందంతో పర్యటనకు రెడీ కావడం ఇద్దరి మధ్యా విభేదాలను ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చింది. హై కమాండ్ అనుమతి లేకుండా బండి వరద ప్రాంతాలలో పర్యటించే అవకాశం ఉండదని అంటున్నారు. పార్టీ హైకమాండ్ బండినే ప్రోత్సహిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని చెబున్నారు.   

మన న్యాయ వ్యవస్థ పవర్ ఇది!

మన భారతీయ న్యాయ వ్యవస్థ చలా గొప్పది. అపరాధులను వదిలిపెట్టదు. నిర్దోషులను శిక్షించదు. న్యాయం విషయంలో తన, పర భేదం చూపించదు. ఇంత గొప్ప న్యాయ వ్యవస్థ వున్న దేశంలో మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి. మన న్యాయ వ్యవస్థ మీద మనకున్న గౌరవాన్ని మరింతగా పెంచే సంఘటన బిహార్‌లో జరిగింది. 34 సంవత్సరాల క్రితం 20 రూపాయల లంచాన్ని డిమాండ్ చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ని వెంటనే వెతికి అరెస్టు చేయాలని గౌరవనీయులైన న్యాయమూర్తి గారు ఆదేశించారు. నేరం అనేది చిన్నదా.. పెద్దదా అనేది ముఖ్యం కాదు.. నేరం చేసిన వారికి శిక్ష పడాలి. ఇది ముఖ్యం.  అసలేం జరిగిందంటే, 1990లో.. అంటే 34 సంవత్సరాల క్రిందట బిహార్‌లోని సహర్సా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించే సురేష్ ప్రసాద్ అనే కానిస్టేబుల్ ప్లాట్‌ఫామ్ మీద కూరగాయల మూటతో వున్న సీతాదేవి అనే మహిళని ఆపాడు. తనకు 20 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె అతనికి 20 రూపాయలు ఇస్తున్న సమయంలో రైల్వేస్టేషన్ ఇన్‌ఛార్జ్ చూశాడు. కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైల్లో వేశారు. 1999లో సురేష్ ప్రసాద్ బెయిల్ మీద బయటకి వచ్చి పరారయ్యాడు. దాంతో అతని బెయిల్ రద్దు చేసి అరెస్టు వారెంట్ జారీ చేశారు. సురేష్ ప్రసాద్ తప్పు అడ్రస్ ఇవ్వడంతో అతని ఆచూకీ దొరక్క పోలీసులు ఇప్పటికీ అతని కోసం వెతుకుతూనే వున్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసు గౌరవనీయ న్యాయస్థానం దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచాలని డీజీపీని ఆదేశించింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న కేసుల పరిష్కరించాలన్న సదుద్దేశంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ నిందితుడు సురేష్ ప్రసాద్ దొరకాలి. అతని నేరానికి తగిన శిక్ష పడాలి. 

ఓహో.. జగన్ టూర్ వాయిదా ఇందుకా?

మామూలుగా అయితే జగన్ ఈపాటికి లండన్‌లో విహరిస్తూ వుండాలి. కానీ అలా జరగలేదు. ఈనెల 3 నుంచి 25 వరకు లండన్‌కి వెళ్ళిరావడానికి సీబీఐ కోర్టు నుంచి జగన్ పర్మిషన్ తీసుకున్నారు. నిజానికి ఆయన మాటమాటకీ లండన్ ఎందుకు వెళ్తున్నారోగానీ, ఈసారికి మాత్రం కుమార్తె పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నట్టుగా పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ వచ్చిన దగ్గర్నుంచి సామాను సర్దుకునే పనిలో వున్న జగన్, మిగతా విషయాలేవీ పట్టించుకోకుండా ప్రయాణం మీదే దృష్టిపెట్టారు. కేసులు ముంచుకొస్తున్నా, తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నా, తాను తిరిగి వచ్చేసరికి పార్టీ మొత్తం ఫినాయిల్ వేసి కడిగినట్టు క్లీన్ అయ్యే అవకాశాలు వున్నాయని అర్థమవుతున్నా ఎంతమాత్రం పట్టించుకోకుండా, నివారణ చర్యలేవీ చేపట్టకుండా లండన్ గురించే ఆలోచిస్తున్నారు. అలాంటి జగన్ మూడో తారీఖున లండన్‌కి చెక్కేయాల్సి వున్నా ఆ పని చేయలేదు. ఇదేంటబ్బా అనుకుంటే, ఆయన భజన బ్యాచ్ ఒక పాయింట్‌ని ప్రచారం చేయడం ప్రారంభించారు. విజయవాడ వరదల్లో మునిగిపోయింది కాబట్టి వాళ్ళని పరామర్శించి, ఆదుకోవడానికే జగన్ లండన్ టూర్‌ని వాయిదా వేసుకున్నారు అని చెప్పుకుంటూ తిరిగారు. పోనీలే, వరద బాధితులను ఆదుకుంటారేమో అని కొంతమంది అమాయకులు అనుకున్నారు. జనాన్ని పరామర్శించడం అనే పేరుతో బయటకి వచ్చిన జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విషం కక్కడం మినహా చేసిందేమీ లేదు. మూడో తారీఖు అయిపోయింది.. నాలుగో తారీఖు అయిపోయింది.. ఐదో తారీఖు కూడా అయిపోయింది. రోజులు గడిచిపోతున్నాయిగానీ, జగన్ లండన్ వెళ్ళడం లేదు. తాను లండన్‌కి వెళ్తే పార్టీ ఖాళీ అయిపోతుందన్న భయంతో జగన్ లండన్‌కి టూర్ రద్దు చేసుకున్నారా అనే సందేహాలు కలుగుతున్న నేపథ్యంలో అసలు విషయం బయటకి వచ్చింది. అదేంటంటే, జగన్ పాస్‌పోర్టు రద్దయింది. ఇంతకాలం జగన్‌కి ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాట్ పాస్‌పోర్టు వుండేది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి డిప్లొమాట్ పాస్‌పోర్టు రద్దయింది. జగన్ మళ్ళీ సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగన్‌కి సంవత్సరం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీని మీద జగన్ అప్పీల్ చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు రావాలి.. ఆ తర్వాత పాస్‌పోర్టు రావాలి. అప్పుడే జగన్ టూర్ వుంటుంది. మరి ఈ వ్యవహారం మొత్తం పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో... అప్పటికి సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతి గడువు పూర్తి అవుతుందేమో అనే సందేహాలు కూడా వున్నాయి.

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన  బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి  కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జిట్టా  యశోదా హాస్పిటల్ లో చికిత్సపొందుతూ  మరణించారు జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం భువనగిరికి కుటుంబసభ్యులు తరలించారు. ఈ సాయంత్రం  భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.  తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి  పాత్ర మరువలేనిది.  మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణానంతరం  జిట్టా కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం యువ తెలంగాణ పార్టీ'ని స్థాపించారు.  ప్రత్యేక తెలంగాణ బిల్లుకు సహకరించిన బీజేపీలో యువతెలంగాణలో  విలీనం చేశారు.  తెలంగాణలో రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని  కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లో న్యాయం జరగదని భావించి జిట్టా కెసీఆర్ నాయకత్వంలోని టిఆర్ ఎస్ లో చేరారు.  గత ఎన్నికల్లో జిట్టాకు బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారని భంగపడ్డారు.  ఆ తర్వాతే జిట్టా ఆరోగ్య పరిస్థితి విషమించింది. జిట్టా తిరిగిరాని లోకాలకు చేరుకోవడం తెలంగాణవాదులను కలచివేసింది.