తమిళనాడులోనూ తరిమేశారా.. మళ్లీ ఏపీకే రోజా?
నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొద్ది కాలంగా ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో హీరోయిన్ గా రోజాకు మంచి పాపులారిటీయే ఉంది. దీనికితోడు ఆమె భర్త కూడా తమిళ సినీ రంగానికి చెందిన వ్యక్తి. అక్కడి భాషపై రోజాకు పట్టుంది. మరోవైపు ఏపీలో పర్యటక, క్రీడాశాఖల మంత్రిగా చేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రోజా అవినీతి అక్రమాలపై దృష్టిసారించింది. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో భారీ మొత్తంలో ఆమె అవినీతికి పాల్పడినట్లు విమర్శలున్నాయి. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఎన్ని నిధులు ఖర్చుచేశారు.. ఎన్ని నిధులు పక్కదారి పట్టాయనే విషయాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఏపీలో రాజకీయాల్లో కొనసాగితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన అవినీతిని బయటపెడుతుందని, తాను జైలుకెళ్లడం ఖాయమని రోజా భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఉండి కష్టాలుపడే బదులు.. తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని రోజా, ఆమె భర్త నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతూ వచ్చాయి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
తమిళ రాకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించిన రోజా ఆశలకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో ప్రముఖ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీఎంకే) పేరుతో కొత్తపార్టీ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు విజయ్, ఆయన అనుచరులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రోజా టీఎంకే పార్టీ ద్వారా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఆ మేరకు రోజా, ఆమె భర్త ప్రయత్నాలు చేశారు. కానీ ఏపీ రాజకీయాల్లో రోజా వ్యవహరించిన తీరును తెలుసుకున్న విజయ్.. టీఎంకే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రోజాకు అవకాశం ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. తమిళనాడులోని ఏపీ సరిహద్దుల్లో, తెలుగువారు అధికంగా ఉండే నియోజకవర్గంలో ఏదోఒక నియోజకవర్గంలో తనకు టికెట్ ఇవ్వాలని రోజా దంపతులు విజయ్ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. రోజా దంపతుల ప్రతిపాదనను విజయ్ తిరస్కరించారు. మీరు కోరుకునే నియోజకవర్గాల్లో మాకు ఇప్పటికే అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్పడం ద్వారా.. మీరు మా పార్టీలోకి రావాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పేశారు. టీఎంకేలో చేరేందుకు అవకాశం లేకపోవటంతో ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో చేరేందుకు రోజా దంపతులు ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీ అధిష్టానం కూడా రోజాకు నో చెప్పేసింబదని తెలిసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడా మీడియా సమావేశాల్లోనూ మాట్లాడిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్ లాంటి నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రోజా.. పలు సందర్భాల్లో అసభ్యకర పదజాలంతో వారిపై విమర్శలు చేశారు. దీంతో రోజా వ్యాఖ్యలు, రాజకీయాల్లో ఆమె ప్రవర్తన పట్ల వైసీపీ శ్రేణుల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. రోజా లాంటి నేతల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని పలువురు వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా, నగరి నియోజకవర్గంలో రోజాకు మరోసారి జగన్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితోపాటు.. రోజా కూడా పరాజయం పాలయ్యారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే తన ఓటమిని అంగీకరిస్తూ రోజా తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని మీడియా ముఖంగా చెప్పేశారు.
అయితే ఇప్పుడు తమిళనాట రాజకీయ ఎంట్రీకి అవకాశాలు లేవని తేలిపోవడం, అక్కడి రాజకీయ పార్టీలు ఆమెకు నో ఎంట్రీ బోర్డులు చూపడంతో రోజా అనివార్యంగా ఏపీకి తిరిగి వచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తరువాత ఇంత కాలానికి ఆమె మీడియా ముందుకు వచ్చారు.
నగరి నియోజకవర్గం పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలిజ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా ప్రసంగం విన్నవారంతా కుక్కతోక వంకరే అన్నట్లుగా ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా రోజా తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై మాట్లాడిన రోజా ఎన్నికలు సునామీలా వచ్చి వెళ్ళిపోయాయని అన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన ఓటమి కాదు.. ఏదో జరిగింది. ఏం జరిగిందన్నది ఏదో ఒకరోజు బయటకు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులు మనం చేయలేదని కామెంట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నామో.. ప్రతిపక్షంలోకూడా అలానే ఉంటామని చెప్పారు. అక్కడితో ఆగకుండా.. ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని నా కుటుంబసభ్యులుగా చూసుకుంటాను అంటూ రోజా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్తున్నారని వార్తలు రావడంతో సంతోష పడిన వైసీపీ నేతలు.. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలతో మమ్మల్ని వదిలి పెట్టవా తల్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ పై బూతులతో రోజా రెచ్చిపోయారు. రోజా, కొండాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి నేతల కారణంగానే వైసీపీ దారుణంగా ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రోజా వైసీపీలోనే కొనసాగినా ఆమె మాట తీరు మార్చుకోకపోతే ఊరుకోమని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా నగరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలైతే రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాలలో ఆమె ప్రమేయాన్ని అంగీకరించేది లేదంటూ అంటూ ఇప్పటికే వైసీపీ అగ్రనాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామని భావించిన రోజాకు అక్కడి పార్టీలు గట్టి షాక్ ఇవ్వడంతో మళ్లీ ఏపీలోనే రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఇక్కడ ఆమెకు పార్టీ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాల్సిందే.