విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉంటా.. సీఎం చంద్రబాబు 

బుడమేరు వరదతో నీట మునిగిన సింగ్ నగర్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. స్వయంగా బోటులో వెళ్లి బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది వారించినప్పటికీ, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద నీటిలోనే బోటులో వెళ్ళి ఆయన బాధితులు ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. అరగంట పాటు వరదనీటిలో ప్రవాహంలో తిరిగిన చంద్రబాబు, బాధితులను ఆదుకునేంత వరకూ తాను అక్కడే ఉంటానని ప్రకటించారు. ప్రస్తుతం బాధితులకు పూర్తిస్థాయిలో ఆహారం, తాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ని గంటగంటకూ సమీక్షిస్తానని చంద్రబాబు తెలిపారు.  సీఎం వెంట కలెక్టరేట్‌లోనే హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని కూడా వున్నారు. దాదాపు 6 వేల మందికి ఎంపీ కేశినేని చిన్ని ఆహారం ఏర్పాటు చేశారు. ఆహార సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని హోంమంత్రి ఆదేశం. ఆహార ప్యాకింగ్, సరఫరా బాధ్యత అక్షయపాత్ర, ఇతర సంస్థలకు అప్పగించారు. ఆహార ప్యాకింగ్, సరఫరా పనులకు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చాయి. అదేవిదంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల కోసం  మంగళగిరి అక్షయ పాత్ర కిచెన్‌లో దాదాపు లక్షా యాభై వేల మందికి ఆహార పదార్థాలు సిద్ధమయ్యాయి. 

ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటన!

మంగళగిరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ముంపు ప్రాంతాలకు చేరుకున్న లోకేష్ అధికారులతో కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత తాడేపల్లి నులకపేటలోని క్వారీ ప్రాంతంలో ఇళ్ళు నీట మునిగిన బాధితులను పరామర్శించారు. బాధితులకు పునరావాసం కల్పించి, ఆహార వసతి కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ని ఆదేశించారు. ముంపు నుంచి మంగళగిరికి శాశ్వతంగా విముక్తి కలిగేలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని బాధితులకు లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి గండాలయ్యపేటలోని కొండ చరియ విరిగిపడి మృతి చెందిన బాధిత కుటుంబాన్ని లోకేష్ పరామర్శించి, ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వారికి అందించారు. టిడ్కో గృహాలు, రత్నాల చెరువు చేనేత కార్మికులను కూడా పరామర్శించడం లోకేష్ షెడ్యూలులో వుంది. నారా లోకేష్ వెంట వివిధ విభాగాల అధిపతులు అధికారులు కూడా ఉన్నారు.

తీరం దాటిన తుఫాను.. నేడూ భారీ వర్షాలు

బగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపానుగా మారిన వాయుగుండం శనివారం (ఆగస్టు 31) అర్ధరాత్రి దాటిన తరువాత ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరం దాటి బలహీనపడింది. అయితే ఈ తుపాను ప్రభావంతో ఆదివారం (సెప్టెంబర్ 1) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా   శ్రీకాకుళం, విజయనగరం,  మన్యం అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,  గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక  విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. 

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిది పెద్ద ప్లానే!

వామ్మో... వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మామూలోడు కాదు.. మహా జాదూ.. అందుకే ఆయన భార్య వాణి, కుమార్తెలు దువ్వాడని అంతలా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ ఇష్యూగా మారిన దువ్వాడ ‘ఆయనకిద్దరు’ వ్యవహారం ఈమధ్యకాలంలో చల్లబడింది. ఇప్పుడు ఆ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. దువ్వాడ వారి రాసలీలల స్టోరీ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎంత మాస్టర్ కిలాడీలో బయటపెట్టే ఆధారం బయటకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి జీవితంలోకి ప్రవేశించిన మూడో మనిషి దివ్వెల మాధురి యాక్సిడెంట్ చేయడం, దువ్వాడ వాణి పెట్టిన టార్చర్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవడానికే యాక్సిడెంట్ చేశానని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే, అయి నిజంగా జరిగిన యాక్సిడెంటేనని, ఆత్మహత్యాయత్నం కోసం చేసిన యాక్సిడెంట్ కాదని బయటపడింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. దివ్వెల మాధురికి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆమెని అంబులెన్స్.లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌కి ఆమె ఫోన్ చేసింది. ఇలా తనకు యాక్సిడెంట్ జరిగిందని, తనను అంబులెన్స్.లో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారని మాధురి చెప్పింది. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌లో వున్న అసలు సిసలు వైసీపీ లీడర్ బయటకి వచ్చాడు. అయితే, నువ్వు పోలీసులకి, మీడియాకి ఆత్మహత్య చేసుకోవడానికే యాక్సిడెంట్ చేశానని చెప్పు. దువ్వాడ వాణి నన్ను వేధించినందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పు. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని మాధురికి చిలకకి చెప్పినట్టు చెప్పాడు. మాధురి కూడా అయితే నా దగ్గరకి వెంటనే మీడియాని పంపు.. నువ్వు చెప్పమన్నట్టే చెబుతాను అని చెప్పింది. ఈ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అలా వుంచితే, ఇంత రచ్చ చేసిన దివ్వెల మాధురిని ఇంకా పోలీసులు ఎందుకు అరెస్టు చేయాలేదో అర్థం కావడం లేదు. యాక్సిడెంట్ చేయడం, ఇలా పోలీసులను, మీడియాని తప్పుదోవ పట్టించడం లాంటి నేరాలు చేసిన మాధురి హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ, మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ టైమ్‌పాస్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ లీక్ తర్వాత అయినా పోలీసులు దువ్వాడ మాధురి విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి.

చెరువుల్లో భవనాలు.. అధికారుల మీద కేసులు..!

హైదరాబాద్ నగరంలో చెరువుల్లో అక్రమ కట్టడాలు నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఆరుగురు అధికారుల మీద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూల్చివేతలు చేపడుతూ సంచలనం సృష్టిస్తున్న హైడ్రా ఫిర్యాదు మేరకు ఈ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి తహశీల్దార్ పూల్ సింగ్, మేడ్చల్ - మల్కాజిగిరి లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్?‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి.

బుద్ధవనం సందర్శనకు థాయిలాండ్ బౌద్ధ బిక్షువుల ఆసక్తి

ఆహ్వానించిన బుద్ధవనం అధికారి శివనాగిరెడ్డి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని వాట్ త్రెమిట్ లో ఉన్న ఫ్ర బుద్ధ మహా సువర్ణ ప్రతిమాకర బౌద్ధాలయ భిక్షులను, బుద్ధవనం బుద్ధిష్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ మరియు  ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ  డాక్టర్ఈమని శివనాగిరెడ్డి ఆహ్వానించారు.  బ్యాంకాక్ లోని మహారాణి సిరికిటి నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న పసిఫిక్ ఆసియా ట్రావెల్ ఏజెన్సీ (పాటా) 50వ సమావేశానికి ఆయన తెలంగాణ పర్యాటకశాఖ ప్రతినిధిగా హాజరయ్యారు. పాటా సమావేశ ప్రదర్శనశాలలో తెలంగాణ పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థ వెల్కమ్ టు బుద్ధవనం పేరిట ఏర్పాటు చేసిన స్టాల్ ను తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. తెలంగాణ స్టాల్ ను ఇప్పటివరకు 800 మంది అంతర్జాతీయ పర్యాటక సంస్థల ప్రతినిధులు సందర్శించారు. వారికి తెలంగాణ పర్యాటక కేంద్రాలతో పాటు, నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకతలను శివనాగిరెడ్డి వివరించారు.  సదస్సులో భాగంగా స్థానిక బౌద్ధాలయాలను సందర్శించిన ఆయన, గోల్డెన్ బుద్ధ ఆలయంలోని బౌద్ధ భిక్షులకు కలిసి ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశంలో నిర్మించిన బుద్ధవనం బ్రోచర్ ను వారికందించి, సందర్శించవలసిందిగా ఆహ్వానించారు. గోల్డెన్ బుద్ధ ఆలయ వాస్తు, శిల్పానికి మంత్రముగ్ధుడైన శివనాగిరెడ్డి మాట్లాడుతూ క్రీ.శ 13వ శతాబ్దిలో సుఖతోయ్ రాజులు నిర్మించిన ఈ బంగారు బుద్ధుని విగ్రహం భారతీయ ప్రతిమా లక్షణాలతో అలరారుతుందని అన్నారు. క్రీ.శ. 1403లో బ్యాంకాక్ ప్రాంతానికి ఈ విగ్రహం తరలించబడిందనీ, బర్మా దేశీయుల దాడి నుంచి కాపాడుకోవడానికి స్థానిక ఆయుత్థాయ రాజవంశీయులు ఈ బంగారు విగ్రహంపై సున్నపు గారను పూసి, ఆయుత్థాయ బౌద్ధారామ శిథిలాల్లో దాచి పెట్టారన్నారు.  క్రి.శ. 1891లో మొదటి రామునిగా బిరుదాంకితుడైన బుద్ధ   యోధ చూలలోకే అనే సియాం రాజు, బ్యాంకాక్ నగరానికి తరలించగా, ఆ విగ్రహాన్ని మూడో రాముడు ఆసియాటిక్ ప్రాంతానికీ, 1935లో తర్వాతి పాలకులు ప్రస్తుత ఆలయ ప్రాంగణానికి తరలించి, సున్నపు గారను తొలగించి, మళ్లీ బంగారు ప్రతిమను, నగిసషీ గావించారని చెప్పారు. బంగారు బుద్ధ ఆలయ సందర్శనలో తెలంగాణ పర్యాటక శాఖ ప్రతినిధులు మహేష్, ఎస్ఈ సరిత, ప్రభాకర్ పాల్గొన్నట్టు శివనాగిరెడ్డి తెలిపారు.

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు!

విజయవాడలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. స్థానిక క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. నాలుగు ఇళ్ళు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రొక్లెయినర్ల సహకారంతో కొండ రాళ్లను తొలగిస్తున్నారు. సహాయక చర్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీపీ రాజశేఖర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదని అనుకున్నారు. అయితే ఆ తర్వాత శిథిలాల కింద కొంతమంది వున్నారని గుర్తించారు. వారిలో ఇద్దరు అప్పటికే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.  ప్రభుత్వం పరంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని స్థానికులకు అధికారులు హామీ ఇచ్చారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం పరంగా సాయం అందిస్తామని అధికారులు, నాయకులు ప్రకటించారు.

హైడ్రా దూకుడు ఆరంభశూరత్వమేనా?

మహానగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇదే దూకుడును చివరి వరకూ కొనసాగించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు.  చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కారణంగనే విశ్వనగరం అని చెప్పుకునే భాగ్యనగరం చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతోంది. కాలనీలకు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి. ఇలా చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలలో జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ లో నిర్మించిన జగన్ నివాసం కూడా ఉంది. ఇప్పుడు ఆ జగన్ నివాసానికి సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇవ్వం కూల్చివేయడమే అని గంభీరంగా ప్రకటించిన హైడ్రా కమషనర్ రంగనాథ్.. మరి జగన్ లోటస్ పాండ్ నివాసాన్ని కూల్చివేయకుండా నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. చెరువులను ఆక్రమించి నిర్మించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇచ్చారంటే అర్ధం ఉంది. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశాన్ని తప్పుపట్టలేం. కానీ జగన్ లోటస్ పాండ్ వంటి నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు.  నిబంధనల ప్రకారం కూల్చివేయడానికి హైడ్రా ఎందుకు వెనకాడుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి తిరుపతి రెడ్డి భవనానికి కూడా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే నోటీసులు లేవు కూల్చివేతలే అంటున్న రంగనాథ్ మాటల ఉత్తుత్తి బెదరింపులేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది.   ఇటీవల తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది హైడ్రాయే.  హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ అధారిటీ. దీనిని తెలంగాణ    సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సాహసోపేతంగా చెరువులు, కుంటలు,నాళాలు ఆక్రమించుకున్న కబ్జాకోరుల ఆట కట్టించి నగరానికి ఏర్పడుతున్న వరదల ముప్పు నుంచి కాపాడాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేశారు.  ఆయన చెరువులు, కుంటలను ఆక్రమణల నుంచి విముక్తి చేయాలన్న ఉక్కు సంకల్పంతో ఉన్నారనడానికి  సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూలగొట్టడమే ఉదాహరణ. తుమ్మడి కుంట చెరువు ఆయకట్టులో మూడున్నర ఎకరాలు ఆక్రమించారని స్పష్టమైన ఆధారాలతో నోటీస్ కూడా ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. రాష్ట్రప్రభుత్వంతో పాటు హైడ్రా అధికారులకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.రే వంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆరంభశూరత్వం కాదని మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంఘటన నిరూపించింది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్ కన్వెన్షన్ వద్ద హడావుడి చేసింది.అయ్యప్ప సోసైటీ పరిధిలో అక్రమకట్టడాలను కొన్ని కూల్చి ఆ తరువాత ఆ ఊసే మర్చిపోయింది. గత పదేళ్లుగా అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం ఆక్రమణలు, చెరువులపై అక్రమకట్టడాల జోలికి పోలేదు.  చెరువులు,నాళాల ఆక్రమణల కారణంగా చిన్న పాటి వర్షానికి కూడా రోడ్లు నదులుగా మారిపోతున్నా,జనం నరక యాతన అనుభవిస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఊరుకున్నది. నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ 14 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆక్రమణల ఊసెత్తలేదు. చెరువల సంరక్షణ గురించి పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్ కాస్తా వాన పడితే హైదరాబాధ అన్నట్లుగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ కు ఈ నరక బాధను తప్పించాలన్న ధృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసింది.  అది పని ప్రారంభించింది. నగరంలో అనేక చెరువులు పూడ్చి విద్యా సంస్థలను నిర్మించారు. వాటిలో ఓవైసీ, మల్లారెడ్డి వంటి ప్రముఖులవి కూడా ఉన్నాయి. ఆయా యజమానులు ప్రభుత్వ దూకుడుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు. అలాగే పలువురు మధ్యతరగతి కుటుంబాలు కూడా కోర్టులను,అధికారులను ఆశ్రయిస్తున్నారు. విద్యా సంస్థలను కూల్చివేసి విద్యార్ధులకు విద్యా సంవత్సరం నష్టం చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే కాకపోయినా వారికి కొంతసమయం ఇచ్చి ఈ అక్రమ కట్టడాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే 20,30 సంవత్సరాలు గా ఉంటున్న కుటుంబాలు తమ గతేమిటని ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలకు అధికారులే  చట్టపరంగా  అనుమతి ఇచ్చారు. అలా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన ఆధికారులపైనా చర్యలకు ఉపక్రమించారు అది మంచిదే. కానీ చట్టబద్ధంగా అనుమతి పొందిన నిర్మించిన భవనాలకు చట్ట విరుద్ధం అంటూ ఎలా కూల్చేస్తారన్నది ప్రశ్న. మొత్తం మీద హైడ్రాది ఆరంభశూరత్వంగానే మిగిలిపోతుందా? నగరంలోని ప్రతి అక్కమకట్డాన్నీ నేలమట్టం చేసే వరకూ ఇదే దూకుడు ప్రదర్శిస్తుందా అన్నది చూడాలి. 

జగన్ లోటస్‌పాండ్ ఇంటికి హైడ్రా నోటీసులు!

సాగినంతకాలమే ఎవరికైనా హవా నడుస్తుంది. బ్యాడ్ టైమ్ మొదలైందంటే పతనమే..! మాజీ ముఖ్యమంత్రి జగన్‌ నెత్తిన దరిద్రం తాండవిస్తూ వున్నట్టుంది. అన్నివైపుల నుంచి ఆయన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఆయనకు మరో సమస్య వచ్చిపడింది. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ దగ్గర వున్న ఆయన ఇల్లుని ఎందుకు కూల్చేయకూడదో చెప్పాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్.లోని నాగమయ్యకుంట చెరువును ఆక్రమించి జగన్ ఇల్లు కట్టారని పేర్కొంటూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. గతంలో హైడ్రా రంగప్రవేశం చేయకముందు జగన్ లోటప్ పాండ్ ముందు సెక్యూరిటీ గార్డుల కోసం నిర్మించిన కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఇంటికే ఎసరు పెట్టినట్టు అర్థమవుతోంది. 

విశాల్ గున్ని ఇమేజ్ మటాష్..!

కర్నాటకకు చెందిన విశాల్ గున్ని కష్టపడి చదువుకుని ఐపీఎస్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కి ఎంపికయ్యాడు. తన బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి విశాల్ గున్నికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి ఇమేజ్ ఏర్పడింది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా వుండే విశాల్ గున్నిని సోషల్ మీడియా సొంతం చేసుకుంది. విశాల్ గున్ని ఎప్పుడు రోడ్డుమీద కనిపించినా, ఆయన్ని వీడియో తీసేసి సోషల్ మీడియాలో అదిరిపోయే మ్యూజిక్‌తో పోస్టు చేసే అభిమానులు బాగా పెరిగిపోయారు. విశాల్ గున్ని కనిపించిన వీడియోలకు భారీ స్థాయిలో వ్యూస్ వుండేవి. ‘‘సిన్సియర్ పోలీస్ ఆఫీసర్’’, ‘సెల్యూట్ విశాల్ గున్ని సర్’’, ‘‘రియల్ హీరో విశాల్ గున్ని’’ లాంటి కామెంట్లు సదరు వీడియోలకు వుండేవి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో హీరో ఇమేజ్ అనుభవిస్తున్న విశాల్ గున్ని తన ఇమేజ్‌కి భిన్నమైన విలన్ పనులు చేయడం మొదలుపెట్టాడు. జగన్ ప్రభుత్వం అండతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస రాజ్యాన్ని సృష్టించిన పోలీసు అధికారుల జాబితాలో విశాల్ గున్ని పేరు కూడా చేరింది. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాల్ గున్నికి ప్రభుత్వ ఏ బాధ్యతనూ అప్పగించకుండా వెయిటింగ్‌లో వుంచింది. వెయిటింగ్‌లో వుంచాం కదా అని ఇంట్లో కూర్చుంటే కుదరదు, రోజూ ఆఫీసుకు వచ్చి సంతకం చేసి ఆఫీస్ టైమింగ్స్ అయిపోయే వరకు ఆఫీసులోనే వుండాలని డీజీపీ ఆర్డర్ వేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా, సంతకం చేయడానికి వెళ్ళకుండా విశాల్ గున్ని ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, హీరోయిన్ కాదంబరి విషయంలో ప్రవర్తించిన తీరు మరో ఎత్తు. హీరోయిన్ కాదంబరిని తప్పుడు కేసులో ఇరికించడానికి మూడు పోలీసు బుర్రలు చాలా తెలివిగా వ్యవహరించాయి. ఆ తప్పుడు కేసు వ్యవహారంలో విశాల్ గున్ని బుర్ర కూడా ఇన్వాల్వ్ అయింది. హీరోయిన్ కాదంబరిని ఏరకంగా కేసులో ఇరికించారు... ఏరకంగా ఆమె కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారనే విషయం ఒక్కోక్కటి బయటపడుతుంటే, విశాల్ గున్ని ఇంత దుర్మార్గుడా అని అర్థం చేసుకుని జనం నోళ్ళు తెరుస్తున్నారు. ఇంతకాలం విశాల్ గున్నిని హీరోగా భావించినవాళ్ళు ఇతను హీరో కాదు.. విలన్ అనే జ్ఞానోదయాన్ని పొందారు. ఆర్నెల్లు కలసి తిరిగితే వారు వీరు అవుతారన్నట్టుగా జగన్‌తో రాసుకుని పూసుకుని తిరిగిన పాపానికి విశాల్ గున్ని ఇమేజ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. హీరోయిన్ కాదంబరి కేసు వల్ల విశాల్ గున్నిని సర్వీసు నుంచి కూడా తొలగించే అవకాశం వుందని అంటున్నారు. 

కాలవలోకి దూసుకెళ్లిన ఆటో.. స్కూలు పిల్లలకు తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్ లో స్కూలు పిల్లలతో వెడుతున్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. అయితే ఆటో ఒక పక్కకు ఒరిగి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మచలీపట్నంలో జరిగింది.   దాదాపు 20 మంది చిన్నారులతో కొన గ్రామానికి వెడుతున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పింది. ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో వేగాన్ని పూర్తిగా నియంత్రించడంతో ఆటో కాలువలో పడిపోకుండా పక్కకు ఒరిగి ఆగిపోయింది. దీంతో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కోన రహదారి గుంతలమయంగా ఉండటమే కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆటోలో 20 మంది పిల్లలు ఉన్నారు.  ఇప్పటికైనా కోన రహదారికి మరమ్మతులు చేయాలనీ, అలాగే రోడ్డు వైడెనింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల  ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ , రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా శనివారం తెల్లవారు జాము నుంచీ హైదరాబాద్ నగరంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. జల్లుగా మొదలైన వర్షం క్రమంగా జోరందుకుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపై నీరు చేరింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అంతా ముసురుపట్టినట్లు మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

అన్ స్టాపబుల్ బాలయ్య

అర్ధ శతాబ్ద సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. సినీ  రాజకీయ రంగాలలో  అన్ స్టాపబుల్ గా సాగాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందించారు.  నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ రంగాలలో అన్ స్టాపబుల్ గా సాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఆయన ఓ ప్రకటనలో  సినీ హీరోగానే కాకుండా ప్రజా నేతగా కూడా బాలకృష్ణ అందరి అభినందనలూ అందుకుంటున్నారని పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఐదు దశాబ్దాల కిందట తాతమ్మ కల సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారని పేర్కొన్న చంద్రబాబు, తండ్రి బాటలోనే రాజకీయ ప్రవేశం చేసి ప్రజా నేతగా గుర్తింపు పొందారన్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్ల విజయం సాధించి ప్రజా నేతగా కొనసాగుతున్నారని అభినందించారు.  నందమూరి బాలకృష్ణ అల్లుడు, మంత్రి నారా లోకేష్ కూడా అభినందనలు తెలిపారు. 1974లో సీనిరంగంలోకి ప్రవేశించిన మామయ్య ఐదు దశాబ్దాలలో 109 సినిమాలలో హీరోగా ఎన్నోఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారని, గాడ్ ఆఫ్ మాసెస్ గా గుర్తింపు పొందారని లోకేష్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజా నేతగా రాజకీయాలలోనూ రాణిస్తున్నారనీ, సేవా కార్యక్రమాలలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ కు వాయు‘గండం’

ఆంధ్రప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాంద్ర, కోస్తా రాయలసీమల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా రాష్ట్రంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నగరంలో  ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెజవాడ నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.  ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండపాలెంలో శుక్రవారం ఆగస్టు 30) రాత్రి నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.తీర ప్రాంతాలలో శనివారం 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనీ, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్న ఐఎండీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.  

రోజురోజుకూ పెరుగుతున్న జంపింగ్ ల జాబితా.. వైసీపీ ఇక ఎంప్టీయేనా?

వైసీపీలో సంక్షోభం తార స్థాయికి చేరింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు ముందు ఆ పార్టీలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. మరో వైపు ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో స్వయంగా జగన్ కే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. పోలీసుల నోటీసు స్వీకరించి విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించక తప్పదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన ఉంటుందా? రద్దు అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న సమయంలో  ఆయన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాలకు వెళ్లడం ఏమిటని సొంత పార్టీ నేతలే అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే వైసీపీ రాజ్యసభ సభ్యులలో అత్యధికులు పార్టీనీ వీడడానికి రెడీ అయిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం  జరుగుతోంది. సాధారణంగా అయితే ఆ ప్రచారాన్ని పార్టీ ఖండించాలి. లేదా పార్టీ మారిపోతున్నారంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కనీసం వారైనా అటువంటిదేమీ లేదనీ, తాము పార్టీలోనే కొనసాగుతామని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. కానీ వైసీపీ నుంచి కానీ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల నుంచి కానీ అటువంటి ఖండనలేవీ రాలేదు. ఒక్క విజయసాయి రెడ్డి మాత్రం ట్విట్టర్ వేదికగా అటువంటి ఖండన ఒకటి చేశారు. అయితే ఆయన అలా ఖండించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. యన తన ఖండన ద్వారా సొంత పార్టీ శ్రేణులలోనే జగన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? లేక పార్టీ మారిపోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా చేశాయి. ఎందుకంటే ఆయన గోడ దూకేస్తున్నారన్న ప్రచారం అంత వరకూ లేదు. విజయసాయి, సుబ్బారెడ్డి వినా వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఇంకెవరూ మిగలరన్న ప్రచారమే విస్తృతంగా జరుగుతోంది. అటువంటి సమయంలో తాను పార్టీ మారే ప్రశక్తే లేదంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఆ సంగతి అలా ఉంచితే..  పార్టీ అధిష్ఠానం ఎంపీలకు తాఖీదు పంపింది. పార్టీ మార్పు వార్తలను పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఖండించాలని ఆదేశించింది. జగన్ హయాంలో పాలన బ్రహ్మాండంగా సాగిందనీ, ప్రజా సేవలో తామంతా తరించామని చెప్పాలన్నది ఆ ఆదేశాల సారాంశం.   ఆ తాఖీదు అందుకున్న తరువాత  ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి తాడేపల్లికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను పార్టీ మారే ప్రశక్తే లేదని చెప్పారు. అయితే ఆయన ఖండనను సొంత పార్టీ వారే నమ్మడం లేదు. అలాగే మరో  రాజ్యసభ సభ్యుడు కూడా హైదరాబాద్ లోనే మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ తాను పార్టీ మారే ఉద్దేశంలో లేనని చెప్పుకున్నారు. ఆయనను కూడా ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన పార్టీలను ఎలా మారుస్తారో అందరికీ తెలుసు. అసలు ఆయన వైసీపీలో చేరిందే రాజ్యసభ సభ్యత్వం కోసం అని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  వీరు వినా మరెవరూ తమ పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. అంటే వారంతా తాము వైసీపీని వీడుతున్నామని ధృవీకరించేసినట్లే.  వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేసేశారు. వారి రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ ఆమోదించేశారు. అంటే ఇక వైసీపీకి రాజ్యసభలో మిగిలిన సభ్యులు తొమ్మిది మంది.   వీరిలోనూ పలువురు రాజీనామా బాటలోనే ఉన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను పట్టించుకోకుండా  తమ పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించని వాంతా మారిపోవడం ఖాయమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సరే రాజ్యసభ సభ్యుల విషయం అలా ఉండగా పార్టీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామాల బాట పడుతున్నారు.  కర్రి పద్మ, బల్లి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం (ఆగస్టు 30)న రాజీనామాలు చేశారు. మరికొందరు   టీడీపీతో టచ్ లో ఉన్నారు.  వైసీపీ అధిష్ఠానానికి అందుబాటులోకి రావడం లేదు. దీంతో మండలి సభ్యులలో ఎంత మంది వైసీపీలో ఉంటారు? ఎందరు గోడ దూకేస్తారు అన్న విషయంలో క్లారిటీ లేదు.    పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆ సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం మీద వైసీపీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, జగన్ విదేశీ పర్యటనకు ఇలా బయలు దేరగానే అలా పార్టీ చాలా వరకూ ఖాళీ అయిపోతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ కేసులో పోలీసు స్టేషన్ కు జగన్?!

రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కనున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ పై ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా  ఈ కేసులో నిందితులకు నోటీసులు పంపించేందుకు సమాయత్తమౌతున్నారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు సహా మరికొందరిని పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి విచారణాధికారుల ఇప్పటికే అప్పటి గుంటూరు సీఐడీ ఏఎస్పీకీ విజయ్ పాల్ కు నోటీసు జారీ చేశారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు.  అప్పటికి నరసాపురం ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు అప్పటి వైసీపీ ప్రభుత్వ తీరుపై, జగన్ విధానాలపై విమర్శలు గుప్పించడంతో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి సీఐడీ పోలీసులు రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను  కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు  ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయనున్నారు.  కాగా ఈ కేసులో జగన్ కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ నోటీసులను అందుకుని జగన్ పోలీసు స్టేషన్ కు వస్తారా లేక కోర్టును ఆశ్రయించి తనపై అభియోగాలను క్వాష్ చేయాలని కోరుతారా అన్నది చూడాల్సి ఉంది.  

అన్నను కాదని ఉత్తమ్ సిఎం అంటూ రాజగోపాల్ రెడ్డి కొత్త రాగం

కాంగ్రెస్  పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్తా ఎక్కువే . తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది.  గత బిఆర్ఎస్  సర్కారు అవినీతి, అహంకారం వల్ల అధికారం కోల్పోయింది. ఐక్యతారాగం లేకపోవడం వల్ల పదేళ్లు కాంగ్రెస్ కూడా అధికారంలో రాలేకపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అయితే ఆ క్రెడిట్ మాత్రం అప్పటి టిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కొట్టేశారు. టిఆర్ ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలు ఓడించవు. అంతర్గత కుమ్ములాటల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇది చరిత్ర. చరిత్ర చెప్పిన గుణ పాఠాలతో ఇన్నాళ్లు బుద్దిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మెల్లి మెల్లిగా బయటపడుతున్నారు.  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అని  స్వయంగా ఆయన భార్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అంటూ ఒక వర్గం ప్రచారం చేసింది. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ కొత్త రాగం అందుకున్నారు.  భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో రాజగోపాల్ ఈ మాట అన్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరి మునుగోడు టికెట్ పై  గెలిచిన రాజగోపాల్ చేసిన ఆసక్తికర  వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తన నాలుక మీద పుట్టు మచ్చలు ఉన్నాయి కాబట్టి నిజం అవుతుందన్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.