వైసీపీ నేతలను తరిమేస్తున్న ముంపు బాధితులు!
posted on Sep 5, 2024 @ 10:25AM
విజయవాడను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షానికి తోడు బుడమేరు ఉధృతికి బెజవాడ నగరం చిగురుటాకులా వణికిపోయింది. బుడమేరు ముంచెత్తడంతో ఐదు నుంచి ఎనిమిది అడుగుల వరద నీటిలో అజిత్ సింగ్‌నగర్, పాయకాపురంతోపాటు పలు ప్రాంతాలు మునిగిపోయాయి. రాత్రివేళల్లో చిమ్మచీకటిలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించారు. వారికి ఆహారం, తాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. రాత్రిపగలు తేడా లేకుండా ముంపు ప్రాంతంలో బోటుపై ప్రయాణిస్తూ నేనున్నా.. భయపడకండి అంటూ బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో వరద బాధితులకు సకాలంలో ఆహారం, తాగునీరు అందింది. బోట్లు వెళ్లలేని వరద మంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కిమరీ చంద్రబాబు వెళ్లారు. అక్కడి బాధితులకు ధైర్యం చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి 74ఏళ్ల వయస్సులో కూడా చంద్రబాబు పడుతున్న తపనను, చేస్తున్న కృషిని, పడుతున్న కష్టాన్నిచూసి జనం జేజేలు పలుకుతున్నారు. కొందరు ముంపు బాధితులయితే.. మా ప్రాణాలు కాపాడిన దేవుడు చంద్రబాబు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు నిద్రమానుకొని రాత్రింబవళ్లు కష్టపడుతుంటే.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరు వరద నుంచి విజయవాడ నగరం క్రమంగా తేరుకుంటోంది. అజిత్ సింగ్‌నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80శాతం ముంపు నుంచి బయటపడ్డాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు సాగుతున్నాయి. మంత్రులు, అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటున్నది. అయితే, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జగన్ మోహన్‌రెడ్డి బాధితులకు ధైర్యం కల్పించాల్సిందిపోయి.. చంద్రబాబుపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత నిచ్చారు. చంద్రబాబు వల్లే విజయవాడకు ఈ దుస్థితి వచ్చిందంటూ అర్థపర్దం లేని లాజిక్కులు చెప్పాడు. బుడమేరు గేట్లు ఎత్తేశారని ఒక సారి, బుడమేరు నది అని మరోసారి మాట్లాడి తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు. దీంతో జగన్ తీరుపై ముంపు ప్రాంతాల ప్రజలే కాదు, వైసీపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. విజయవాడ వరద ముంపు నుంచి తేరుకుంటున్న సమయంలో వైసీపీ నేతల పర్యటనలు మొదలయ్యాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి వాస్తవాలను గుర్తించకుండా బాధితులకు ఆహారం, తాగునీరు అందడం లేదని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాటిని వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అన్నిసౌకర్యాలు కల్పిస్తుంటే జగన్ అనుకూల సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారంపై నగర వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాంతాల్లోకి వచ్చిన వైసీపీ నేతలను తరిమేస్తున్నారు.
నగరంలోని రాజరాజేశ్వరి పేటలో బుధవారం (సెప్టెంబర్ 4) సాయంత్రం మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బొత్సకు నిరసన సెగ ఎదురైంది. తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బొత్సను బాధితులు నిలదీశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం తమకు అందకుండా అడ్డుపడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఇప్పటి వరకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో లేనోళ్లం ఏటి సేత్తాం అంటూ.. స్థానికుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బొత్స అక్కడి నుంచి వెనుదిరిగాడు. బొత్స పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ బాధితుల నుండి నిరసన వ్యక్తమైంది. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేత, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. బాధితులకు సరిగా సాయం అందించడం లేదంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో స్థానికులు తమకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ఎమ్మెల్యేకు చెప్పే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడు. నాలుగు రోజులుగా కూటమి నాయకులు అన్ని విధాలుగా సహాయం అందిస్తుంటే.. ఇప్పుడు వచ్చి బురద రాజకీయాలు చేయడంపై స్థానికులు మండిపడ్డారు. మొండితోక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అతన్ని అక్కడి నుంచి తరిమేశారు.
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం తప్పుకాదు. కానీ, పరామర్శల పేరుతో ముంపు ప్రాంతాల్లోకి వెళ్లి రాజకీయాలు చేయడం చాలా తప్పు. ఒకపక్క సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ముంపు ప్రాంతాల్లో వేగంగా ఆహారం, తాగునీరు, పండ్లు, పాలు పంపిణీ జరుగుతున్నది. ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు పరామర్శ పేరుతో వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తీరుమార్చుకోవాలని, ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయం చేస్తే పర్వాలేదు.. రాజకీయాలు చేస్తే తరిమికొడతామని ముంపు ప్రాంతాల్లోని ప్రజలు హెచ్చరిస్తున్నారు.