బీఎస్పీ.. ‘బహు’విధాలా పతనం!?
ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు దూరంగా నేల విడిచి సాము చేస్తే, ఏ రాజకీయ పార్టీకైనా సరే ప్రజాక్షేత్రంలో పరాభవం, ఎన్నికల యుద్ధంలో పరాజయం తప్పదు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకుని రెండు పార్టీలూ రాజకీయ ప్రయోజనం పొందాయి.
2019 సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలూ కూడా ప్రజా క్షేత్రంలో బోల్తాపడ్డాయి. అప్పటి పొరపాట్లను సవరించుకుని విభేదాలను పరిష్కరించుకుని సజావుగా సీట్ల పంపకం చేసుకుని ఈ ఎన్నికలలో మెరుగైన ప్రదర్శన చేయగలిగాయి. రాష్ట్రంలో ఎదురు లేదు అనుకుంటూ విర్రవీగుతున్న కమలం రేకులను చాలా వరకూ ఈ కూటమి రాల్చేయగలిగింది. అయితే చేసింది ఇదే. ఈ రెండు పార్టీలూ కలిసి గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రచారం చేపట్టాయి. రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛలు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని, పాలక బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. బలహీనవర్గాలను, ఓబీసీలను, ముస్లింలను, క్రైస్తవులను బీజేపీకి వ్యతిరేకం చేయడంలో విజయం సాధించాయి. మండల్ సంవత్సరాల నాటి కుల సమీకరణాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ రెండు పార్టీలూ కలిపి 43 లోక్ సభ స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఓటు వాటాను పెంచుకున్నాయి. దళితులను, మైనారిటీలను ఓటు బ్యాంకులుగా మార్చుకో గలిగాయి.
ఇందుకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) కేవలం 9.4 శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగింది. 2022 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువ. ఈ పార్టీకి అనేక సంవత్సరాలుగా విధేయులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటున్న వర్గాలు కూడా కూడా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వైపు మళ్లిపోయారు. ఈ దళిత వర్గాలే కాదు, బహుజన సమాజ్ వాదీ పార్టీకి ఎన్నో ఏళ్ల పాటు మద్దతుగా నిలిచిన ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాలు, ఓబీసీలు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. వాస్తవానికి ఈ వర్గాలను, తమవైపు తిప్పుకోవడానికి ఎన్నికల సమయంలోనే కాదు, అంతకు ముందు కూడా బీఎస్పీ పెద్దగా చేసిందేమీ లేదు.
దాదాపు 24 ఏళ్ల కిందట కాన్షీరామ్ నాయకత్వంలో ఒక ఉద్యమంగా ఆవిర్భవించిన బీఎస్పీ అచిరకాలంలోనే రాష్ట్రంలోని దళితులనే కాక, దేశవ్యాప్తంగా దళిత వర్గాలను, అల్ప సంఖ్యాక వర్గాలను ఆకట్టుకుని సంచలనం సృష్టించింది. ఎన్నికల అనంతర సంకీర్ణ ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచింది. 2007లో బీఎస్పీ సొంతంగా ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత ఈ పార్టీ సిద్ధాంతాలు మరింతగా విస్తరించాయి. మరిన్ని వర్గాలను కూడగట్టుకోవడానికి ప్రణాళికలు రచించినప్పటికీ పార్టీలో వైరుద్ధ్యాలు ప్రారంభమయ్యాయి. ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల స్థాయి, వారి ప్రాధాన్యం బాగా పెరిగింది కానీ, అధికారాలను పంచడం, పాలనా వ్యవహారాల వికేంద్రీకరణ వంటి సామాజిక, ఆర్థిక సంస్కరణల ద్వారా వారి అభ్యున్నతిని సాధించడం మాత్రం జరగలేదు.
కాగా, 2012 తర్వాత అధికారం నుంచి వైదొలగడంతో బీఎస్పీ కార్యకలాపాల్లో స్తబ్ధత చోటు చేసుకుంది. ఆందోళనలు, ఉద్యమాలు, ప్రదర్శనలతో రాష్ట్రాన్ని, పాలక పక్షాన్ని హోరెత్తించాల్సిన బీఎస్పీ అధినేత్రి మాయావతి కేవలం మీడియా సమావేశాలు, ప్రెస్ రిలీజ్ లకు పరిమితమయ్యారు.దీంతో కార్యకర్తలలో ఉత్సాహం నీరుగారిపోయింది.
బీజేపీకి, కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీ పొత్తు తమ పార్టీకి ఏ మాత్రం అవరోధం కాదని ఎన్నికల సమయంలో పదే పదే చెప్పిన మాయావతి, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చివరికి ఓట్లను కూడా చీల్చలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత మాయావతి ఆత్మవిమర్శ చేసుకోవడం మాని ఈవీఎంలను తప్పుపడుతున్నారు. ముస్లింల నుంచి తమకు ఆశించిన మద్దతు లభించలేదని ఆ వర్గాన్ని విమర్శిస్తున్నారు. తన కారణంగానే పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారవుతున్న విషయాన్ని మాత్రం ఆమె అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఈ పార్టీలో మళ్లీ జవజీవాలు నింపాలంటే ఆమె తన తీరును, వైఖరిని మార్చుకోవాలి. లేకుంటే బీఎస్పీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఆ స్ఖానాన్ని బీఎస్పీ నుంచి చీలి కొత్త పార్టీగా ఏర్పడిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఆక్రమించడానికి ఎంతో కాలం పట్టదన్నది పరిశీలకుల విశ్లేషణ.