జగనోన్మాద బాధితులు.. ఉద్యోగులు!
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై అరాచకాలు పెరిగిపోయాయి.. మనందరి ప్రభుత్వంలో ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం.. ఉద్యోగుల సంక్షేమానికి మనందరి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇవీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు. ఔను.. ఐదేళ్లు అధికార మదంతో అరాచక పాలన సాగించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా పలికిన చిలుకపలుకులు. అధికారంలోకి వచ్చేవరకూ మేకవన్నె పులిలా.. ప్రజలు, ఉద్యోగులు ఏది చెబితే అది చేస్తానని నమ్మించారు. ఒక్కసారి అధికారం ఇవ్వండి ఫ్లీజ్ అంటూ బతిమలాడుకున్నారు. జగన్ మాయ మాటలు నమ్మిన ప్రజలు 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే జగన్ లో క్రూరమైన మృగం బయటకొచ్చింది. ప్రజలు, ఉద్యోగులు ఎవరైనా తన కాళ్లకిందే ఉండాలన్నట్లుగా జగన్ అధికార మదంతో విర్రవీగారు. ఉద్యోగులను పెట్టిన చిత్రహింసలు అన్నీఇన్నీకావు. జగన్ హయాంలో భయంతో ఎవరూ బయటకు చెప్పుకోలేక పోయారు. తాజాగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఊపిరిపీల్చుకున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు.. గత ఐదేళ్లలోతాము అనుభవించిన ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల పట్ల జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో ఉన్నంతకాలం ఉద్యోగ సంఘాల నేతలు వణికిపోయారు. ఉద్యోగుల సమస్యలపై నోరెత్తకుండా, తనకు అనుకూలంగాఉన్న ఉద్యోగ సంఘాల నేతలకే తన హయాంలో జగన్ ప్రాధాన్యతనిచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం, ఉద్యోగుల సమస్యలపై పోరాడే ఉద్యోగ సంఘాల నేతలను జగన్, ఆయన గ్యాంగ్ చెప్పుకోలేని ఇబ్బందులకు గురి చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులను జగన్ సర్కార్ మోసం చేసింది. ఇదేమని ప్రశ్నిస్తే.. ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలవడం, ఏమీ తేల్చకుండా పంపించడం. గట్టిగా ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేయడం జగన్ హయాంలో రివాజుగా మారిపోయింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయరెడ్డి ఇలా ఒక్కరేంటి.. ప్రతి ఒక్కరూ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేసిన వారే. ఒకానొక సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలంటూ విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారంటే.. ఉద్యోగ సంఘాల నేతలు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో అర్థంచేసుకోవచ్చు. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచి పెట్టిన జగన్.. ఉద్యోగులను, వారి సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు.
పీఆర్సీ అమలు విషయంలో జగన్ సర్కార్ చేసిన అన్యాయంపై ఉద్యోగులు 2022 ఫిబ్రవరిలో గర్జన పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, పింఛను దారుల సంఘాలు పోలీసుల నిర్భందాలను దాటుకొని విజయవాడకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో జగన్, ఆయన గ్యాంగ్ కు ముచ్చెమటలు పట్టాయి. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గుర్తించిన జగన్ ప్రభుత్వం కాస్త తగ్గినట్లు కనిపించినా వారి సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు. సీఎం హోదాలో జగన్ మోహన్‌రెడ్డి చేసిన మరో ఘోర తప్పిందం.. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టడం. ఈ వ్యవహారం దేశం యావత్తు నివ్వెరపోయేలా చేసింది. బడుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు.. సిగ్గుతో తలదించుకొని మద్యం షాపుల ముందు నిల్చోవాల్సి వచ్చింది. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించినందుకు ఉద్యోగ సంఘాల నేతలను పెట్టిన చిత్రహింసలు అన్నీఇన్నికావు. నేను రాజును.. మీరంతా నా భటులు అన్నట్లుగా జగన్ వ్యహరించిన తీరు ఇప్పటికీ ఉద్యోగులు గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మన కళ్లముందు జరిగినవే. కానీ, బయట ప్రపంచానికి తెలియకుండా జగన్, ఆయన గ్యాంగ్ ఉద్యోగ సంఘాల నేతలను ఎంతలా చిత్రహింసలకు గురిచేశారో ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలు ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు అనేకం ఉన్నాయి. జగన్ గ్యాంగ్ బరి తెగించి వారిని ఇబ్బందులకు గురిచేసింది. అప్పట్లో తమ ఫోన్లుసైతం జగన్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయటంతో పాటు, ఉద్యోగులపై జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ రెడ్డి అరాచకాలను తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వివరించాడు. తాను గవర్నర్‌ను కలిసిన తరువాత తన రెండు ఫోన్ నెంబర్లను ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు ట్యాప్ చేసి బెదిరించారని, అందుకు తన వద్ద దగ్గర ఆధారాలు ఉన్నాయని సూర్యనారాయణ చెప్పారు. గవర్నర్ ను కలిసిన తరువాత ప్రభుత్వం తనపై దాడిచేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ ను కలిసేందుకు వారి అపాయింట్ మెంట్‌కోసం ఫోన్ చేశానని.. వెంటనే నన్ను పిలిపించి నువ్వు పవన్, చంద్రబాబులను కలవడం మానుకోకపోతే చాలా ఇబ్బందులు పడతావని బెదిరించారని, అవసరమైతే చంపిస్తామనే స్థాయికి వారు వెళ్లారని సూర్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థికశాఖ, ఉద్యోగుల సమస్యల్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తన కుటుంబాన్ని కూడా వేధించారని, తన కుటుంబాన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వేధింపులపై జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించాలని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరాడు. ఇలా జగన్ ప్రభుత్వంలో చిత్రహింసలకు గురైంది ఒక్క సూర్యనారాయణే కాదు.. ఉద్యోగుల తరపున మాట్లాడిన ప్రతిఒక్కరికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌నే జగన్, ఆయన గ్యాంగ్ ఇచ్చిందని ఉద్యోగ వర్గాల్లో చర్చజరుగుతోంది.