సభా సంప్రదాయాల ఉల్లం‘ఘనుడు’ జగన్
posted on Jun 22, 2024 @ 10:53AM
ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు అన్నట్లుగా, జగన్ కు ఎన్ని పరాభవాలెదురైనా ఆహంభావ ధోరణి మారదు కాక మారదు. కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ తాజా ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలైనా జగన్ తీరు మారలేదు. మామూలు ఎమ్మెల్యే అయినా.. ఆయనకు ఆయన కోరిన మీదట ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంతో హుందాగా సభ ఆవరణలోకి సొంత వాహనంలో రావడానికి, అలాగే మంత్రుల తరువాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెసులుబాటు కల్పించి తన ఉదారతను చాటుకున్నా జగన్ లో బలుపు తగ్గలేదు. సభలో సభా సంప్రదాయాలను పాటిస్తానని ప్రమాణం చేశారు. అయితే సంప్రదాయాలు పాటించడం తెలియదు. అహంకారమే తన భూషణంగా ఆయన భావిస్తారు. ఆయన అహంభావం కారణంగానే జనం ఇటీవలి ఎన్నికలలో జనం కర్రు కాల్చి వాతపెట్టారు. అయినా జగన్ లో మార్పు రాలేదు.
సభ సాక్షిగా సంప్రదాయాలను పాటిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన జగన్ వెంటనే ఆయన సభ బయటకు వెళ్లిపోయారు. తన పార్టీకి చెందిన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించాలన్న కనీసం ఇంగితం కూడా ప్రదర్శించలేదు. సరే అది అయిపోయింది. ఇప్పుడు శనివారం (జూన్ 22) సభలో స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎన్నిక లాంఛనమే. ఆయన ఈ రోజు స్పీకర్ గా ఎన్నికవుతారు. సభా సంప్రదాయం ప్రకారం సభానాయకుడు, అధకార, విపక్ష సభ్యులు స్పీకర్ ను స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని పోయి అభినందనలు తెలపడం సంప్రదాయం. కానీ సభా సంప్రదాయాలను పాటిస్తానంటూ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అలా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి డుమ్మా కొట్టేసి పులివెందుల చెక్కేశారు.
నిజమే జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు సభలో ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఆయన పార్టీకి విపక్ష హోదా రాలేదు కనుక ఆయన విపక్ష నేత కూడా కాదు. వైసీపీకి సభలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరు. అయినా సభకు ఎన్నికైన ప్రతి సభ్యుడూ సంప్రదాయాలను పాటించాల్సిందే. అయితే జగన్ మాత్రం సభలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి.. సభలో కూర్చోకుండా వెళ్లిపోయిన ఆయన రెండో రోజు సభకు గైర్హాజర్ అయ్యారు. స్పీకర్ ఎన్నిక ఉందని తెలిసినా.. పులివెందుల పర్యటన పెట్టుకుని పారిపోయారు.
గత శాసనసభలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎన్నికయ్యారు. అప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పీకర్ ఎంపిక కార్యక్రమంలో భాగం అయ్యారు. ఆయనను చెయిర్ వరకూ తీసుకెళ్లే కూర్చోబెట్టే సంప్రదాయాన్ని పాటించారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. తనకు హుందా తనం అంటే తెలియదని తనకు తానే ఈ చర్య ద్వారా చాటుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డికి మాత్రం అలా చేయాలని అనిపించడం లేదు.