రేవంత్‌రెడ్డి... 6 గంటలు ఓవర్ టైమ్!
posted on Jun 22, 2024 @ 2:46PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడు తన పనిగంటలను మరో ఆరుగంటలు పెంచుకుని ఓవర్ టైమ్ చేయాలని ఫిక్సయ్యారు. రేవంత్ ఇలా 6 గంటలు ఓవర్‌టైమ్ చేయడానికి కారణమెవరో తెలుసా? ఇంకెవరు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు అరగంట కూడా పనిచేయని ముఖ్యమంత్రి జగన్ వున్నాడు కాబట్టి, రోజుకు 12 గంటలు పనిచేసే రేవంత్‌రెడ్డికి పోటీయే ఉండేది కాదు. మరిప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి రోజుకు 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు పగ్గాలు తీసుకున్నారు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి 12 గంటల దగ్గరే ఆగిపోతే ఎలా? చంద్రబాబు నాయుడితో ఆయన, ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ పోటీ పడాలంటే పనిగంటలను పెంచుకోవాల్సిన అవసరం వుంది కదా.. అందుకే రేవంత్ 18 గంటల పరిశ్రమకు షిఫ్టయ్యారు.
ఈ విషయాన్ని రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పని చేస్తున్నప్పుడు నేను 12 గంటలే పనిచేస్తే ఎలా? అందుకే నాతోపాటు తెలంగాణ నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలి. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.