రిషికొండ ప్యాలెస్ నాకు అమ్మేయాలని తీహార్ జైలు నుంచి సుఖేష్ లేఖ
posted on Jun 22, 2024 @ 12:58PM
సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అంటే ఇదేనేమో... గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం తనకూ, తనకు సంబంధించిన వారికి దోచి పెట్టడానికే పని చేసింది అని చెప్పడానికే ఇంతకన్నా పెద్ద నిదర్శనం మరోటి ఉండదు. కరడు గట్టిన నేరగాళ్లు ఉండే తీహార్ జైలు నుంచి ఎపిలో కూటమి ప్రభుత్వానికి వచ్చిన లేఖతో బండారం బయటపడింది. కోట్లాది రూపాయలు పోసి కట్టిన రిషికొండ ప్యాలెస్ పై సంఘ విద్రోహశక్తుల కన్ను పడింది.దోచుకుని, దోచి పెట్టిన జగన్ అధికారం కోల్పోవడంతో రిషికొండ ప్యాలెస్ కథ కంచికి చేరిపోయింది.
తీహార్ జైల్లో ఉన్న ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ విశాఖలోని రుషికొండ ప్యాలెస్ అంశంపై స్పందించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైలు నుంచి లేఖ రాశాడు.
ఆ భవనాన్ని తనకు విక్రయించాలని, లేకపోతే లీజుకైనా ఇవ్వాలని సుఖేశ్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాడు. మార్కెట్ ధర కంటే 20 శాతం అధికంగా చెల్లిస్తానని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. తన లేఖను భవన కొనుగోలుకు అంగీకార పత్రంగా పరిగణించాలని తెలిపాడు. ఆర్థిక మోసాల ఆరోపణలపై తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కు జైలు నుంచి లేఖలు రాయడం కొత్త కాదు. దేశంలో సంచలనం సృష్టించే అంశాలను లక్ష్యంగా చేసుకుని లేఖలు రాయడం అతడికి అలవాటే. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ నిధులతో జగన్ రిషికొండ ప్యాలెస్ నిర్మించారు. అయితే అనూహ్యంగా జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో రిషికొండ ప్యాలెస్ పై అందరి కన్ను పడింది. ఈ ప్యాలెస్ తనకు అమ్మి వేయాలని ఆర్థిక నేరాలకు పాల్పడి తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రబాబుకు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.