జగన్ బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళన షురూ!
posted on Jun 22, 2024 @ 11:51AM
జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో వైసీపీ కార్యకర్తల స్థాయికి దిగజారి పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళనకు చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. జగన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు ముగ్గురి వై బదిలీ వేటు వేసిన చంద్రబాబు సర్కార్ రానున్న రోజులలో మరింత మందిపై చర్యలకు సమాయత్తమౌతోంది.
మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డిని ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు ఫైర్ సర్వీసు డీజీగా ఉన్న సునీల్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సునీల్ స్థానంలో శంకబ్రత బగ్చీ నియమితులయ్యారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డిని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ నుంచి రిలీవ్ చేస్తూ, డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల ఆదేశాలు జారీ అయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జగన్ బ్యాచ్ అధికారులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో ఆయన దన్ను చూసుకుని ఇష్టారీతిగా వ్యవహరించిన ఐపిఎస్, ఐఏఎస్‌లకు ఇక శంకరిగిరి మాన్యాలు తప్పవన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జగన్ బ్యాచ్ అధకారుల కారణంగా నానా వేధింపులకు గురైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలలో హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అత్యంత అప్రాధాన్యతా పోస్టు అయిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి పంపించారు. కసిరెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో జగన్ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. వివిధ సమస్యలపై ఫిర్యాదులు, వినతి పత్రాలు ఇచ్చేందుకు తన వద్దకు వచ్చిన తెలుగుదేశం నేతలకు ఆయన కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వని సందర్భాలున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలకు మాత్రం రాచమర్యాదలతో స్వాగతాలు లభించేవి. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసినా కూడా కసిరెడ్డి స్పందించని సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి రాజేంద్రనాధ్‌రెడ్డిని అత్యంత అప్రాధాన్య శాఖకు బదిలీ చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరైతే అసలు ఆయనకు ఆ మాత్రం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని అంటున్నారు.
ఇక జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన సునీల్ సీఐడీని దుర్వినియోగం చేసి, టీడీపీ కార్యకర్తలను అమానుషంగా-అమానవీయంగా వేధించి, కేసులు పెట్టించిన సునీల్‌కు పోస్టింగ్ ఇవ్వక పోవడం ద్వారా తాను కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్‌మీడియా పోస్టింగుల పేరుతో కొన్ని డజన్ల మంది టీడీపీ కార్యకర్తలను వేధించిన సునీల్ బృందం అరాచకాలపై, తెలుగుదేశం గతంలోనే పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అప్పట్లో ఎంపి రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన వైనం.. లోక్‌సభ స్పీకర్, సభాహక్కుల సంఘం వరకూ వెళ్లింది. ప్రస్తుత బదిలీల్లో సునీల్ కూడా ఉండటం, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో జగన్ బ్యాచ్ అధికారుల విషయంలో చంద్రబాబు సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోందని స్పష్టమైంది.
అలాగే మరో జగన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డి తీరు అప్పట్లోనే తీవ్ర విమర్శలకు గురైంది. చంద్రబాబు అంగళ్లులో ప్రచారానికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఘటనలు, ఆ సమయంలో రిషాంత్ నేరుగా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశంపై విమర్శలు గుప్పించిన తీరు సంచలనం సృష్టించిన సంగడతి తెలిసిందే. రిషాంత్ రెడ్డి పోలీసు అధికారిగా కాకుండా జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు పాటించారని అప్పట్లోనే పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆయనకు కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రానున్న రోజులలో మరింత మంది అధికారులపై కూడా వేటు తప్పదని తెలుస్తోంది.