అక్కడ పెళ్ళి - ఇక్కడ చిల్లు.. దూరప్రాంత వేడుకలతో.. దూరమైన అవకాశాలు.
తెలుగు సినిమా నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి కేదార్ సెలగంశెట్టి, దుబాయి లో అనుమానస్పద మరణం సంచలనంగా మారింది. మన దేశంలో సినిమాలతో పాటుగా ఇతర కాంట్రాక్టు వ్యాపారాలు, ఇతరత్రా ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో పేరు మోసిన కేదార్ కు అక్కడ దుబాయ్ లోనూ ఆ విధమైన వ్యాపారాలు గట్రా ఉన్నాయని సమాచారం.అలాంటి, పేరు మోసిన అయన దుబాయ్ లో ఒక వివహ వేడుక (ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ )లో పాల్గొని, అదే రోజు రాత్రి నిద్రలోనే కన్ను మూశారు. దాంతో ఇప్పుడు డెస్టినేషన్ వివాహాలు చర్చలోకి వచ్చాయి. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినిమా పరిశ్రమ వర్గాల్లో సంచలనంగా మారింది. మరో వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేదార్ మరణాన్ని, కొంత కాలం క్రితం, హైదరాబాద్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసుకు ముడిపెడుతూ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో , పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. అయితే, ఈ కథ ముందు ముందు ఏ మలుపు తిరుగుతుందో .. ఏమో కానీ, కేదార్ మరణం మరో అనూహ్య కోణాన్ని తెరమీదకు తెచ్చింది, అయితే, మనం కేదార్ మరణానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఓ నిర్ధారణకు వచ్చే ఆస్కారం లేదు. కానీ, ఆయన మరణం నేపధ్యంలో దుబాయ్ లో కుటుంబ వేడుకల ‘కొత్త’ ట్రెండ్ ను తెరపైకి తెచ్చాయి. నిజానికి, ఈమధ్య కాలంలో ఇలాంటి వేడుకలు చాలా పెద్ద ఎత్తునే జరుగుతన్నాయి. కేవలం వివాహ వేడుకలే కాదు చివరకు,కిట్టీ పార్టీలకు కూడా జనం పోలో మంటూ ఫ్లైట్ ఎక్కి పోతున్నారు. ఈ నేపధ్యంలోనే ఈమధ్య కాలంలో డబ్బున్న పెద్దోళ్ళు, సెలబ్రిటీలు ఒక్క దుబాయ్ అనే కాదు సీజన్ ను బట్టి ఏ దేశంలో మోర్ ‘సుఖం’ దొరుకుతుందంటే ఆ దేశాల్లో వివాహాలతో పాటుగా ఇతర వేడుకలు జరుపుకుంటున్నారు. చాల కాలంగా జరుగుతున్నదే అయినా, ఇప్పుడు, ఈ ఉదంతంతో కొత్త అంశం ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ నేపధ్యంలో, అసలు ఈ డెస్టినేషన్ మ్యారేజెస్ అంటే ఏంటి? ఎంచక్కా, మన దేశంలో మన వాళ్ళ మధ్య, మన సంప్రదాయాల ప్రకారం జరుపుకోవలసిన వివాహ వేడుక, ఎల్లలు దాటి, ఏదో దేశంలో పరిమిత సభ్యుల మధ్య జరుపుకోవడం ఏమిటి ? దీని వెనక మతలబు ఏమిటి? అంటే, గొప్పోళ్ళు విదేశాల్లో గొప్పగా జరుపుకునే పెళ్లిళ్లకు పెట్టుకున్న ముద్దు పేరు, ‘డెస్టినేషన్ మ్యారేజెస్’. నిజమే జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెట్టుకుంటుంది అన్నట్లు, డబ్బున్నోళ్ళు ఎక్కడైనా ఏ వేడుక అయినా, ఎంత ఘనంగా అయినా జరుపుకుంటారు. విదేశాల్లోనే కాదు, అవకాశం ఉండాలే కానీ, చంద్రమండలం పై కూడా వివాహం చేసుకుంటారు. ఎవరో సినిమా కవి అన్నట్లుగా చేతిలో పైసా ఉండాలే కానీ, కొండమీది కోతైనా దిగివస్తుంది. సో..అందులో తప్పు పట్టాల్సింది ఏముంది, అనిపించవచ్చు.
నిజానికి, విదేశాల్లో కాదు, మన దేశంలోనూ గోప్పోళ్ళ పెళ్ళిళ్ళు గొప్పగానే జరుపుకుంటున్నారు కదా, పేద మధ్య తరగతి పెళ్లి ఖర్చులే రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు, కదా అలాంటప్పుడు డబ్బున్న పెద్దోళ్ళు విదేశాల్లో కోట్లు ఖర్చు చేసి వారి వారి ఆర్థిక స్థోమతకు తగ్గ విధంగా వివాహం ఘనంగా జరుపుకుంటే తప్పేముంది, అని కూడా అనవచ్చును.
అలాగే, ఈమధ్యనే జరిగిన అంబానీ కుమారుడి పెళ్లి విషయమే తీసుకుంటే,అది ఎంత ఘనంగా జరిగిందో చూశాం..ఆ పెళ్ళికి అంబానీలు పెట్టిన ఖర్చు రూ.5వేల కోట్ల నుంచి పదివేల కోట్ల రూపాయల వరకు ఎంతైనా ఉండవచ్చని వార్త లొచ్చాయి. సో.. అలాంటప్పుడు, ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ గురించే ఎందుకు ఇంత చర్చ .. వై ..ఇంత ఆందోళన అన్న ప్రశ్నలు కూడా రావచ్చును.
అయితే, అదీ ఇదీ ఒకటేనా? అంటే కాదు, దేశంలో ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఏ వేడుక చేసుకున్నా, అ సొమ్ములు మన దేశంలోనే ఉంటాయి, దుస్తుల డిజైనర్లు, వేడుకల వేదికల అంకరణలు, క్యాటరింగ్, మంగళవాయిద్యాలు, ఫొటో షూట్లు, పూల వ్యాపారాలు ఇలా వివిధ రంగాల వారికి, ఆ వేడుకలకు వివిధ సేవలు అందించే వారికీ వారికి ఉపాధి లభిస్తుంది. దేశంలో పెళ్లిళ్లు, వేడుకల నిర్వహణ అన్నది ఒక పరిశ్రమ స్దాయిలో అభివృద్ధి చెందింది. వేలాది మందికి ఒక ఉపాధి మార్గంగా మారింది. అంతేనా.. ఈ వేడుకలు, వివాహాలు ఇక్కడే జరుపుకుంటే ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అదే, పెళ్ళిళ్ళు విదేశాల్లో జరుపుకుంటే, ఈ ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండి పడుతుంది. మన రూపాయికి రెక్కలొస్తాయి ఎక్కడికో ఎగిరిపోతుంది. అంతే కాదు, ఏ మార్గంలో ఎగిరిపోతోంది అనేది అంతు చిక్కని చిక్కు ప్రశ్న. అందుకే డెస్టినేషన్ మ్యారేజెస్ విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి .అందోళన వ్యక్తమవుతోంది.
ఎవరిదాకానో ఎందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రెండేళ్ళ క్రితం (2023లో ) మన్-కీ –బాత్’ కార్యక్రమలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలోని కొన్ని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహాలు చేసుకుంటున్న ధోరణి తనను కలవరపెడుతోందని అన్నారు. ఇదంత అవసరమా...? ఒక్కసారి ఆలోచించండి. అయినవారి మధ్య, ఇక్కడే పెళ్లి వేడుకలు జరుపుకుంటే దేశ సంపద మనవద్దే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
నిజానికి ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ సంబంధించి వినవస్తున్న చీకటి కోణాల్లో, ఇది ఒక కోణం, అయితే అసలు కోణం ఇంకొకటుంది. ఇన్నిన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఎలా, ఏ మార్గంలో విదేశాలకు వెళుతున్నాయి? అనేది వేయి కాదు లక్షల కోట్ల డాలర్ల ప్రశ్న. ప్రధాన మంత్రి ఎందుకనో ఈ విషయాన్ని తమ ప్రసంగంలో ప్రస్తావించలేదు కానీ, ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ లో అసలైన మూడో ముడి ఇదే అంటున్నారు. నిజానికి, సక్రమంగా మన దేశం నుంచి విదేశాలకు డబ్బు పంపాలంటే 30 నుంచి 40 శాతం వరకు పన్ను చెల్లించవలసి ఉంటుంది. పిల్లలను విదేశాల్లో చదివిస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఇది అనుభవంలో ఉన్నదే. అలాంటప్పుడు,ఇంతింత డబ్బును సక్రమ మార్గంలోనే విదేశాలకు తరలిస్తున్నారా? హవాలా మార్గంలో వెళుతున్నాయా? అంటే, అందరూ, మొత్తం సొమ్మును రకరకాల మార్గాలలో నే పంపుతున్నారని, ఎక్కువ మొత్తం హవాలా రూట్ లోనే వెళుతున్నదనే, అనుమానాలు అయితే ఉన్నాయి. అదే నిజం అయితే, డెస్టినేషన్ పెళ్లి పేరున చాలా పెద్ద ఆర్థిక నేరం జరిగిపోతోందని అనుకోవచ్చును. అంటే, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ముందు ముందు ‘డెస్టినేషన్ మ్యారేజెస్’, మరో భయంకర ఆర్థిక నేరంగా పరిణమించే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే, ఈ వేడుకలు కూడా మనకు ఉపయోగం లేనివి అనిపిస్తోంది. సో .. సినిమా నిర్మాత కేదార్ మరణంతో మరోమారు వెలుగులోకి వచ్చిన ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ అసలు కథేంటి? అలోచించడమే కాదు, రంగు రుచి వాసనల గుట్టు విప్పవలసిన, విచారించవలసిన అవసరం అయితే వుంది.