జగన్ రాయబేరం.. ఛీకొట్టిన చెల్లెలు!?
posted on Jun 22, 2024 6:55AM
అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఈ ఫార్ములానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అహంకార పూరితంగా వ్యవహరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు.. సొంత చెల్లి, తల్లి పట్ల కూడా అదే పద్దతిని అవలంబించారు. అధికార అహంతో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లపై కేసులు పెట్టి, పోలీసులతో కొట్టించి ఆనందం పొందారు. పైగా.. అన్నీ దేవుడే చూసుకుంటాడు అంటూ చిలకపలుకు పలికేవారు. నిజంగానే జగన్ చిలక పలుకులను దేవుడు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నాడు. ఐదేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీ నేతలను, ప్రజలను జగన్ పెట్టిన ఇబ్బందులకు బదులుగా ఎన్నికల్లో ప్రజల చేత ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పించాడు. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. చరిత్రలో జగన్‌కు ఇచ్చిన తరహా ట్రీట్‌మెంట్ ప్రజలు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. అధికారంలో ఉన్నన్నినాళ్లు తల్లీ, చెల్లెళ్లనుకూడా బయటకు నెట్టిన జగన్, ఇప్పుడు వారి విలువ తెలిసొచ్చి కాళ్లబేరానికి వెళ్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.
ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు తన సొంత చెల్లి వైఎస్ షర్మిలకూడా ఓ కారణమని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో జగన్‌పై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. సొంత బాబాయ్ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తికి కడప ఎంపీ టికెట్ ఇవ్వడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా షర్మిల బరిలోకి దిగారు. అంతేకాదు.. కడప జిల్లా వ్యాప్తంగా ఆమె కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం జగన్ ను ఛీ కొట్టారు. సొంత జిల్లా కడపలోనూ జగన్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఉమ్మడి కడప జిల్లా తన కంచుకోటగా భావిస్తూ వచ్చిన జగన్‌కు అక్కడి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇలా జరగడానికి కారణం షర్మిల ప్రచారమేనని జగన్ మోహన్ రెడ్డి గుర్తించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చజరుగుతున్నది. షర్మిలను తనవైపుకు తిప్పుకోకపోతే కడప జిల్లాలోనూ పట్టు సాధించడం సాధ్యం కాదన్న జగన్ కు భయం పట్టుకుందట. దీంతో తన తల్లి విజయమ్మ ద్వారా షర్మిల వద్దకు జగన్ రాయభారం నడుపుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
అందితే జట్టు.. అందకపోతే కాళ్లు అనే ఫార్మాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న జగన్ మోహన్ రెడ్డి.. షర్మిల వద్ద అదే పద్దతిని అవలంబిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరాలని కోరుతూ షర్మిల వద్దకు రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. అన్న నిజస్వరూపం తెలిసిన షర్మిల.. ఛీ కొట్టినట్లు తెలుస్తోంది. నీ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల కుండబద్దలు కొట్టేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ చర్చలకు బలం చేకూర్చుతూ ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం షర్మిల మాట్లాడుతూ.. పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అంటూ పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయినా ఎలాగైనా షర్మిలను మళ్లీ వైసీపీలోకి ఆహ్వానించి ఉమ్మడి కడప జిల్లాలో పట్టుకోల్పోకుండా ఉండాలని జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని సమాచారం.
చిన్నపిల్లోడు అంటూ ఇన్నాళ్లు జగన్ మోహన్ రెడ్డి వెనుకేసుకొచ్చిన ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హత్యకేసులో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. తనకు అండగా ఉంటారనుకున్న ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా మిగిలిన ఇద్దరు వైసీపీ ఎంపీలతో కలిసి మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. నిజంగానే ఇలాంటి పరిణామాలు ఉమ్మడి ఎదురైతే కడప జిల్లాలో బలంగా నిలబడాలంటే షర్మిల మద్దతు అవసరమని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే తల్లి విజయమ్మ ద్వారా వైసీపీలోకి రావాలని షర్మిలపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ రాయబారానికి ఛీ కొట్టిన షర్మిల మున్ముందు కాలంలో అన్నకు ఎదురయ్యే ఇబ్బందులనుచూసి మనస్సు మార్చుకునే అవకాశాలు ఉండొచ్చని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.