వైసీపీ వితండ వాదం.. పైత్యం పీక్స్ కెళ్లినట్లేనా?
అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ రాజకీయం పేర చేస్తున్న రచ్చ ఇంతా అంతా కాదు. ఓటమికి కుంటి సాకులు వెతకడం దగ్గర నుంచీ.. జనం ఛీ కొట్టి నిరాకరించిన ప్రతిపక్ష హోదా కోసం పేచీ పెట్టడం దాకా ఆ పార్టీ రోడ్డెక్కి తన పరువుతానే తీసుకుంటోంది.
2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ జనాలను వేడుకుని, కోడి కత్తి దాడి, బాబాయ్ పై గొడ్డలి పోటు అంటూ సానుభూతి డ్రామాలతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల పాటు నమ్మి ఓటేసిన జనాలకు నరకం చూపించారు. పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడం, వ్యతిరేకులపై కక్షసాధింపులు అన్నట్లుగానే జగన్ ఐదేళ్ల పాలన సాగింది. పర్యవశానం.. జనం ఏ ఓటుతో అయితే గద్దెనక్కించారో, అదే ఓటుతో గద్దె దింపేశారు.
అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు అన్ని హద్దులూ దాటేశారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో ప్రత్యర్థి పార్టీల నేతలను దూషించారు. వారి కుటుంబంలోని స్త్రీలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యులపైనా ఇష్టారీతిగా అనుచిత పోస్టులు పెట్టారు. అలాంటి వారిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా , పోసాని కృష్ణ మురళి వంటి వారు ముందు వరుసలో ఉన్నారు. వీళ్లలో ఎవరైనా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారంటే జనం ఇళ్లల్లో టీవీలు బంద్ చేసేసుకునే వారు. అలా ఉండేది వీరి భాషా సౌందర్యం. జగన్ కక్షపూరిత రాజకీయాలకుతోడు వైసీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయిన ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. ప్రతిపక్ష హోదాకూడా వైసీపీకి ఇవ్వలేదు.
సరే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన , ప్రత్యర్థులపై ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నేతల పైనా, హద్దులన్నీ దాటి అరాచత్వంలో చెలరేగిన వారిపైనా ఇప్పడు వరుసగా కేసులు నమోదౌ తున్నాయి. ఈ క్రమంలోనే జోగి రమేశ్, నందిగం సురేశ్, పేర్ని నానిలపై కేసులు నమోదయ్యాయి. జోగి రమేశ్, నందిగం సురేశ్ లు జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి. ఈ క్రమంలో జగన్ జైలు కెళ్లి వంశీని పరామర్శించి వచ్చారు. వంశీ తప్పు చేసినట్లు ఆధారాలతోసహా పోలీసులు నిరూపిస్తున్నారు. కిడ్నాప్, బెదరింపుల కేసులో అరెస్టైన వ్యక్తిని జైలుకెళ్లి మరీ పరామర్శించి రావడాన్ని జగన్ నిస్సుగ్గుగా సమర్ధించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్రబాబు, పవన్, లోకేశ్ పైనా, వారి కుటుంబాలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వంశీ లాంటి నేతను పరామర్శించడంపార్టీ పరువును మరింత మంటగలిపిందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు తాజాగా అదే అనుచిత భాషా ప్రయోగం కారణంగా పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. పోసాని పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా నాకు జ్ణానోదయం అయ్యింది. ఇంక మళ్లీ రాజకీయాల జోలికి రాను అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే చేసిన తప్పులు దండంతో సరిపెట్టేయడానికి చట్టాలు ఒప్పుకోవుకదా? అందుకే పోలీసులు అరెస్టు చేశారు. సరే పార్టీలో ఉన్నా లేకపోయినా పోసానిని పరామర్శించి, ఆ సందర్భాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి వాడుకుంటారు సందేహం లేదు. ఇలా వైసీపీ ఓటమి తరువాత జగన్ జనంలోకి వస్తున్న ప్రతి సందర్భమూ ఓక రాంగ్ ఇండికేషన్ నే ఇస్తోంది. ప్రత్యర్థులపై బూతు పురాణంతో విరుచుకుపడిన నేతలు, ఇష్టారీతిగా కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారికే వైసీపీలో రెడ్ కార్పెట్ వేస్తారనీ, పెద్ద పీట లభిస్తుందని చాటుతున్నారు.
జగన్ 2.0 అంటూ ఇటీవల తెగ చెబుతున్న జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అని చెప్పుకుంటూ.. మళ్లీ అధికారంలోకి వస్తే జనం కోసం కాదు.. కార్యకర్తల కోసం నిలబడతానని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎవరి కోసం నిలబడతారో ఆయన జైలు యాత్రలు తేటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వంశీ లాంటి నేతల కోసం జైలు యాత్రలు చేయడం పట్ల వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇది చాలదన్నట్లు ఇప్పుడు గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, వైసీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చి చూపుతూ ఆ పార్టీ మేధావులు? వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. 2024 ఎన్నికలలో కేవలం 6 శాతం ఓట్లు వచ్చిన జనసేన పార్టీ అధినేతకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు.. 40 శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఇందులో ఇసుమంతైనా లాజిక్ లేదు.
లాజిక్ సంగతి తరువాత చెప్పుకుందాం. ముందుగా భారత దేశంలో ఓట్ల శాతాన్ని బట్టి కాకుండా పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యను బట్టే ప్రతిపక్ష హోదాను నిర్ణయిస్తారు. ఇది కొత్తగా వైసీపీ విషయంలో అమలు చేస్తున్న విధానం ఎంత మాత్రం కాదు. గతంలో అంటే వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 స్థానాలను ప్రస్తావిస్తూ ఓ నలుగురిని మా వైపు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని పలు మార్లు శాసనసభ వేదికగానే జగన్ మాట్లాడారు. ఇప్పుడు తన కన్వీనియెన్స్ కోసం ఆ విషయం మరిచిపోయి 11 స్థానాలున్న తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతున్నారు. హోదా ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని భీష్మిస్తున్నారు.
ఇక ఇప్పుడు జనసేన ఓట్ల శాతంతో తమ ఓట్ల శాతాన్ని పోలుస్తూ వైసీపీ చేస్తున్న వితండ వాదం విషయానికి వస్తే.. 2024 ఎన్నికలలో వైసీపీ మొత్తం 175 స్థానాలలోనూ పోటీ చేసింది. దగ్గరదగ్గర 40 శాతం ఓట్లు సాధించుకుంది. 11 స్థానాలలో విజయం సాధించింది. కానీ జనసేన కేవలం 21 స్థానాలలోనే పోటీ చేసింది. 21 స్థానాలనూ గెలుచుకుంది. అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. మరలాంటప్పుడు జనసేనకు 6 శాతం ఓట్లే వచ్చాయి.. మాకు 40 శాతం ఓట్లు అంటూ వైసీపీ చెప్పుకోవడంలో అసలు అర్ధం లేదు. నిజంగా జనసేన, వైసీపీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చాలనుకుంటే.. జనసేన విజయం సాధించిన 21 స్థానాలలోనూ జనసేనకు వచ్చిన ఓట్ల శాతం పోల్చాలంటే ఆ రెండు పార్టీలూ పోటీ పడిన 21 స్థానాలలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో చూడాల్సి ఉంటుంది. అలా చూస్తే వైసీపీ వాదనలోని డొల్ల తనం ఇట్టే బయటపడిపోతుంది. జనసేన గెలిచిన 21 స్థానాలలో ఆ పార్టీకి 50 నుంచి 60 శాతం ఓట్లు వచ్చాయి. దానిని విస్మరించి జనసేనకు కేవలం 6 శాతం ఓట్ల స్టేక్ మాత్రమే ఉందని మాట్లాడటం అంటే వైసీపీ తనను తాను పలుచన చేసుకోవడమే అవుతుంది.