శ్రీవారి సన్నిధి నుంచే ప్రక్షాళనకు శ్రీకారం!

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో తిరుమల పవిత్రతను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించేశారు. అన్న ప్రసాద నాణ్యత నుంచి, భక్తులకు సౌకర్యాల వరకూ అన్నిటా కోత విధించారు. కొండపై అన్యమత ప్రచారం మొదలుకుని అన్యమతస్థులకు టీటీడీలో కొలువుల వరకూ ఏది పడితే అది చేసేశారు. అంతేనా నాస్తికుడిననని బాహాటంగా చాటి, తిరుమలేశుని విగ్రహాన్ని నల్లరాతి బండగా అభివర్ణించిన భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించడం వరకూ సకల అపచారాలకూ పాల్పడ్డారు.  

వాస్తవానికి గతంలో అంటే వైఎస్ హయాంలో భూమనను టీటీడీ చైర్మన్ గా నియమించిన సమయంలోనే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దైవాన్నినమ్మని నాస్తికుడికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్త  చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ కూడా అదే చేశారు. భూమన కూడా టీటీడీ చైర్మన్ గా తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాల మెరుగు పరచడానికి కాకుండా తన కుమారుడు తిరుపతి నుంచి ఎన్నిక అయ్యేందుకు అవసరమైన నిధులను సరఫరా చేసే ఏటీఎంలా తన పదవిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతి అభివృద్ధికి శ్రీవారి నిధులను వినియోగించేందుకు టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చేలా ఆయన చక్రం తిప్పారు. వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డిని వరుసగా రెండు పర్యాయాలు జగన్ టీటీడీ చైర్మన్ గా నియమించడమే వివాదాస్పదమైంది. ఆయన పదవీ కాలం ముగియగానే జగన్ భూమనను నియమించారు.

సరే వీరి హయంలో తిరుమలకు వచ్చే యాత్రకులు నరకం అనుభవించారంటే అతిశయోక్తి కాదు. అన్న ప్రసాదం నాణ్యత నాసిరకంగా మారిపోయింది. క్యూలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు గతంలో టీటీడీ సరఫరా చేసే అన్న ప్రసాదం జల ప్రసాదమూ కూడా బంద్ అయిపోయాయి. ఇక యాత్రికులకు కాటేజీల అద్దెను ఆకాశమే హద్దుగా పెంచేశారు. రద్దీ పెరిగిన ప్రతిసారీ యాత్రికులకు కొండకు రావద్దంటూ టీటీడీ ప్రకటనలు జారీ చేయడం పరిపాటిగా మారిపోయేది. ఇక నడకదారి భక్తల ప్రాణాలకు పూచీ లేని పరిస్థితి ఏర్పడింది. వన్య ప్రాణుల నుంచి రక్షణకు కర్రలు సరఫరా చేసి నవ్వుల పాలైంది.   తిరుమల పవిత్రతను మంటగలిపి యాత్రికులు కొండకు రాకుండా చేయడమే ధ్యేయమా అన్నట్లుగా జగన్ హయాంలో  పరిస్థితి మారిపోయింది.

అందుకే  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తరువాత తిరుమల దేవుని దర్శించుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుడతానని ప్రకటించారు. అన్నట్లుగానే చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన రోజుల వ్యవధిలోనూ ప్రక్షాళన ఆరంభమైంది. అందుకు సంబంధించి మార్పు స్పష్టంగా కళ్లకు కడుతోంది. శ్రీవారి అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది. క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, జల ప్రసాదం అందుతున్నాయి. పిల్లలకు పాలు అందిస్తున్నారు. తిరుమల కొండపై గత ఐదేళ్లుగా కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఇప్పుడు అడుగడుగునా కనిపిస్తున్నాయి. భక్తులు ఈ మార్పుల పట్ల హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. 

Teluguone gnews banner