కరోనా వ్యాక్సిన్ వివరాల కోసం పోర్టల్
posted on Aug 24, 2020 @ 12:36PM
కోవిద్ 19 వ్యాక్సిన్ ఏడాది చివరి నాటికి...
కొవాగ్జిన్ ట్రయల్స్ లో మార్పులు
చర్మపొరలకు వ్యాక్సిన్..
జీవితాన్ని నాలుగుగోడల మధ్య బందీ చేసిన కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాలు ఏఏ దశల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు, ఫలితాలు, మార్కెట్ ధరలు అన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ వ్యాక్సిన్ పోర్టల్‌ను ఐసీఎంఆర్ హెడ్ (అంటువ్యాధుల విభాగం) అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు అనేక స్థానిక భాషల్లో కూడా సమాచారం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
భారతదేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అన్ని ప్రయోగాలు అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌తోపాటు జైకోవ్-డి వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించాయి. ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్ ను ఫేస్ 1, 2 ట్రయల్స్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 ఆసుపత్రుల్లో 1,125 మందికి ఇచ్చి పరిశీలిస్తున్నారు. న్యూఢిల్లీ, పట్నాలోని ఎయిమ్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, హైదరాబాద్ లోని నిమ్స్, రోహ్ తక్ లో పీజీఐఎంఎస్ తదితర చోట్ల టెస్టింగ్ జరుగుతోంది. ఆరోగ్యవంతులైన వారికి రెండు వారాల వ్యవధిలో వారికి రెండు వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. డోసేజ్ ఇచ్చిన 58 రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్ సురక్షితమేనా, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుందా లేదా అని పరీక్షిస్తారు. అయితే భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా తయారు చేసిన 'కోవాగ్జిన్' వ్యాక్సిన్ ట్రయల్స్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ చర్మం కింది పొరలోకి ఇంజక్ట్ చేయడం ద్వారా ట్రయల్స్ చేపట్టాలని నిర్ణయించారు.
చర్మం పొరల్లో..
వ్యాక్సిన్ ను వివిధ రకాలుగా శరీరంలోకి పంపిస్తారు. ఎక్కువగా భుజాలు, పిరుదు కండరాలకు వేసే వ్యాక్సిన్ ఇస్తారు. దీన్ని ఇంట్రామస్కులర్ పద్దతిగా పిలుస్తారు. ప్రస్తుతం హైపటైటిస్, క్షయ, ధనుర్వాతం మొదలైన వ్యాక్సిన్లు ఇంట్రామస్కులర్ లో అందుబాటులో ఉన్నాయి. పోలియా వ్యాక్సిన్ నోటి చుక్కల ద్వారా ఇస్తారు. అయితే ఇప్పుడు కోవిద్ 19 వైరస్ అరికట్టే వ్యాక్సిన్ ను చర్మం కింది పొర ద్వారా శరీరంలోకి పంపించాలన్న శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీని వల్ల తక్కువ మోతాదులో వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది.
కోవిద్ 19 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున, ఎక్కవ డోసులు తయారు చేయాల్సి వస్తుంది. చర్మం ద్వారా ఇస్తే తక్కువ మోతాదులో ఎక్కువ మందికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కండరాలకు ఇచ్చే ఒక వ్యాక్సిన్ డోస్ తో నలుగురికి చర్మం ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. దీనితో వ్యాక్సిన్ తక్కువ తయారు చేసినా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావచ్చు. ధర కూడా 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుంది.