కొన్ని క్షణాలలో నేను చనిపోతున్నా.. ఎవరు రావద్దు: శ్రీశైలం ప్రమాదంలో ఏఈ మోహన్ ఆఖరిమాటలు
posted on Aug 21, 2020 @ 6:39PM
శ్రీశైలం విద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారు చనిపోయే ముందు తమ సహచరులను కాపాడే ప్రయత్నం చేస్తినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో తాము చనిపోతున్నామని తెలుసుకొని పవర్ ప్లాంట్ ను కూడ ఈ ప్రమాదం నుండి రక్షించేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో వారు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రం లో ప్రమాదం జరిగిన సమయంలో మంటలు మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఏఈ మోహన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఇదే సందర్భంలో తన వద్దకు ఎవరూ రావొద్దని ఆయన కోరారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం సమాచారాన్ని మరో ఏఈ అనిల్ కు ఇస్తూ.. మంటలు తీవ్రంగా ఉన్నాయని మిగిలినవారంతా అప్రమత్తంగా ఉండి ప్లాంట్ నుండి బయటపడాలని అయన సూచించారు. మరో కొద్ది నిమిషాల్లో తాను చనిపోతున్నానని అనిల్ కు ఏఈ మోహన్ ఫోన్ లో చెప్పారు. అయితే దురదృష్టవశాతూ మంటలను తగ్గించే క్రమంలో మోహన్ మంటల్లోనే కాలిపోయారు.
ఇక మరో ఉద్యోగి ఉజ్మ ఫాతిమా పవర్ ప్లాంట్ ద్వారం వద్దకు కూడా చేరుకున్నారు. అయితే అమరాన్ కంపెనీ నుండి ఇద్దరు ఉద్యోగులు కొత్తగా బ్యాటరీలు బిగించేందుకు పవర్ ప్లాంట్ కు వచ్చారు. అయితే అమరాన్ ఉద్యోగులు ప్లాంట్ కు కొత్తవారు కావడంతో మళ్లీ వెనక్కు వెళ్లి వారిద్దరిని బయటకు పంపే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే ఉజ్మా ఫాతిమా కూడ ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ప్లాంట్ లోని మరికొందరు అధికారులు కూడా ల్యాండ్ లైన్ ద్వారా చివరి నిమిషంలో తమ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి అగ్ని ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 15 నిమిషాల్లో కనుక తాము బయటకు రాకపోతే చనిపోతామని అయితే పిల్లలను మాత్రం బాగా చదివించి ప్రయోజకులను చేయాలనీ వారు కుటుంబసభ్యులకు తెలిపారు.