రోహిత్ శర్మకు ఖేల్ రత్న.. తెలుగుతేజం సాయిరాజ్ కు అర్జున
posted on Aug 21, 2020 @ 5:55PM
క్రీడల్లో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ఖేల్‌రత్నకు అర్హత సాధించిన వారి జాబితాను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ ఉన్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు అర్హత సాధించిన అభ్యర్థులకు అవార్డులను రాష్ట్రపతి అందజేయనున్నారు.
కాగా, క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 1998లో, అలాగే ధోని 2007లో, విరాట్ కోహ్లీ 2018లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు.
అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులకు అర్హత సాధించిన వారి పేర్లను కూడా కేంద్రం ప్రకటించింది. అర్జున అవార్డుకు క్రికెటర్లు ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్ ద్యుతి చంద్, షూటర్ మను భాస్కర్‌తో పాటు మరో 27 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. అర్జున అవార్డు విజేతల్లో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ యువ కెరటం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఉన్నాడు. సాత్విక్ సాయిరాజ్ డబుల్స్ లో ప్రపంచస్థాయిలో పదో ర్యాంకులో ఉండడం విశేషం.