ఏపీలో విచిత్ర పరిస్థితి.. ఆ జిల్లాలలో లక్షణాల్లేకుండానే పాజిటివ్
posted on Aug 24, 2020 9:13AM
కరోనా సోకిన వ్యక్తికి వ్యాధి లక్షణాలు కచ్చితంగా ఉంటాయనే గ్యారంటీ లేకపోవడంతో పాటు కొంత మందికి అసలు ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతున్న సంగతి తెలిసిందే. వారినే వైద్యపరిభాషలో ఎసింప్టమెటిక్ అంటారు. మన దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాప్తి పై పలు సంస్థలు సర్వే చేసి సెన్షేనల్ విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం సీరో సర్వైలెన్స్ సంస్థతో నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పలు జిల్లాలలో అత్యధిక శాతం మందికి లక్షణాలు లేనప్పటికీ పరీక్షల్లో మాత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సర్వేలో తేలింది.
ఈ సర్వే ప్రకారం అనంతపురం జిల్లాలో 99.5 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం మందికి ఎటువంటి లక్షణాల్లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలోని జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కనీసం తెలియకుండానే వైరస్ వచ్చి దానంతట అదే తగ్గిపోయింది.
అయితే లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని 10 రోజులపాటు హోం క్వారంటైన్‌లో కానీ, ఐసోలేషన్ కేంద్రాల్లో కానీ ఉంచుతున్నట్టు వైద్యులు తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్నపుడు ఏవైనా లక్షణాలు కనిపిస్తే మాత్రం మందులు ఇస్తామని, లేదంటే బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుందని వారో చెపుతున్నారు. వీరికి మళ్లీ కొవిడ్ టెస్టు కూడా అవసరం లేదని, అంతేకాకుండా 11వ రోజు నుంచి వీరు బయటకు కూడా వెళ్లొచ్చని... వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదని స్పష్టం చేస్తున్నారు.