ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదు
posted on Aug 21, 2020 @ 4:11PM
గుంటూరు జిల్లా తెనాలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం అని పేర్కొన్నారు.
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చేయడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చేయగలమని సైకో మనస్తత్వంతో ఉన్న వైఎస్ జగన్, వైసీపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదని అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.
కాగా, గత కొంతకాలంగా ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న, తొలగిస్తున్న ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలోని కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై తీవ్ర దుమారం రేగింది. అధికార పార్టీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా ఇతర టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే.. బాలకృష్ణకు ఫోన్ చేసి, తానూ ఎన్టీఆర్ అభిమానినేనని, విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
నిజానికి కావలిలో ఎన్టీఆర్ విగ్రహాం తొలగింపుపై పలువురు వైసీపీ నేతలు సైతం ఆవేదనకు గురయ్యారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మనస్తాపానికి గురై వైసీపీ సీనియర్ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు, కావలి మాజీ కౌన్సిలర్ గంగినేని పద్మావతి వంటి నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.
కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్ ని అభిమానించే వాళ్ళు ఎందరో ఉంటారు. ఆ విషయాన్ని మరిచి కొందరు ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేయడం, తొలిగించడం వంటివి చేసి విమర్శలు పాలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.