ఎమ్మెల్యే వంశీ ఆ ఒక్క స్టేట్ మెంట్ తో గన్నవరం వైసీపీలో మంటలు
posted on Aug 24, 2020 @ 12:45PM
కృష్ణ జిల్లా గన్నవరం రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంఛార్జి రెండూ నేనే. దుట్టా రామచంద్రావు, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పనిచేస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు, గొడవలు ఏం లేవు.’ అంటూ వంశీ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల ద్వారా ఒకవేళ తాను రాజీనామా చేసి, గన్నవరంకి ఉప ఎన్నిక జరిగినా వైసీపీ నుంచి తానే అభ్యర్థిగా పోటీ చేస్తాననే సంకేతాలు పంపడం వంశీ ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే, వంశీ చేతిలో ఓడిపోయిన అప్పటి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆయనకి ఎంతవరకూ సహకరిస్తారో సందేహమే. ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. గత ఎన్నికలకు ముందు తమని ఇబ్బంది పెట్టిన వంశీ.. ఇప్పుడొచ్చి గన్నవరం ఇంఛార్జ్‌గా తనను తాను ప్రకటించుకోవడం పట్ల కూడా యార్లగడ్డ వర్గం గుర్రుగా ఉందని తెలుస్తోంది.
ఇక మొదటి నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత దుట్టా రామచంద్రరావు రూపంలో వంశీకి మరో గండం కూడా ఉంది. తాజాగా దుట్టా చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే ఆ విషయం స్పష్టమవుతోంది.
తాజాగా గన్నవరం రాజకీయాలపై స్పందించిన దుట్టా.. "నాకు 40సం.లనుండి రాజశేఖర్ రెడ్డి తో పరిచయం ఉంది, ఆరోజు నుండి ఈరోజు వరకు ఆయన కుటుంబం తో నడిచాను. జగన్ పార్టీ పెట్టిన తరువాత ఆయనతో నడిచాను. నియోజకవర్గంలో ఏపని చేసిన నాతో సంప్రదించి చేశారు. జగన్ ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటించాను" అన్నారు.
"నియోజకవర్గంలో టీడీపీలో ఉండి పది సంవత్సరాల పాటు వైసీపీ కార్యకర్తలు పై కేసులు పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టిన వారు ఈరోజు వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీలో చేరి.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డాక్టర్ గారి వెంట ఉంటే ఏమి వస్తుంది అంటూ ఎమ్మెల్యే పక్కన ఉంటే పదవులు కాంట్రాక్టు లు ఇస్తాం.. రాకపోతే ఇబ్బందులు పడతారని నా దగ్గర ఉన్నవారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈ నియోజకవర్గంకు అన్నీ నేనే అని ఎమ్మెల్యే వంశీ అంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి వైసీపీ వెంట ఉన్నది ఇందుకేనా అని వైఎస్సార్ కార్యకర్తలు నా దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారు." అని దుట్టా చెప్పారు.
"నాకూ యార్లగడ్డ వెంకట్రావు కి విభేదాలు లేవు చిన్న మనస్పర్థలు తప్ప. నా అల్లుడు శివభరత్ రెడ్డి వంశీ చేసే అక్రమాలు ను ఆపుతున్నాడని ,శివ భరత్ రెడ్డి పక్కన ఉన్న నాయకులు ను బెదిరిస్తున్నారు. శివ భరత్ రెడ్డి కి పదవులు అవసరం లేదు, కావాలంటే గన్నవరం నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తా. వైసీపీ కార్యకర్తలు మీద చెయ్యి వేయాలంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు నన్నేమి చేయలేరు. వైసీపీ జెండా కప్పుకొనే చస్తా." అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు కు రానున్న 15రోజుల్లో ఒక చల్లని కబురు చెబుతా అని పేర్కొన్నారు.
దుట్టా వ్యాఖ్యలు చూస్తుంటే.. ఒకవేళ గన్నవరం ఉప ఎన్నిక జరిగినా వల్లభనేని వంశీకి వైసీపీ టికెట్ ఎంతవరకూ దక్కుతుందో నమ్మకం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యార్లగడ్డతో విభేదాలు లేవని చెప్పడం, కావాలంటే గన్నవరం నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తానని దుట్టా చెప్పడం చూస్తుంటే.. వంశీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. రాజీనామా చేసినా ఉపఎన్నికల్లో టికెట్ కష్టమే, ఒకవేళ టికెట్ వచ్చినా దుట్టా, యార్లగడ్డ వర్గాలు కలిసి ఓడించే అవకాశాలున్నాయి. మొత్తానికి వంశీ పరిస్థితి అటు టీడీపీకి, ఇటు వైసీపీకి కాకుండా అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.