దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీకి సారధి కరువయ్యాడు!!
posted on Aug 24, 2020 @ 11:31AM
సారధి లేని రథమైనా, సైన్యమైనా, పార్టీ అయినా సరైన దారిలో నడవలేవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీది కూడా అదే పరిస్థితి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు పార్టీని నడిపించే సారధి ఎవరా అని సతమతమవుతోంది.
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్టీ నాయకులు ఎంతమంది చెప్పినా రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సోనియాగాంధీ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. అయితే వయస్సు, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేక పోతున్నారు. దీంతో అసలే వరుస ఓటములతో జోష్ తగ్గిన కాంగ్రెస్ మరింత ఢీలా పడిపోయింది. దీంతో కాంగ్రెస్ లో జోష్ రావాలంటే కొత్త అధ్యక్షుడు రావాలని, అది కూడా రాహుల్ అయితేనే బాగుంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
కరోనా విషయంలో ముందే హెచ్చరించడం, వివిధ అంశాలపై మోడీ సర్కార్ ని ప్రశ్నిస్తుండటం వంటివి పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచాయి. అదీగాక రాహుల్ అయితేనే అందరూ ఆమోదిస్తారని పార్టీ సీనియర్ నేతలతో పాటు మిత్రపక్ష నేతలు కూడా చెప్తున్నారు. కానీ రాహుల్ మాత్రం పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇప్పటికీ ఆసక్తి చూపడంలేదు. అంతేకాదు అధ్యక్ష పదవి కోసం రాహుల్ కొత్తగా రెండు పేర్లు సూచించినట్లు సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రి, సీనియర్ నేత ఏకే ఆంటోనీ పేర్లను రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు, సోనియాకు అత్యంత సన్నిహితుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికి గాంధీ కుటుంబేతర వ్యక్తులే ప్రస్తుతానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.
అయితే మన్మోహన్, ఏకే ఆంటోనీ, ముకుల్ వాస్నిక్ లలో అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా పూర్తికాలంపాటు వారిని నియమించరన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేవలం తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలే అప్పజెప్పనున్నారని సమాచారం. ప్రస్తుత కరోనా సంక్షోభం తొలగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహిస్తారని, అందులోనే రాహుల్ పూర్తిస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. మరోవైపు రాహుల్ కోవిడ్ సమస్య సమసిపోయిన తర్వాత.. దేశవ్యాప్తంగా పర్యటిస్తారని ఆ తర్వాతే అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, పార్టీని కిందిస్థాయి నుంచి బలపడేలా చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి రాహుల్ కరోనా సంక్షోభం తర్వాత అయినా పార్టీ బాధ్యతలు చేపడతారో లేక అప్పుడు కూడా చేతులు ఎత్తేస్తారో చూడాలి. విచిత్రం అంటే ఇదేనేమో.. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ.. ఇప్పుడు సారధి కోసం సతమతమవుతోంది.