అమెరికా చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన జో బైడెన్
posted on Nov 5, 2020 9:25AM
డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇంతకు ముందు ఎవరూ సాధించని రికార్డును స్వంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్ష అభ్యర్థికీ రానన్ని పాపులర్ ఓట్లను సంపాదించుకుని జో బైడెన్ ఘన విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కోట్లకు పైగా పాప్యులర్ ఓట్లను సంపాదించుకున్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థి కూడా ఇన్ని ఓట్లను సాదించలేదు. అయితే 2008లో జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చాయి. దీంతో జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270కు చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఖాతాలో 264 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ట్రంప్ ఇప్పటివరకు 214 ఎలక్టోరల్ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. మరో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడికావాల్సి వుండగా, మూడింటిలో ట్రంప్, ఒకదానిలో బైడెన్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు.