గంటకో మిస్సింగ్.. పట్టపగలే హత్యలు! తెలంగాణలో పెరిగిన క్రైమ్
posted on Nov 5, 2020 @ 11:52AM
ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లని మహాత్మగాంధీ అప్పట్లో చెప్పారు. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చి ఏడు దశాబ్దాలు అయినా దేశంలో పరిస్థితులు మాత్రం మారలేదు. తెలంగాణలో అర్ధరాత్రి కాదు పట్టపగలు మగవారికే భద్రత లేకుండా పోయింది. ఇటీవలే సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో మిట్ట మధ్నాహ్నం క్లీనిక్ లో రోగులను పరీక్షస్తున్న డాక్టర్ ను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు వైద్యుడిని బెంగళూరువైపు తీసుకెళ్తుండగా రాప్తాడు సమీపంలో అనంతపురం పోలీసులు పట్టుకోవడంతో ఈ కేసు సుఖాంతమైనా.. పట్టపగలే డాక్టర్ ను ఎత్తుకెళ్లడం ప్రజల్లో భయాందోళన కల్గించింది.
తెలంగాణలో ఇటీవల హత్యలు, హత్యాచారాలు పెరిగిపోయాయి. గత నెలలోనే తమ కూతురిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో పటాన్ చెరువు ప్రాంతంలో హేమంత్ అనే వ్యక్తిని అమ్మాయి బంధువులు దారుణంగా చంపేశారు. నమ్మించి తమతో తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారు . మహబూబా బాద్ లో బాలుడిని కిడ్నాప్ చేసి చంపేసి.. తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేపింది. తర్వాత రెండు రోజులకే శామీర్ పేటలో మరో బాలుడిని కిడ్నాప్ చేసి మర్డర్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు లెక్కేలేకుండా పోయింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. గత ఏడాది హాజీపూర్ లో బయటపడిన సైకో కిల్లర్ దారుణా లను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత మేలో వరంగల్ గొర్రెకుంటలో తొమ్మిది మందిని ఒక్కడే చంపేసి బావిలో పడేసి జల సమాధి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ హత్య కేసులో ఇటీవలే వరంగల్ జిల్లా కోర్టు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు ఉరిశిక్ష విధించింది.
బాలికలు మిస్సయ్యారంటూ తెలంగాణలో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మిస్సింగ్ కేసులు భారీగా పెరిగినట్లు పోలీసుల లెక్కలే చెబుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో నాలుగు రోజుల్లోనే ఏకంగా 203 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. గత బుధవారం ఒక్కరోజులోనే తెలంగాణలో 65 మంది వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది, సైబరాబాద్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 26న 65 మిస్సింగ్ కేసులు, 27న 62, 28 న 65 కేసులు, 29న 11 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పోలీసుల వెబ్‌సైట్‌లో వెల్లడించారు.
తెలంగాణలో మిస్సింగ్ కేసులు మిస్టరీగానే మిగిలి పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా నమోదయ్యే మిస్సింగ్ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్ అవుతున్నా.. 15 శాతం కేసులు తేలకుండానే పోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల్లో ఇంకా 3 వేల 418 కేసులు ట్రేస్ అవుట్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్‌లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు పోలీసులు. అయితే తెలంగాణలో మైనర్ బాల బాలికల అదృశ్యం పై హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా క్లోస్ చేసిన 2 వేల కేసులను మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. పోలీసులు క్లోజ్ చేసిన మిస్సింగ్ కేసులను మళ్ళీ రీ ఓపెన్ చేయాలని ఆయన వాదించారు.
దిశ హత్యాచార ఘటన, దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత మహిళల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలంగాణ సర్కార్ హడావుడి చేసింది. ఉమెన్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడంతో పాటు షీ టీమ్స్ ను బలోపేతం చేస్తామని ప్రకటించింది. హైవే పెట్రోలింగ్ టీమ్ లను పెంచుతామని చెప్పింది. సీఎం కేసీఆర్ కూడా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయనే వార్నింగ్ ఇచ్చారు.మహిళల వంక చూడాలంటనే భయపోడిపోయేలా చేస్తామన్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత ఆ ఉద్యోగులతో సమావేశమైన కేసీఆర్.. మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ రూల్ ను అన్ని సంస్థలు పాటించేలా చూడాలని ప్రభుత్వ అధికారులను అదేశించారు. కాని సీఎం ప్రకటనలన్ని ప్రచారానికే పరిమితమయ్యాయి. ఎప్పటిలానే మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
కేసుల విచారణలో పోలీసులు సీరియస్ గా స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేసింది. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వచ్చాయి. కిడ్నాపర్ డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నా అతడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో , లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్ పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక శామీర్ పేటలో కిడ్నాప్ చేసి చంపేసిన అదియాన్ ఘటన విచారణలో తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యానికి సాక్షంగా నిలిచింది. బాలుడు కిడ్నాపై పది రోజులైనా పోలీసులు కేసులో పురోగతి సాధించలేకపోయారు. బాలుడిని అతడి పక్కింట్లో నివాసముండే వ్యక్తే హత్య చేసినట్లు తేలడం కలకలం రేపింది. బాలుడి కోసం గాలింపు చేశామని చెబుతున్న పోలీసులు.. పది రోజుల విచారణలో పక్కింటి వారిని ప్రశ్నించకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించేలా చేసింది.
మరోవైపు నేరాల నియంత్రణలో నిత్యం బిజీ గా వున్న పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాల్ విసురుతున్నాయి. పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. కొందరు తమ వాళ్లు అదృశ్యమైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని... మిస్సింగ్ కేసులను చేధించడంలో జాప్యానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా మిస్సింగ్ కేసులను పోలీసుల దృష్టికి తీసుకురావడం వల్ల.. తప్పిపోయిన వాళ్ల ఆచూకీని తొందరగా కనిపెట్టే అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు. గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. అయితే తాజాగా జరుగుతున్న దారుణ ఘటనలు పోలీసులకు మచ్చగా మారాయి. నేరాలను అరికట్టకపోతే పరిస్తితులు మరీ దారుణంగా తయారవుతాయని, ప్రభుత్వాలు మరింతగా పోలీస్ శాఖను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.