ఫ్యాన్ గాలి లేదు.. సొంతంగా గెలిచా! జగన్ కు ఎమ్మెల్యే ఝలక్
posted on Nov 5, 2020 @ 8:47PM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. అది మామూలు ఝలక్ కాదు.. పార్టీ అధినేత , మెనార్కిజానికి మారుపేరుగా చెప్పుకునే సీఎం జగన్ నే ధిక్కారించాడు ఆ ఎమ్మెల్యే. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు ఎవరితోనూ పని లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యేగా తాను ఫ్యాన్ గాలితో గెలవలేదని, సొంత బలంతో కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని చెప్పుకొచ్చారు. పార్టీ మారేందుకు సిద్ధమనే సంకేతమిచ్చారు. పార్టీపై ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపింది ఎవరో కాదు నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్.
గూడూరు నియోజవర్గ వైఎస్సార్‌సీపీలో చాలా కాలంగా విభేదాలున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇటీవల అసంతృప్తి భగ్గుమంటోంది. ఎన్నికలో కష్టపడి పనిచేసి గెలిపించిన వారిని విస్మరిస్తున్నారని స్థానిక నాయకులు, కార్యకర్తలు వరప్రసాద్‍పై తిరగబడ్డారు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికే వెళ్లి నిలదీశారు. ఎమ్మెల్యే మొండి వైఖరితో పార్టీ నష్టపోతుందంటూ మండల పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.ఎమ్మెల్యే ముందే నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
సొంత పార్టీ కార్యకర్తలే తనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడంతో ఆగ్రహంతో ఊగిపోయారు ఎమ్మెల్యే వరప్రసాద్. నిరసనకు దిగన నేతలపై విరుచుకుపడ్డారు. తాను ఫ్యాన్ గాలితో గెలవలేదు. సొంత బలంతో కోట్లు ఖర్చు పెట్టి గెలిచానంటూ బిగ్గరగా అరిచారు వరప్రసాద్. నన్ను ప్రశ్నించే అధికారం మీకెవరికీ లేదని హెచ్చరించారు. తనను ఇబ్బంది పెడితే.. పార్టీని వీడి వేరే పార్టీలో చేరతానని స్పష్టం చేశారు గుడూరు ఎమ్మెల్యే వరప్రసాద్. ఎమ్మెల్యే వైఖరితో అవాక్కయ్యారు వైసీపీ నేతలు.
వరప్రసాద్ 2014లో తిరుపతి నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల సమయంలో రాజకీయ కారణాలతో టీడీపీ నుంచి వచ్చిన బల్లి దుర్గా ప్రసాద్‌కు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వరప్రసాద్‌ను నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి స్థానిక నేతలతో వరప్రసాద్ కు గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల కాలంలో విభేదాలు తీవ్రమయ్యయి. తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కుట్రలు జరుగుతున్నాయని వరప్రసాద్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది. దీంతో పార్టీ పెద్దలపై అసహనంగా ఉన్న వరప్రసాద్.. ఇలా తన వాయిస్ వినిపించారని భావిస్తున్నారు. పార్టీ మారేందుకు కూడా వరప్రసాద్ సిద్ధమయ్యారని చెబుతున్నారు.
గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యాన్ గాలి లేదంటూ సీఎం జగన్ పరువు తీశారని వరప్రసాద్ వ్యాఖ్యలను ఇతర పార్టీలు వైరల్ చేస్తున్నాయి. వరప్రసాద్ ఎపిసోడ్ తో వైసీపీ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వరప్రసాద్ విషయంలో సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.