చిరు బీజేపీలో చేరుతారని ప్రచారం! పాస్ మార్కుల కోసం సోము టీమ్ మాస్టర్ ప్లాన్?
posted on Nov 6, 2020 @ 9:50AM
నవ్వుపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి. సోము వీర్రాజు పగ్గాలు చేపట్టాక ఆ పార్టీ ఉనికే కనిపించకుండా పోయింది. పార్టీ బలోపేతం చేస్తానంటూ బీరాలు పలికిన వీర్రాజు.. కొన్ని రోజులు బయటికే రాలేదు. రాష్ట్రంలో బోలెడు సమస్యలున్నా, ప్రజలు కష్టాల్లో ఉన్నా కమలం నేత పట్టించుకోలేదు. దీంతో ఏపీలో పువ్వు పార్టీ పురోగతి ప్రశ్నార్దమయిందనే ప్రచారం జరిగింది. పైపెచ్చు పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించాల్సింది పోయి ఉన్న నేతలను సాగనంపారు సోము వీర్రాజు. దీంతో ఆయన సోము వీర్రాజు కాదు సస్పెండ్ల వీర్రాజు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలాయి. మొత్తంగా పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో సోము వీర్రాజు నేతృత్వంలో ఏపీ బీజేపీ హోం క్వారంటైన్ లోకి వెళ్లిందనే చర్చ జనాల్లో జోరుగా జరిగింది.
తనపై వస్తున్న విమర్శలు, పార్టీ పరిస్థితిపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలియడంతోనే ఏమో సదరు సోము వీర్రాజు కొత్త డ్రామాకు తెర తీశారని తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి చేరుతున్నారన్న ప్రచారం. కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ నేతలు చిరంజీవి త్వరలోనే కమలం గూటికి చేరుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే దీని వెనక సోము వీర్రాజు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సోము డైరెక్షన్ లోనే ఆయన వర్గం నేతలు ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారంతో ఏపీలో బీజేపీ బలోపేతం కోసం సోము వీర్రాజు బాగా కష్టపడుతున్నారని, పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారని హైకమాండ్ భావిస్తుందని వీర్రాజు వర్గీయుల భావనంగా ఉందని చెబుతున్నారు. దీంతో సోముకు పార్టీ పెద్దల నుంచి ప్లస్ మార్కులు పడతాయని వారి ఆశలట. కొందరు కమలం నేతలు కూడా అఫ్ ది రికార్డుగా ఇదే విషయం చెబుతున్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రకటించిన కొన్ని రోజులకే హైదరాబాద్ వెళ్లి చిరంజీవిని కలిశారు సోము వీర్రాజు. తనకు సహకరించాలని చిరంజీవిని సోము వీర్రాజు కోరారని.. జనసేనాని పవన్‌కల్యాణ్‌తో కలిసి ముందుకెళ్లాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించారని అప్పడు ప్రచారం జరిగింది. చిరంజీవిని బీజేపీలోకి రావాలని వీర్రాజు ఆహ్వానించినట్లు కూడా మరో చర్చ జరిగింది. అయితే చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించలేదని సోము వీర్రాజే సమావేశం తర్వాత క్లారిటీ ఇచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే చిరంజీవిని కలిశానని తెలిపారు. జనసేన, బీజేపీ కలసి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారని వీర్రాజు చెప్పారు. చిరంజీవికి వచ్చిన 18 శాతం ఓట్లు, జనసేనకు వచ్చిన 7శాతం ఓట్లు.. భవిష్యత్తులో తమకు అనుకూలంగా మారతాయని కూడా చెప్పారు సోము వీర్రాజు.
గతంలో హైదరాబాద్ లో చిరంజీవిని సోము వీర్రాజు కలిసిన ఫోటోలను వాడుకుంటూ ఇప్పుడు కొత్త ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ అనుచరులు. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ ఫోకస్ చేసిందని, సినీ తారలను పార్టీలోకి ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఆ ఆపరేషన్ లో భాగంగానే కాంగ్రెస్ లో నుంచి సినీ నటి కుష్బూ బీజేపీలో చేరిందని చెబుతున్నారు. తమిళనాడుపై ఫోకస్ చేసిన మోడీ టీమ్.. అధికారమే లక్ష్యంగా గురుమూర్తి ద్వారా రజినీ కాంత్ కు ఒక ప్రతిపాదన పంపినట్లుగా బలంగా వినబడుతోంది. సోము వీర్రాజు మనుషులు కర్ణాటక, తమిళనాడు పరిణామాలను సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేస్తున్నారు. రజనీకాంత్, కుష్బూ బాటలోనే చిరంజీవి కూడా త్వరలోనే కమలం కండువా కప్పుకోవడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతోంది సోము వీర్రాజు వర్గం.
అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఇప్పుడు షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల గురించి అసలు ఆలోచించడం లేదని తెలుస్తోంది. గతంలో పార్టీ పెట్టిన చిరంజీవి అధికారంలోకి రాలేకపోయారు. ఆ తరువాత పార్టీని కాంగ్రెస్‍లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినీ లోకంలోకి వచ్చారు. గతంలో తన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని మళ్లీ ఉన్న పేరు తెచ్చుకోవటానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రాజకీయాలకు రావడం అసాధ్యమంటున్నారు మెగాస్టార్ అభిమానులు.
మరోవైపు సొంత తమ్ముడు జనసేన పార్టీని స్థాపించి జనంలోకి వెళుతున్నారు. గత ఎన్నికలలో పవన్ ఓడిపోయినా.. ప్రజలలో ఆయనకు ఆదరణ తగ్గలేదని.. ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాలలో వెల్లడైంది. అంతే కాకుండా బిజెపితో పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకున్నారు. దీంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల వైపు ఆలోచిస్తే జనసేనతో ఉంటారు కాని తమ్ముడి పార్టీ ఉండగా మరో పార్టీలోకి ఎందుకు వెళతారనే బేసిక్ ప్రశ్న సామాన్య ప్రజల నుంచే వస్తోంది. ఒకవేళ సోము వీర్రాజు చెబుతున్నట్లు బీజేపీ పట్ల చిరంజీవి సానుకూలంగా ఉన్నా.. ఎలాగూ జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి జనసేనలో ఉన్నా పెద్ద తేడా ఉండదని చెబుతున్నారు. జనసేనతో ఉంటూ కమలానికి సపోర్ట్ చేయవచ్చు. ఏ రకంగా చూసినా చిరంజీవి బీజేపీలో చేరడమంటూ ఉండదని రాజకీయ అనలిస్టులు కచ్చితంగా చెబుతున్నారు.
మొత్తంగా చిరంజీవి బీజేపీలో చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనక వీర్రాజు మాస్టర్ మైండ్ ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవిని అడ్డుపెట్టుకుని తనపై వస్తున్న విమర్శల నుంచి గట్టెక్కాలని ఆయన ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. కొందరు నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం చిరంజీవి పేరును వాడుకుంటున్నారని మెగాస్టార్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చిరంజీవి ప్రమేయం లేకుండా ఆయన పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు అన్నయ్య అభిమానులు.