దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు ఫల్టీ! అంతా సేఫ్
posted on Nov 5, 2020 @ 3:09PM
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు. దీంతో కారులోని వ్యక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తిరిగి పైకి లేపారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి అయిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సెప్టెంబర్ 25న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లాక్‌డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సందర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యాటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కేబుల్ బ్రిడ్జిపై ఓవరాక్షన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి వంతెనపై బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం, బ్రిడ్జిపై పడుకొని ఫొటోలు దిగడం చేస్తున్నారు. దీంతో ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు బ్రిడ్జ్‌పై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు లింక్ చేశారు. దీంతో ఇటీవల అర్ధరాత్రి బ్రిడ్జిపైకి చేరి షర్ట్ లేకుండా రోడ్డుపై పడుకొని ఫొటోలకు పోజులిస్తున్న పోకిరీలను కంట్రోల్ రూమ్ సిబ్బంది గుర్తించి పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్ సిబ్బంది బ్రిడ్జిపైకి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.