భారత్ లో మళ్ళీ 50 వేలకు పైగా కేసులు.. సెకండ్ వేవ్ మొదలయిందా..!
posted on Nov 5, 2020 @ 11:42AM
మన దేశంలో చలికాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాలలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక పక్క పలు విదేశాల్లో సెకండ్ వేవ్ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో... భారత్ లోనూ ఆ సంకేతాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వింటర్ సీజన్ లో భారత్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందన్న నిపుణుల అంచనాలు నిజమయ్యేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం కలిపి 50,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు మూడు వారాలుగా కరోనా కేసులు రోజుకు 40 వేల కు మించడం లేదు. అయితే తాజాగా అవి 50 వేలు నమోదవడం అటు ప్రజలలోను.. ఇటు నిపుణులలోను ఆందోళన కలిగిస్తున్నది. నిన్న నమోదైన తాజా కేసులతో కలిపి భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,64,086 కు చేరకుంది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 704 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,24,315 కు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న దేశవ్యాప్తంగా 55,331 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,27,962 ఉన్నాయి.
మరో పక్క ఉత్తరాది రాష్ట్రాలలో చలి కారణంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 6,842 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. ఇటు దక్షిణాది రాష్ట్రాలలోనూ కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేరళలో నిన్న 8,516 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 2,487 కేసులు, ఏపీ లో 2,477 కేసులు నమోదయ్యాయి.