ఒకే ప్రైవేట్ సంస్థకు అన్ని ఇసుక రీచులు! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
posted on Nov 5, 2020 @ 1:31PM
కొత్త ఇసుక పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. సబ్ కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని తెలుస్తోంది. దీంతో ఆ దిశగానే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రీచులను అప్పగించాలని తొలుత ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ పట్ల మొగ్గు చూపకపోవడంతో... వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అన్ని రీచులను ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తే... రాష్ట్రంలో ఇసుక కష్టాలు తీరే అవకాశం ఉంది.