ఐదేళ్లలో 5 వేల మిస్సింగ్ కేసులు! టీఎస్ సర్కార్ వివరణ కోరిన హైకోర్టు
posted on Nov 5, 2020 @ 3:28PM
తెలంగాణలో మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మిస్సింగ్ కేసులపై ప్రభుత్వ ప్రణాళిక ఏంటో చెప్పాలని కోరింది. తెలంగాణలో మైనర్ బాల బాలికల అదృశ్యం పై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 వేల మిస్సింగ్ కేసులు నమోదు కాగా, వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారి కేసులే ఎక్కువగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లోస్ చేసిన 2 వేల కేసులను మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం మిస్సింగ్ కేసులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ, మిస్సింగ్ కేసులపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. షీ టీమ్, దర్పణ్ యాప్, ఆపరేషన్ ముస్కాన్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సాయంతో చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు. డిసెంబరు 3 లోగా నివేదిక అందిస్తామని ఏజీ విన్నవించగా, డిసెంబరు 10కి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు.
బాలికలు మిస్సయ్యారంటూ తెలంగాణలో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో నాలుగు రోజుల్లోనే ఏకంగా 203 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. గత బుధవారం ఒక్కరోజులోనే తెలంగాణలో 65 మంది వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది, సైబరాబాద్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 26న 65 మిస్సింగ్ కేసులు, 27న 62, 28 న 65 కేసులు, 29న 11 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పోలీసుల వెబ్‌సైట్‌లో వెల్లడించారు.
తెలంగాణలో మిస్సింగ్ కేసులు మిస్టరీగానే మిగిలి పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా నమోదయ్యే మిస్సింగ్ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్ అవుతున్నా.. 15 శాతం కేసులు తేలకుండానే పోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల్లో ఇంకా 3 వేల 418 కేసులు ట్రేస్ అవుట్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్‌లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు పోలీసులు.