కమలానికి కలిసిరాని తెలుగు పొత్తులు
జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుగుదలలో మిత్ర పక్షాల పాత్ర తక్కువేమీ కాదు. అంతే కాదు, పొత్తులు, ఎత్తులు రెంటిలోనూ కాంగ్రెస్ కంటే కమల దళం రెండాకులు ఎక్కువే చదివింది. ఒకప్పుడు వాజపేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని చాలా చాకచక్యంగా నెట్టు కొచ్చారు. ఇప్పటికి కూడా కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సంఖ్యా బలం ఉన్నా, సాంకేతికంగా సంకీర్ణ (ఎన్డీఏ) ప్రభుత్వంగానే చెలామణి అవుతోంది. మిత్ర పక్షాలను వదులుకోలేదు.అయితే,ఇటీవల కాలంలో పొమ్మనకుండా పొగపెట్టి, భావసారుప్యతగల శివసేన,అకాళీ దళ్’తో సహా చాలా వరకు మిత్ర పక్షాలను సాగనంపింది. మరో వంక ఈనాటికీ సింగల్ మెంబర్ పార్టీలు సహా ఏ పార్టీ వస్తానన్నా వద్దనకుండా కూటమిలోకి ఆహ్వానిస్తుంది. పార్టీలనే కాదు, ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మాజీలు ఎవరు వస్తానన్నా వద్దనేదే లేదని, అందరికీ స్వాగతం పలుకుతుంది. అయితే, అసలు కథ ఆ తర్వాతనే మొదలవుతుంది అనుకోండి అది వేరే విషయం.
అయితే, తెలుగు రాష్ట్రాలలో మాత్రం బీజేపీకి పొత్తులు అంతగా కలిసిరాలేదు. తెలుగు దేశం ఆవిర్భావం నుంచి రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబంధాలు చాలా వరకు మారుతూ వచ్చాయి. మూడు పొత్తులు ఆరు విడాకులు అన్నట్లుగా కథ సాగుతూ వచ్చింది. అయితే పొత్తు పెట్టుకున్న ప్రతి సందర్భంలో, రెండు పార్టీలు ప్రయోజనం పొందాయి. ఉభయ తారకంగానే కథ నడిచింది. అయితే, రాష్ట్రంలో పెద్దన్న పాత్రను పోషించిన తెలుగు దేశం పార్టీ సహజంగానే ఎక్కువ ప్రయోజనం పొందింది,ఒక్కసారి మినహ బీజేపీతో పొత్తున్న ప్రతి సందర్భంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది.అయినా రెండు పార్టీల మధ్య సిద్ధాంత పరంగా ఏకొంచెం సారుప్యత లేకపోవడంతో, విడిపోయిన ప్రతిసందర్భంలోనూ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయినా, రాజకీయ అవసరాల దృష్ట్యా మళ్ళీ కలవడం జరిగింది. అయితే, 2019 ఎన్నికలకు ముందు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా ఇతర విభజన హామీలను అమలు చేయక పోవడంతో, తెలుగు దేశం పార్టీ పొత్తును తెంచుకుంది. ఫలితం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.
అదలా ఉంటే, ఇప్పుటికే ఒకసారి విడిపోయి రెండవ సారి కలిసిన, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన బంధం ఏక్షణంలో అయినా పుటుక్కుమనే ప్రమాదం/ప్రమోదం రోజు రోజుకు దగ్గరవుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున హటాత్తుగా తెరపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ తెరాస అభ్యర్ధి వాణీ దేవికి మద్దతు ప్రకటించడంతో, మొదలైన రచ్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో వచ్చిన మార్పుల నేపధ్యంలో మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విడాకుల ముహూర్తం ఎప్పుదనండి మాత్రం ఇంకా ఖరారు కాలేదు.