పీకే ఏడేళ్ల ప్రస్థానంలో మెరుపులు ...మరకలు
పవన్ కళ్యాణ్’ జనసేన పార్టీ పెట్టి ఏడేళ్ళు పూర్తయ్యాయి. 2014లోసార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు మాసాల ముందు మార్చి 14వ తేదీన ప్రశ్నిస్తానంటూ.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతవరకు పవర్ స్టార్’గా ఉన్న పీకే, అక్కడి నుంచి ‘జనసేనాని’గా కొత్త అవతారం ఎత్తారు. అయితే, పవన్ కళ్యాణ్ ‘కు రాజకీయ వేసాహం కట్టడం అదే తొలిసారి కాదు. అప్పటికది కొత్త వేషమే అయినా, రాజకీయాలలో అదే ఆయన తొలి అడుగు కాదు. అంతకు ఐదారేళ్ళ ముందు, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన కీలక పాత్రనే పోషించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి, బట్టలు ఊడతీసి కొడతాననే’ స్థాయిలో ప్రచారం సాగించారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది,చరిత్ర. చిరంజీవి చాప చుట్టేశారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే, ఉతికి ఆరేశారో అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. చిరంజీవి కేంద్రంలో,పార్టీ టికెట్ పై గెలిచి, కాంగ్రెస్’లో కలిసిన సి. రామ చంద్రయ్య రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవించారు. అయితే, ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి, తిట్టిన నోటితో మెచ్చుకోవడం ఇష్టం లేకనో ఏమో పవన్ కళ్యాణ్ మాత్రం కాంగ్రెస్’ లోకి వెళ్ళలేదు. రాజకీయాల నుంచి గ్యాప్ తీసుకున్నారు.సినిమాల్లో బిజీ అయి పోయారు.
ఆ కథ అలా ఉంటే, పార్టీ పెట్టిన ఏడేళ్ళలో, పవన్ కళ్యాణ్ రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్’ అన్ని భావజలాలతో సంసారం చేశారు. 2014లో ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. కూటమి గెలుపులో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో, పవన్ కళ్యాణ్ కీలక పాత్రనే పోషించారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, వైసీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పం. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 102 స్థానాలు గెలుచుకున్న తెలుగు దేశం పార్టీకి,44.9 శాతం ఓట్లు పోలయితే, వైసీపీకి 44.6 శాతం ఓట్లు పోలయ్యాయి.రెండు పార్టీలమధ్య వ్యత్యాసం జస్ట్ 0.3. అంటే, ఆ ఎన్నికలలో బీజేపీ, జనసేన పార్టీలో పొత్తు తెలుగు దేశం పార్టీకి ఐదేళ్ళ అధికారం ఇచ్చింది.
సరే, అదలా ఉంటే ఆ తర్వాత, కొంత కాలం బీజేపీ, టీడీపీలతో పవర్ స్టార్ హనీమూన్ బానే సాగింది కానీ మెల్లమెల్ల మెల్లగా దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు అది విడాకుల వరకు వెళ్ళింది. ప్రత్యేక ప్యాకేజి విషయంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట తప్పడంతో, పవర్ స్టార్ భగ్గుమన్నారు. కేంద్రం పై మండి పడ్డారు. ప్రత్యేక హోదా అడిగితే.. ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డులూ ఇచ్చారంటూ ఆయన కేంద్రంపై కస్సుమన్నారు. కళ్ళెర్ర చేశారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వంతో, పార్టీతోనూ కొంత కాలం పాటు అటూ ..ఇటూకాని, అదేదో రిలేషన్ మైంటైన్ చేశారు. పార్టీని అధికార టీడీపీకి లీజుకిచ్చారని,అమ్మేశారని చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అయినా,అయన తుడిచేసుకున్నారు.
ఇంతలో 2019 ఎన్నికలొచ్చాయి. ఆయన రాజకీయ ప్రస్థానం మరో మలుపు తీసుకుంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, పార్టీ పెట్టిన ఐదున్నర, ఆరేళ్ళకు తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. పార్టీకి, ఆయన సారధ్యం వహించిన కూటమికి కలిపి ఒకే ఒక్క సీటు దక్కింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి, పార్టీ అభ్యర్ధి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే, గెలిచిన కొద్ది రోజులకే రాపాక గోడ దూకారు. అధికార వైసీపీలో చేరారు. అలా ఆయన అసెంబ్లీలో సింగిల్ సీటు లేని అరివీర భయంకర పార్టీలు, మాజీ, తాజా మిత్ర పక్షాలు (బీజేపీ, వామపక్షాలు) సరసన చేరారు.
ఆ తర్వాత 2019 మిత్రులు వామపక్షాల చేయి వదిలి, కమలం చేయి పట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేశారు. పెద్దగా గిట్టుబాటు కాలేదు. బీజేపీతో స్నేహం చేసి చెడిపోయామని, లేదంటే మున్సిపల్ పోల్స్ లో ‘తడాఖా చూపేద్దుమని, అంటున్నారు, జన సైనికులు. అంటే, కమలం చేయి మళ్ళీ వదిలేందుకు ఆయన సిద్ధమై పోయారు.మరోవంక పక్క చూపులు చూస్తున్నారు. పక్క రాష్టం తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అక్కడి అధికార పార్టీకి మద్దతు నిచ్చారు. బహుశః, షర్మిలమ్మకు పోటీగా తెలంగాణలో దుకాణం తెరుస్తారోరో ఏమో .. అదెలా ఉన్నా, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడేళ్ళలో ,మలుపులు తిరుగుతూ, మరకలు అద్దుకుంటూ, ఇంకే నటరాజకీయ నేత వేయనన్ని రాజకీయ వేషాలు వేశారన్న పేరును సొంతం చేసుకున్నారు. రేపు ఏ వేషం వేస్తారో .. ఎవరితో కలుస్తారో ... అది ఆయనకు మాత్రమే తెలుసు.