బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన సంచలన ఆరోపణలు
posted on Mar 15, 2021 @ 2:34PM
బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఆ రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. బహిరంరంగానే నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీ జనసేన నేత పోతినేని మహేష్.. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో జనసేన పార్టీకి బీజేపీవల్ల పెద్ద నష్టం జరిగిందన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వ్యతిరేకించారన్నారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయామన్నారు. విజయవాడలో బీజేపీ తమకు అండగా నిలబడలేదని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ వల్లే ఓడిపోయామని చెప్పడం అంటే ఆ పార్టీతో తమకు లాభం లేదని జనసేన చెప్పడమేననే చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు తమకు దూరమయ్యారని చెప్పడాన్ని బట్టి.. బీజేపీకి జనసేన దూరమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీని టార్గెట్ చేస్తూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే పోతిన మహేష్ ఈ కామెంట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకునే యోచనలో భాగంగానే జనసేన నేతలు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.