అవంతి, గంటాకు షాక్! జంపింగ్ ఎమ్మెల్యేకు ఝలక్ 

విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు విలక్షమైన తీర్పు ఇచ్చారు. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజక వర్గాల్లో టీడీపీకి మెజారిటీ వార్డులు దక్కగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల్లో వైసీపీకి ఆధిక్యం వచ్చింది. మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటర్లు షాకిచ్చారు. టీడీపీలో గెలిచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌ కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి.  విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. దాదాపుగా 18 నెలలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీకి కేకే రాజు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ 17 డివిజన్లు వుండగా అందులో వైసీపీకి 15, టీడీపీకి 1, బీజేపీకి 1 వచ్చాయి. ఇక్కడ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది.గంటా సైలెంట్ గా ఉండటంతో టీడీపీ కేడర్ చెదిరిపోయిందని చెబుతున్నారు.  భీమిలి నియోజకవర్గానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సబ్బం హరి ఇన్‌చార్జిగా ఉన్నారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో జీవీఎంసీ పరిధిలో తొమ్మిది వార్డులు ఉన్నాయి. టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీ నాలుగు డివిజన్లు మాత్రమే దక్కించుకుంది. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు పట్టు నిలుపుకోకపోవడం చర్చగా మారింది.  విశాఖ దక్షిణం నియోజకవర్గానికి  ఎమ్మెల్యేగా  వాసుపల్లి గణేశ్‌కుమార్‌ ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసు.. కొన్ని నెలల క్రితం వైసీపీలో చేరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వ్యవహారాలన్ని ఆయన చూశారు. ఇక్కడ టీడీపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన శ్రీభరత్‌ ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకున్నారు. విశాఖ సౌత్  లో  13 వార్డులు వుండగా.. అధికార వైసీపీకి కేవలం 5 మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశానికి  4 డివిజన్లు దక్కగా.. జనసేన నుంచి ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు వైసీపీ రెబెల్స్ గెలిచారు.  టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ తూర్పులో  15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ టీడీపీకి  3, వైసీపీకి 9, వార్డులు దక్కాయి. జనసేన ఒకటి గెలుచుకోగా, మరొకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ 14 వార్డులు ఉండగా టీడీపీకి 5, వైసీపీకి 9 వార్డులు లభించాయి. వైసీపీ ఎమ్మెల్యే ఉన్న గాజువాకలో 17 వార్డులకు గాను..వైసీపీకి కేవలం 7 మాత్రమే వచ్చాయి. టీడీపీకి ఏడు, టీడీపీ బలపరిచిన సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి గెలుచుకోగా, జనసేన ఒక వార్డులో విజయం సాధించింది.  పెందుర్తికి వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సారథ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ జీవీఎంసీలో ఆరు వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీ 5 గెలుచుకోగా, వైసీపీకి కేవలం ఒకే ఒక్క వార్డు వచ్చింది. ఇక్కడ నుంచి టీడీపీ మేయర్‌ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు 96వ వార్డులో భారీ ఆధిక్యంతో గెలిచారు. జీవీఎంసీలో అనకాపల్లికి చెందిన 5 వార్డులు ఉన్నాయి. వాటిలో వైసీపీ నాలుగు గెలుచుకోగా, టీడీపీ ఒకటి దక్కించుకుంది. 

కమలానికి కలిసిరాని తెలుగు పొత్తులు

జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుగుదలలో మిత్ర పక్షాల పాత్ర తక్కువేమీ కాదు. అంతే కాదు,  పొత్తులు, ఎత్తులు రెంటిలోనూ కాంగ్రెస్ కంటే కమల దళం రెండాకులు ఎక్కువే చదివింది. ఒకప్పుడు వాజపేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని చాలా చాకచక్యంగా నెట్టు కొచ్చారు. ఇప్పటికి కూడా కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సంఖ్యా బలం ఉన్నా, సాంకేతికంగా సంకీర్ణ (ఎన్డీఏ) ప్రభుత్వంగానే చెలామణి అవుతోంది. మిత్ర పక్షాలను వదులుకోలేదు.అయితే,ఇటీవల కాలంలో పొమ్మనకుండా పొగపెట్టి, భావసారుప్యతగల శివసేన,అకాళీ దళ్’తో సహా చాలా వరకు మిత్ర పక్షాలను సాగనంపింది. మరో వంక ఈనాటికీ సింగల్ మెంబర్ పార్టీలు సహా ఏ పార్టీ వస్తానన్నా వద్దనకుండా కూటమిలోకి ఆహ్వానిస్తుంది. పార్టీలనే కాదు, ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మాజీలు ఎవరు వస్తానన్నా వద్దనేదే లేదని, అందరికీ స్వాగతం పలుకుతుంది. అయితే, అసలు కథ ఆ తర్వాతనే మొదలవుతుంది అనుకోండి అది వేరే విషయం. అయితే, తెలుగు రాష్ట్రాలలో మాత్రం బీజేపీకి పొత్తులు అంతగా కలిసిరాలేదు. తెలుగు దేశం ఆవిర్భావం నుంచి రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబంధాలు చాలా వరకు మారుతూ వచ్చాయి. మూడు పొత్తులు ఆరు విడాకులు అన్నట్లుగా కథ సాగుతూ వచ్చింది. అయితే పొత్తు పెట్టుకున్న ప్రతి సందర్భంలో, రెండు పార్టీలు ప్రయోజనం పొందాయి. ఉభయ తారకంగానే కథ నడిచింది. అయితే, రాష్ట్రంలో పెద్దన్న పాత్రను పోషించిన తెలుగు దేశం పార్టీ సహజంగానే ఎక్కువ ప్రయోజనం పొందింది,ఒక్కసారి మినహ బీజేపీతో పొత్తున్న ప్రతి సందర్భంలోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది.అయినా రెండు పార్టీల మధ్య సిద్ధాంత పరంగా ఏకొంచెం సారుప్యత లేకపోవడంతో, విడిపోయిన ప్రతిసందర్భంలోనూ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయినా, రాజకీయ అవసరాల దృష్ట్యా మళ్ళీ కలవడం జరిగింది. అయితే, 2019 ఎన్నికలకు ముందు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక  హోదా సహా ఇతర విభజన హామీలను అమలు చేయక పోవడంతో, తెలుగు దేశం పార్టీ పొత్తును తెంచుకుంది. ఫలితం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. అదలా ఉంటే, ఇప్పుటికే ఒకసారి విడిపోయి రెండవ సారి కలిసిన, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన బంధం ఏక్షణంలో అయినా పుటుక్కుమనే ప్రమాదం/ప్రమోదం రోజు రోజుకు దగ్గరవుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున హటాత్తుగా తెరపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ తెరాస అభ్యర్ధి వాణీ దేవికి మద్దతు ప్రకటించడంతో, మొదలైన రచ్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో వచ్చిన మార్పుల నేపధ్యంలో మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విడాకుల ముహూర్తం ఎప్పుదనండి మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన సంచలన ఆరోపణలు

బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఆ రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. బహిరంరంగానే నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీ జనసేన నేత పోతినేని మహేష్.. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో జనసేన పార్టీకి బీజేపీవల్ల పెద్ద నష్టం జరిగిందన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వ్యతిరేకించారన్నారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయామన్నారు. విజయవాడలో బీజేపీ తమకు అండగా నిలబడలేదని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.    బీజేపీపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ వల్లే ఓడిపోయామని చెప్పడం అంటే ఆ పార్టీతో తమకు లాభం లేదని జనసేన చెప్పడమేననే చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు తమకు దూరమయ్యారని చెప్పడాన్ని బట్టి.. బీజేపీకి జనసేన దూరమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీని టార్గెట్ చేస్తూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే పోతిన మహేష్ ఈ కామెంట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకునే  యోచనలో భాగంగానే జనసేన నేతలు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

కేసీఆర్ పై గవర్నర్ ప్రశంశలు

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్రసంగించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న అన్ని విధాలుగా రాష్ట్రము ముందుకు పోతుందని.. చెపుతూ ముఖ్యమంత్రి సేవలను గవర్నర్ కొనియాడారు..  గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. అన్నివర్గాల ప్రజల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామని. కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించాం అనిఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నాం. అంటూ గవర్నర్ ప్రసంగం మొదలైయింది.  సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ ముందుకు దూసుకెళ్తోందని ఆమె అన్నారు.  రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించామని ,వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని.. ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగిందని.. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటించమని.. కోవిడ్‌ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని..కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ ఎంతో కష్టపడ్డారని  గవర్నర్‌ తమిళిసై కరోనా వ్యాక్సినేషన్‌ సక్సెస్‌గా ముందుకు సాగుతోందన్న విషయం ఆమె చెప్పుకొచ్చారు..  విద్యుత్‌ రంగంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధించింది అతి తక్కువ సమయంలో క్లిష్టమైన సమస్యలను అధిగమించాం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారింది జాతయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్‌ తలసరి వినియోగం ఎక్కువ విద్యుత్‌రంగ సంస్కరణపై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది తాగునీటి సమస్యకు మిషన్‌ భగీరథతో శాశ్వత పరిష్కారం మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచింది గిరిజన గ్రామాలు, తండాలకు కూడా మంచినీటిని అందిస్తున్నాం 57.26 లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు తెలంగాణను ఫోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం. మిషన్‌ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించాం తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి రెవెన్యూ వసూళ్లలో రాష్ట్ర అగ్రగామిగా ఉంది సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది సమైక రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం కరువు ప్రాంతాలకు కూడా సాగునీరు ఇచ్చాం భక్త రామదాసు ప్రాజెక్ట్‌ 7 నెలల్లో పూర్తి త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తి డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10 వేలు తెలంగాణలో 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లు పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ.8,710 కోట్లు కేటాయింపు ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.. ఆమె చెప్పారు.  మంగళవారం నాడు దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల స‌భ‌లో సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఎల్లుండి గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ నెల 18న అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హ‌రీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల‌ 19వ తేదీన సెలవు ఉంటుంది. ఆ త‌దుప‌రి రోజు నుంచి బడ్జెట్‌పై చర్చలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇదిలావుంచితే, అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తొలిసారి అడుగు పెట్టారు. అలాగే, నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌ల్వ‌కుంట్ల‌ కవితతో పాటు గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు మండ‌లిలో తొలిసారి అడుగు పెట్టనున్నారు.

ఎక్స్‌ అఫీషియోలో ట్విస్ట్! రసవత్తరంగా తాడిపత్రి  ఎన్నిక

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. తాడిపత్రిలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాకపోవడంతో చైర్మెన్ ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. ఇక్కడ ఎక్స్‌అఫీషియో ఓటు కోసం నలుగురు ఎమ్మెల్సీలు పెట్టుకున్న దరఖాస్తును మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌రెడ్డి తిరస్కరించారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు  గోపాల్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్‌, శమంతకమణిలు ధరఖాస్తు చేసుకోగా.. రూల్స్ ప్రకారం ఓటు అర్హత లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రాయదుర్గంలో ఓటు హక్కుతో ఎమ్మెల్సీ అయ్యారని కమిషనర్‌ వివరించారు.    తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా... రెండు వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. దీంతో మున్సిపాలిటీలో  మొత్తం బలం టీడీపీకి 18, వైసీపీకి 16గా ఉంది. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. అధికార వైసీపీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం 18కి చేరుతుంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో.. ఆ పార్టీ  సొంతబలం 19 అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ దీపక్‌ రెడ్డి ఓటును తిరస్కరించారు.  తాడిపత్రి మున్సిపాలిటీని ఎలాగైనా గెలుచుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. టీడీపీని చీల్చటానికి కూడా అధికార పార్టీ కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి... గెలిచిన వారందరిని క్యాంపుకు తరలించారు. ప్రస్తుతం టీడీపీ శిబిరంలోనే సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో గురువారం జరిగే చైర్మెన్ ఎన్నికల్లో టీడీపీకే పీఠం దక్కే అవకాశం ఉంది. 

ఎన్నికల్లో కులాల కుమ్ములాట.. కొంప ముంచిన పేపర్ టైగర్స్? 

కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీకి కంచుకోట. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఆ పార్టీకి ఆయువుపట్టులా నిలిచింది. టీడీపీ వ్యవస్థాపకులు, నందమూరి తారకరామారావు సొంత జిల్లా కావడంతో... టీడీపీకి ఈ జిల్లాలో ఎదురులేకుండా పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా వీచినా.. విజయవాడ ఎంపీతో పాటు రెండు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. అలాంటి చోట ఇప్పుడు టీడీపీ గతంలో ఎప్పుడు లేనంతగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతి సెంటిమెంట్ ఉన్నా.. మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో కనీసం ఖాతా తెరవలేకపోయింది టీడీపీ. ఖచ్చితంగా గెలుస్తామని భావించిన విజయవాడ కార్పొరేషన్ ను వైసీపీ కైవసం చేసుకోవడం తమ్ముళ్లను కలవరపరుస్తోంది. విజయవాడలో పార్టీ ఓటమికి.. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలే కారణమని టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఎంపీ కేశినేని నానిని వ్యతిరేకంగా గ్రూప్ నడుపుతున్న ముగ్గురు నేతల వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపిస్తున్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ అత్యంత కీలకంగా మారింది. అమరావతి రాజధాని నినాదానికి ఇది రెఫరెండం అనే చర్చ జరిగింది. అందుకే వైసీపీ.. విజయవాడపై స్పెషల్ ఫోకస్ చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతి రాజధానిగా కొనసాగడానికి ప్రజల మద్దతు లేదని నిరూపించడంతోపాటు, మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకునేందుకు  విజయవాడలో గెలిచి తీరాలని డిసైడయ్యారు. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి వైసీపీ నేతలంతా ఏకమయ్యారు. వార్డు వలంటీర్లను సమర్ధంగా ఉపయోగించుకుని వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపారు. కేటాయించిన ఇంటి స్థలం కూడా వెనక్కి వెళ్లిపోతుందని బెదిరించారు. డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ శక్తియుక్తులన్నింటినీ అభ్యర్థుల గెలుపుపై కేంద్రీకృతం చేశారు. అత్యంత కీలకమైన విజయవాడలో గెలుపు కోసం వైసీపీ నేతలంతా ఏకమయితే.. విజయవాడ తెలుగు తమ్ముళ్లు మాత్రం రోడ్డున పడ్డారు. పార్టీ లైన్ తప్పి తెలుగు తన్నులాటకు దిగారు. కేశినేని నాని ఒకవైపు.. బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగూల్‌మీరాలు మరోవైపు. కేశినేని కూతురు శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై రగిలిపోయిన ముగ్గురు నేతలు.. బొండా ఉమా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని.. కేశినేనిపై కస్సుమన్నారు. తమ పార్టీ నేతనే నోటికొచ్చినట్టు  చెడామడా తిట్టేశారు. ఆధిపత్య పోరును కాస్తా, కులాల కుమ్ములాటలుగా మార్చేశారు. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతుంటున్నావంటూ నానిపై చిందులు తొక్కారు అసంతృప్త నేతలు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ నానిపై మండిపడ్డారు. కేశినేని కావాలా? అందరూ కావాలా? అంటూ చంద్రబాబుకే అల్టిమేటం ఇచ్చారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం కేశినేని నాని. కులాల మధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.  తెలుగుదేశంలో అంతర్గత పోరు రచ్చకెక్కడం  కార్యకర్తలతోపాటు ఓటర్లపైనా ప్రభావం చూపింది. ఎన్నికలకు నాలుగైదు రోజుల ముందు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బొండా ఉమ, నాగుల్‌ మీరా రోడ్డుకెక్కడం పార్టీ గెలుపుపై ప్రభావం చూపింది. పశ్చిమలో బీసీ అభ్యర్థులకు బీఫాం ఇచ్చిన తర్వాత వారిని కాదని ఓసీ అభ్యర్థులను పెట్టడంపై ఎంపీ నానిని బుద్దా బహిరంగంగానే విమర్శించారు. అంతర్గతంగా పరిష్కరించుకోదగ్గ ఈ అంశంపై రోడ్డుకెక్కడంతో ఈ విషయం బీసీ ఓటర్లలోకి వెళ్లి వారి ఓటింగ్‌పై ప్రభావం చూపిందని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు.  టీడీపీ అభ్యర్థులకు దన్నుగా నిలిచే నాయకులు కరువయ్యారు. ఆర్థికంగా పోరాడలేక చాలామంది అభ్యర్థులు చేతులెత్త్తేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెలంపల్లిపై ఉన్న వ్యతిరేకతను కూడా ఓట్లరూపంలోకి మలుచుకోలేకపోయారు. నాయకులు అంతా కలిసి కట్టుగా ఉంటే మరో పది స్థానాల్లో సునాయాసంగా టీడీపీ గెలుపు సాధించేది. విజయవాడలో మంత్రి వెలంపల్లిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాని దాన్ని కూడా  ఓట్ల రూపంలో మలచుకోలేక చతికిలపడింది టీడీపీ. దీంతో ఇక్కడ అత్యధికంగా 22 స్థానాలకుగాను 18కిపైగా స్థానాలను వైసీపీ గెలుచుకుంది. సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ కాస్త పోటీ ఇచ్చింది. తూర్పులో మొత్తం 21 స్థానాలకుగాను ఏడు స్థానాల్లో టీడీపీ గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు ఇక్కడ 18వేల మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో వైసీపీ సుమారు 12వేల ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన యువనేత దేవినేని అవినాశ్‌ తూర్పులో వైసీపీ పుంజుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీ నేతల వర్గపోరును వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకోవడం వల్లే ... ఆ పార్టీకి అనూహ్య ఫలితాలు వచ్చాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  చరిత్రలో ఊహించని విధంగా పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీలో పోస్ట్ మార్టమ్ మొదలైంది. తన స్వంత ఇంటిని చక్కదిద్దుకుంటుందా..? ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై సమీక్ష నిర్వహించుకుంటుందా..?పార్టీకి ద్రోహం చేసిన పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే ధైర్యం అధినేతకు ఉందా..? అన్న చర్చ ఇప్పుడు తమ్ముళ్లలో నడుస్తోంది. పార్టీ కార్యకర్తలు, సానుభూపతిపరులు ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేస్తుంటే, పదవులు అనుభవించి, ఇంకా పదవులపై కూర్చున్న నేతలు పలాయనం చిత్తగించారని కేడర్ మండిపడుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమ తీరుపైనా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఎవరిని లెక్కచేయని ఉమ.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్లారని నిలదీస్తున్నారు. వైసీపీ నేతలు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నా... టీడీపీ అభ్యర్థులకు ఏమాత్రం సాయం చేయలేదని మండిపడుతున్నారు.  ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న  విజయవాడ, గుంటూరు లో పార్టీ ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారా..? విజయవాడలో పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులపై అధినేత  చంద్రబాబు' చర్యలు తీసుకుంటారా..? లేక వదిలేస్తారా..? అనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు  కుల ప్రస్తావన తెచ్చి పార్టీకి ద్రోహం చేసిన  విజయవాడ పేపర్‌ టైగర్స్‌పై చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీ మంచి స్వింగ్‌లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సమయంలో టిడిపి ఒక కులానికే చెందిందని వ్యాఖ్యలు చేసిన 'బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా, బోండా ఉమామహేశ్వరరావు'లపై చర్యలు తీసుకుని 'చంద్రబాబు' పార్టీని గాడిలో పెట్టాలని వారు కోరుకుంటున్నారు. ప్రత్యర్థుల వద్ద నుంచి సొమ్ములు తీసుకున్నారనే ఆరోపణలు ఆ ముగ్గురిపై వస్తున్నాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడి పార్టీకి ఘోరఓటమికి కారణమైన వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదంటున్నారు తమ్ముళ్లు. పట్టుమని పది ఓట్లు తేలేని వారిని పార్టీ అందలం ఎక్కించిందని, దాని ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి జాతి రత్నాలపై వేటు వేయాలని విజయవాడ టిడిపి కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. మరీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి మరీ...   

కూతుర్ని చంపిన తండ్రి.. అసలు కారణం ఇది.. 

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. 8 ఏళ్ళ కుమార్తె ఉంది. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యత కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్ వెళ్ళాడు గురువేంద్ర. దూర దేశం కదా.. సంవత్సరానికి చుట్టపు చూపుగా ఇంటికి వచ్చేవాడు. ఇంకేముందుడి భార్యకు భర్త కష్టం కనిపించలేదు. తన  అవసరం మాత్రం కనిపించింది. అందుకోసం బతుకుదామనుకుంది. అందుకే ఆ అవసరం తన తప్పుకు కారణం అయింది. ఆ అవసరం వేరే వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి ఆ వ్యవహారం భర్త  పిల్లలను వదిలి ప్రియుడితోనే వెళ్తానని స్థాయికి చేరింది. అమ్మ నాన్న ఎంత చూపిన తన ప్రియుడితోనే వెళ్తానంటూ భీష్మించు కూర్చుంది. ఆ కారణం చేతనే కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో పరువు పోతుందన్న ఉద్దేశంతో తండ్రే కుమార్తెను హత్య చేశాడు. కడప జిల్లా వేంపల్లెలో ఈ సంఘటన జరిగింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపిన వివరాల మేరకు వేంపల్లెకు చెందిన గురువేంద్రకు, ప్రొద్దుటూరుకు చెందిన పోరుమామిళ్ల వనజరాణి (29)తో 2009లో వివాహమైంది. వీరికి 8 సంవత్సరాల పూజిత అనే కుమార్తె ఉంది. భర్త గురువేంద్ర దుబాయ్‌లో పనిచేస్తూ ఏడాదికో రెండు నెలలు ఇంటికి వచ్చి వెళ్లేవారు. రెండు నెలల క్రితం గురువేంద్ర దుబాయ్‌లో పనిమానుకుని వేంపల్లెకు వచ్చాడు. ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకొని ఉపాధి కోసం ప్రయత్నించేవాడు. ఈ నేపథ్యంలో భార్య వనజరాణికి ప్రొద్దుటూరులో ప్రియుడు ఉండేవాడు. అతడితో తరచూ మాట్లాడేది. ఇటీవల ఈ విషయంపై ఆ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. పెద్దల వద్ద పంచాయితీ కూడా జరిగింది. భర్త, కుటుంబ సభ్యులు వద్దు ప్రియుడి వద్దకే వెళ్తానని తెగేసి చెప్పడంతో ఆమె తండ్రి రాజశేఖర్‌ ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చచెప్పినప్పటికీ వినలేదు.    వేంపల్లెలోని ఇంటిలో మేడపైకి వనజరాణిని తండ్రి రాజశేఖర్‌ మరో ఇద్దరు కలిసి మాట్లాడేందుకు పిలుచుకెళ్లారు. ఎంతకీ వినకపోవడంతో చున్నీతో గొంతుకు ఉరివేసి హత్య చేసి పరారయ్యారు. ఆదివారం విషయం బయటకు తెలియడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువేంద్ర ఫిర్యాదు మేరకు వనజరాణి తండ్రి రాజశేఖర్‌ మరో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐలు ఆదివారం సాయంత్రం వనజరాణిని హత్య చేసిన ఇంటి స్థలాన్ని పరిశీలించారు. భర్త, అత్త ఇతర కుటుంబ సభ్యులను విచారించారు. 

బీజేపీకి పవన్ రాంరాం! తెలంగాణతో షురూ.. 

కమలానికి పవన్ కల్యాణ్ కటీఫ్ చెప్పబోతున్నారా? తన దారి తాను చూసుకోవడానికి సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పవన్ కల్యాణ్ కామెంట్లు కూడా అలానే ఉన్నాయి. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకోవడం, తెలంగాణ బీజేపీ నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో .. ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. బీజేపీతో పొత్తుకు జనసేన గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.  తెలంగాణలో రాజకీయ పార్టీలు సవాల్ గా తీసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ.. బీజేపీ పై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేంద్ర బిజెపి జనసేనతో సఖ్యతగా ఉన్నప్పటికీ తెలంగాణ బిజెపి నేతలు మాత్రం జనసేనను అవమానించారని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు  హైదరాబాద్‌ ఎంఎల్‌సి స్థానానికి టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. జనసేనను చులకనగా చూసేలా తెలంగాణ బిజెపి నేతలు మాట్లాడారని ఆరోపించారు. కేంద్ర నాయకత్వం జనసేనతో ఉన్నా.. తెలంగాణ నాయకత్వం మాత్రం జనసేన పార్టీని చులకన చేసిందని.. అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పివి కుమార్తెకు మద్దతిస్తున్నాం అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పవన్ మద్దతు ప్రకటించడం వెనుక పెద్ద లెక్కే ఉందంటున్నారు. బీజేపీతో తెగ తెంపులు చేసుకోవాలనే యోచనలో ఉన్న పవన్ కల్యాణ్... ముందుగా తెలంగాణ నుంచి ఆ పని మొదలు పెట్టారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను అస్త్రంగా మార్చుకుని కమలానికి ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన పొత్తు గురించి బీజేపీ ఎంపీ అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే జనసైనికులు తీవ్రంగా స్పందించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పవన్ తో చర్చలు జరపడంతో అప్పుడు సమస్య కొలిక్కి వచ్చింది. గ్రేటర్ లో జరిగిన పరిణామాలపై గుర్రుగా ఉన్న పవన్ కల్యాణ్.. సమయం చూసి తెలంగాణ బీజేపీని దెబ్బ కొట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  తెలంగాణ బీజేపీని ఓపెన్ గానే టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.. ఏపీలో ఆ పార్టీతో కలిసి వెళ్లడం అసాధ్యమనే అభిప్రాయం అనలిస్టుల నుంచి వ్యక్తమవుతోంది. బీజేపీతో దూరం కావాలని దాదాపుగా డిసైడ్ అయ్యారు కాబట్టే.. తెలంగాణ కమలనాధులపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటున్నారు. తన వ్యూహంలో భాగంగానే తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి జనసేన తప్పుకుందనే చర్చ కూడా జరుగుతోంది.  రాజకీయ భవిష్యత్ కోసమే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో పోటీ చేయడం వల్ల ప్రత్యేక హోదా అంశం, రైల్వే జోన్,  రాజధాని, విశాఖ ప్రైవేటీకరణ తదితర అంశాలు తెరమీదకు వస్తాయని జనసేన భావిస్తుంది. ప్రత్యేక హోదా అంశం పెండింగులో ఉండగా..తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. కాక రేపుతోంది. కేంద్ర సర్కార్ పై నిర్ణయంపై ఆంధ్రులు భగ్గుమంటున్నారు. బీజేపీ పేరు చెబితేనే మండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో దూరంగా ఉండటమే బెటరని జనసేన నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఏపీ బీజేపీ నేతల తీరుపైనా పవన్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.  ప్రభుత్వంపై పోరాటం చేయకుండా దేవుళ్ల ఫొటోలతో ట్విట్టర్‌ వ్యాఖ్యలు, రీ ట్వీట్‌లు.. సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌తో సోము వీర్రాజు టీమ్ కు ఓట్లు రాలతాయా? అన్న ప్రశ్న జనసేన నేతల నుంచి వస్తుందట. ప్రతిపక్షం ఎప్పుడైనా అధికార పార్టీ తప్పులపై పోరాటం చేయాలి. సోము వీర్రాజు టీమ్‌ ఎక్కడా ఆ పని చేయడంలేదు. రెండోది సొంత పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉండగా, బలమైన నాయకులు, కేడర్‌కు నేతలే అడ్డంకులు వేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చి రాష్ట్రానికి ఏదైనా చేస్తున్నారా? అంటే తిరుపతి నుంచి విశాఖ వరకూ విక్రయాలే తప్ప ఊతం లేదు. అందుకే ఈ చెలిమి మనకు నష్టం కలిగించక ముందే మేలుకోవాలన్న ఒత్తిళ్లు పవన్‌కు కేడర్‌ నుంచి వస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో పోల్చిచూస్తే బీజేపీ సాధించింది తక్కువేనన్న విషయం కూడా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది.   బీజేపీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం జనసేన మీద పడుతుందనే భయం కూడా పవన్ కల్యాణ్ లో కనిపిస్తుందట. అందుకే తిరుపతిలో పోటీ చేయకుండా వదిలేస్తే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని అభిప్రాయం జనసేన నేతల్లో బలంగా ఉన్నట్లు తెలిసింది. ఫలితాలు తర్వాత ఆ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని 2024 ఎన్నికలకు వెళతామని ఆ పార్టీలోని కొంత మంది చెబుతున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే.. తిరుపతి సీటును బీజేపీకి వదిలేసి.. జనసేన సేఫ్ జోన్ లోకి వెళ్లిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి... జనసేన గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అనలిస్టులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.

మంత్రి రాసలీల కేసులో మరో ట్విస్ట్..

కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి రాసలీలల సీడి కేసు రోజుకు ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఈ కేసు పై కర్ణాటక ప్రముఖ నాయకులూ తమ వాదన వినిపిస్తున్నారు. ఈ కేసులో  కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్‌ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదని జేడీఎస్‌ మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.  కొందరు ఆయన పేరును ప్రస్తావిస్తూ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. రక్షణ కల్పించాలని బాధిత యువతి కోరినందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జార్కిహొళి వీడియోల కేసులో బాధిత యువతి చెప్పిన వివరాలు నా దృష్టికి వచ్చాయి, విచారణ జరుగుతున్నందున ఏమీ చెప్పలేను అని కేపిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్‌ అన్నారు. సీడీ వెనుక ఎవరున్నారో తెలియడం లేదన్నారు. బీజేపి ఎమ్మెల్యే యత్నాళ్‌ కూడా రాసలీల వీడియోల  గురించి మాట్లాడారన్నారు. దీనిని బట్టి బీజేపీలోనే కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ నాయకులు సీడి కేసులో తమను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని, తగిన సమయంలో స్పందిస్తానని తెలిపారు.   మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యువతి విడుదల చేసిన కొత్త వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షనేత సిద్దరామయ్య స్పందించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... భద్రత కోరుతూ యువతి వీడియో విడుదల చేయటంపై అసెంబ్లీలో మాట్లాడుతానని, సీడీ కేసు వెనుక కాంగ్రెస్‌ నాయకులున్నారనే ఆరోపణపై అడిగిన ప్రశ్నకు సిద్దరామయ్య, దీనిపై కూడా తాను స్పందించనని, ఎవరు తప్పు చేసినా వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. 

26 జిల్లాల్లో పెరిగిన కేసులు.. తెలంగాణలో మళ్లీ కరోనా పంజా

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. చాప కింద నీరులా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలో  ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం 46 నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం 15 కేసులకు పెరిగాయి. కాగా శనివారం 50,998 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 228 మందికి పాజిటివ్‌ వచ్చింది.  ఆదివారం టెస్టుల సంఖ్య తగ్గడంతో కేసులు కొంత తగ్గాయి. ఆదివారం 38 వేల మందికి టెస్టు చేయగా..  157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 35 మందికి క‌రోనా సోకింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,654గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,983 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 718 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.  శనివారం నాటికి తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారు.  జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటి డోస్‌ టీకా తీసుకున్నవారు 5,27,117 మంది కాగా, రెండో డోస్‌ టీకా తీసుకున్నవారు 2,22,080 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్‌ టీకాల సంఖ్య 7,49,197కు చేరింది. 

ఒక్క ఓటు కూడా రాలే..

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఎన్నికల కౌంటింగులో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని వార్డులు, డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థులకు భారీ మెజార్టీలు రాగా.. కొన్ని వార్డుల్లో మాత్రం పోటీ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. తాడిపత్రి మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఫలితం టై కావడంతో టాస్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. ఇక కొన్ని వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాలేదు. కొన్ని వార్డుల్లో ఒకటి, రెండు ఓట్లు వచ్చాయి.  తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల 5వ వార్డులో వైసీపీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు పోటీపడ్డారు. ఆ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన గోనమండ వెంకటేశ్వరరావుకు ఒక్క ఓటు కూడా రాలేదు. వెంకటేశ్వరరావు, అతని కుటుంబ సభ్యుల ఓట్లు 19వ వార్డులో ఉన్నాయి. అతను పోటీ చేసింది 5వ వార్డు కావడంతో తన ఓటు కూడా వేసుకోలేకపోయాడు.   అమలాపురం పురపాలక సంఘంలో పోటీ చేసిన 72 మంది అభ్యర్థులలో ఒక్క ఓటు కూడా రాని ఒకే ఒక్క అభ్యర్థిగా రాయుడు బాబ్జికుమార్‌ నిలిచారు. ఆయన 18వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన కుటుంబానికి చెందిన ఓట్లన్నీ 15వ వార్డులో ఉన్నాయి. దీంతో ఆయన పోటీ చేసిన 18వ వార్డులో ఓటు వేసుకునే అవకాశం బాబ్జికుమార్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు  లేకుండా పోయింది. దీంతో వారి ఓట్లు పడలేదు. అయితే ఆయన్ను బలపరిచిన వార్డు ఓటర్లు కూడా బాబ్జికుమార్‌కు ఓట్లు వేయకపోవడంతో ఒక్క ఓటు కూడా రాని అభ్యర్థిగా ఆయన నిలిచిపోయారు. ఈ స్థానంలో నోటాకు 24 ఓట్లు రాగా చెల్లని ఓటు ఒకటి వచ్చింది. 

రాబోయే రోజుల్లో మోడీనే దేవుడు! రాముడితో పోల్చిన  బీజేపీ సీఎం 

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భగవంతుడితో పోల్చారు. ‘ద్వాపర, త్రేతాయగాలలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వచ్చారు. శ్రీరాముడు సమాజ హితం కోరి పనిచేశారు. అందుకే భగవంతుడయ్యాడు. రాబోయే రోజుల్లో ప్రధని నరేంద్ర మోదీ కూడా అలా కానున్నారని ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగ్ రావత్  అన్నారు. రుషికుల్ ఆయుర్వేదిక్ మహావిద్యాలయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనాకాలంలో నూతన భారతం ఉదయించిందని చెప్పారు సీఎం రావత్. మోడీతో ఫొటో తీయించుకోవాలని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు తాపత్రయ పడుతూ క్యూ కడుతున్నారన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూన్తున్నారని తెలిపారు.  మోడీ అధికారంలోకి రాకముందు దేశంలో అరాచకం తాండవించేదని.. ఇప్పుడు అంతా బాగుందని కీర్తించారు ఉత్తరాఖండ్ సీఎం  తీర్థసింగ్ రావత్.  భారత ప్రధాని, రాష్ట్రపతి ఏ దేశానికైనా వెళితే అక్కడి దేశాధినేతలు లేచి నిలుచుంటారని రావత్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ తన శక్తియుక్తులను చాటింది. 200 ఏళ్ల పాటు భారత్‌ను బానిసగా చేసుకున్న అమెరికా ఇప్పుడు భారత్ దారిలో నడుస్తున్నదన్నారు. ఇది నరేంద్ర మోడీతోనే సాధ్యమయ్యిందన్నారు బీజేపీ ముఖ్యమంత్రి రావత్. 

కొత్త మద్యం బ్రాండ్లు వద్దు.. నంద్యాల ఓటర్ల  స్లిప్పులు 

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా నంద్యాలలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నంద్యాల మున్సిపల్ 29 వార్డు ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్ బాక్సులు తెరిచారు కౌంటింగ్ సిబ్బంది. అయితే బాక్సును చూసిన అధికారులు షాకయ్యారు. బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు ప్రింటెడ్ స్లిప్పులు కనిపించడంతో కలవరపడ్డారు. అయితే ఆ స్లిప్పులను , అందులో వివరాలను చూసిన తర్వాత అంతా నవ్వుకున్నారు.  నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ ఆ చీటీల్లో ముద్రించి ఉన్న సందేశం వారిని అధికారులను విస్మయానికి గురి చేసింది. ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లను తొలగించాలని, పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకురావాలని ఆ స్లిప్పుల్లో పేర్కొన్నారు. సుప్రీం, జంబో, హైదరాబాద్, దారు వంటి నూతన బ్రాండ్లు తమకు వద్దని... రాయల్ స్టాగ్, బ్లాక్ డాగ్, ఇంపిరీయల్ బ్లూ వంటి పాత బ్రాండ్లు మళ్లీ తీసుకురావాలని కోరారు. తాము కోరిన పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందంటూ సీఎంను ఉద్దేశించి స్పష్టం చేశారు మందు బాబులు.  విశాఖ కార్పొరేషన్ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాసిన స్లిప్పులు కూడా దర్శనమిచ్చాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని ఓటర్లు కోరారు.

అయోమయసేనాని.. పవన్ పై బీజేపీ నేత ఫైర్

బీజేపీ, జనసేన మధ్య వివాదం ముదురుతోంది. తెలంగాణ బీజేపీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కమలనాధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. పోలింగ్ రోజు బీజేపీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు సమర్థించటం దేనికి సంకేతం? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. పవన్‌కు ఏదైనా ఇబ్బంది ఉంటే కేంద్ర నాయకత్వం లేదా తన దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు. జనసేనతో పొత్తుపై పవన్‌తో ఎప్పుడు చర్చలు జరపలేదని బండి సంజయ్‌ తెలిపారు.  తెలంగాణ బీజేపీపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు.  జనసేనను చులకన చేసేలా బీజేపీ మాట్లాడిందని ఆరోపించారు. బీజేపీ తమను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. అందుకే తాము తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని పవన్ కొనియాడారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్! హోంమంత్రి వ్యాఖ్యలపై రచ్చ 

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఓటింగ్ జరిగింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయడంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోయి కనిపించాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి రికార్డు స్థాయిలో 74 శాతం పోలింగ్ జరిగింది. ఈ సీటు పరిధిలో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 82 శాతం పోలింగ్ జరగగా.. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యల్పంగా 65 శాతం పోలింగ్ జరిగింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్ఠానంలోనూ గతంలో కంటే భారీగా ఓటింగ్ పెరిగింది. ఈ స్థానంలో దాదాపు 60 శాతం పోలింగ్ జరిగింది.  ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నేను ఉదయం ఎనిమిది గంటలకే ఓటు వేశా, వాణీ దేవికే ఓటు వేశా అని  హోంశాఖ మంత్రి చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మహమూద్ అలీ ఓటును క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.  రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోం శాఖకు మంత్రి మహమూద్అలీ కనీస ఇంగితం లేకుండా ఓటర్లని మభ్యపెట్టె ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ఒక ఐఏఎస్ అధికారిగా, రాజ్యంగ పరిరక్షకులు.  కానీ కేసీఆర్ కి కాదు అనే సంగతి గుర్తు చేసుకోవాలన్నారు శ్రవణ్. హోమ్ మంత్రి మహమూద్ అలీ ఓటు ఏం చేస్తారో చెప్పాలి. ఆయన ఓటుని రద్దు చేస్తారా ? లేదా ?  హోమ్ మంత్రిగా వున్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడటం దుర్మార్గం. హోమ్ మంత్రి తీరే ఈ ఎన్నికల తీరుకు అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు. పోలింగ్ రోజున  కుడా విచ్చల విడిగా డబ్బులు పంచారని శ్రవణ్  ఆరోపించారు.కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల ఎన్నికల సంఘం అయ్యిందా ? అని శ్రవణ్ ప్రశ్నించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ పై ఎన్నికల అధికారులకు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది.  ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలను హోం మంత్రి ఉల్లంఘించారని  ఓయూ జేఏసీ నేత జటంగి సురేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. గోప్యత పాటించే ఓటు హక్కును హోం మంత్రి మహమూద్ అలీ  బహిర్గతం చేసి  ఎమ్మెల్సీ ఎన్నికలలో నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారప.  తన ఓటును ఎవరికి వేశాననే విషయాన్ని బహిర్గతం చేసిన హోం మంత్రి మహమూద్ పై విచారణ చేయాలని,హోం మంత్రి ఓటుని డిస్ క్వాలిఫై చేయాలని సురేష్ యాదవ్ తన ఫిర్యాదులో కోరారు.  

వరుస విడాకులు రాజకీయాల్లో ఉండవు..  పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే పైర్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు.  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పవన్‌పై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించుకోవాలన్నారు. వరుసగా విడాకులు తీసుకుంటూ ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చని, కానీ రాజకీయాల్లో అలా కుదరదని తెలిపారు. రాజకీయాలకు సిద్ధాంతాలు, విలువలే ప్రాతిపదిక అని గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులను మోసం చేసిన పవన్... ఆపై టీడీపీతో కలిసినా, ఆ పార్టీ నుంచి కూడా విడిపోయారని వెల్లడించారు. ఇప్పుడు బీజేపీతో కలిసిన పవన్ కిందిస్థాయిలో మాత్రం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల నీచ రాజకీయాలను ప్రజలు గుర్తించారు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ 8 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు గ్రంధీ శ్రీనివాస్. 

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఫర్ సేల్?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ రగిలిపోతోంది. కార్మికుల ఆందోళనకు అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అన్నింటిని అమ్మేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తామని కూడా ప్రకటించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దీంతో మళ్లీ కౌంటరిచ్చిన కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఒకరికి ఒకరు తోడు లేకపోతే.. అన్ని అమ్మేస్తారని చెప్పారు. ఇవాళ విశాఖ.. రేపు సింగరేణి.. తర్వాత ఏదైనా కావచ్చని కామెంట్ చేశారు,  ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్లే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తర్వాత కేంద్ర సర్కార్ టార్గెట్ ఎయిర్ పోర్టే కాబోతోంది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను వేగంగా ప్రైవేటీకరించాలని యోచిస్తున్న మోడీ సర్కార్.. ఆ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అందులోని వాటాలను విక్రయించడం ద్వారా రూ. 2.5 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి దశ ప్రైవేటీకరణలో భాగంగా లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల కాంట్రాక్ట్‌లను అదానీ గ్రూప్ ఇప్పటికే దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం గుర్తించగా అందులో పైన పేర్కొన్న నాలుగు విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటాలను అమ్మేయాలని నిర్ణయించినట్టు  తెలిసింది. మరికొన్ని రోజుల్లో ఈ నిర్ణయం కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుంది.  విమానాశ్రయాల అమ్మకం విషయంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించనున్నారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉంది. మిగతా 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉండగా, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్ ఏజీ అండ్ ఎరామన్ మలేసియాకు 10 శాతం వాటా ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉండగా, బెంగళూరులోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే మౌలిక సదుపాయాల రంగంలోని ప్రభుత్వ ఆస్తులను విక్రయించడమే ముఖ్యమైన దారిగా కనిపిస్తోందని అన్నారు.  

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ హవా

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా సాగింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ విజయాలు సాధించింది. ఏపీలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా.. నాలుగు మున్సిపాలిటీలు ముందే వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ నిలిచిపోయింది. మిగిలిన 11 కార్పొరేషన్లు 71 మున్సిపాలిటీలకు సంబంధించి లెక్కింపు జరగగా.. అన్ని  కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మున్సిపాలిటీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ  కడప జిల్లా మెదుకూరులో టీడీపీ విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వైసీపీ స్వీప్ సాధించగా... టీడీపీ గెలిచిన రెండు మున్సిపాలిటీలు రాయలసీమలోనే ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయాలన్ని విశాఖ, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల చుట్టే తిరిగింది. ఈ ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉండటంతో వైసీపీ సవాల్ గా తీసుకుంది. సీఎం జగన్ ఈ మూడు కార్పొరేషన్లపై స్పెషల్ ఫోకస్ చేశారు. మంత్రులతో పాటు స్థానిక నేతలకు టార్గెట్ పెట్టారు. డబ్బులు కూడా భారీగా పంపిణి చేశారని చెబుతున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీకే ఆధిక్యత లభించింది. గుంటూరులో వైసీపీ ఘన విజయం సాధించగా.. విశాఖపట్నం. విజయవాడ కార్పొరేషన్ లో మాత్రం అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది టీడీపీ. వైసీపీ నేతలు భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా, ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేసినా... గట్టిగానే పోరాడింది.    తమకు సవాల్ గా మారిన గుంటూరు, విజయవాడ, విశాఖలో గెలవడంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. మున్సిపల్ ఫలితాలతో    సీఎం జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులకు  ఏపీ ప్రజలు మద్దతు ఇచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు, అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం.. స్థానిక సంస్థల ఎన్నికలను రాజధాని అంశంతో ముడిపెట్టడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. రాజధాని వంటి అత్యంత కీలకమైన అంశంతో స్థానిక ఎన్నికల ఫలితాలను ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓటర్లను బెదిరించారనే ఆరోపణలు ముందు నుంచి వచ్చాయి. నామినేషన్ల సమయంలోనూ ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేయాలని భావించిన అభ్యర్థులను బెదిరించినట్లు ఆడియో, వీడియోలు బయటికి వచ్చాయి. రాయలసీమలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలకు సంబంధించిన చాలా వార్డులను పోటీ లేకుండానే వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ కు ముందు కూడా వాలంటీర్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించినట్లు చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఫించన్ కట్ చేస్తాం..అమ్మ ఒడి అపేస్తాం... రైతు సాయం నిలిపివేస్తాం.. రేషన్ కార్డు తీసేస్తాం ... ఇలాంటి బెదిరింపులకు దిగారని చెబుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరించారని చెబుతున్నారు. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేశారని, పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు సహకరించారని ఆరోపిస్తున్నారు.

బెదిరించారు.. గెలిచారు! తేల్చేసిన పీకే

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, ముసిపాల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొస నుంచి ఈ కొన వరకు స్వీప్ చేసింది. విపక్షాలకు అక్కడొకటి ఇక్కడొకటి అన్నట్లుగా దిష్టి చుక్కలే మిగిలాయి. అధికార పార్టీ అంతలా ఎలా స్వీప్ చేయగల్గింది? విపక్షాలు ఎందుకు అలా తుడిచిపెట్టుకు పోయాయి? ఏ అంశాలు అధికార పార్టీకి అండగా నిలిచాయి? ఏ అంశాలు విపక్షానికి ప్రతికూలంగా పనిచేశాయి? ఎన్నికలు ఎలా జరిగాయి? ఇలా అనేక కోణాల్లో ఎన్నికల ఫలితాలను విశ్లేశిన్చుకోవచ్చును. రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు,మేథావులు, మీడియా ఆ పని ఎటూ చేస్తాయి.  20 నెలల, అరాచక పాలన (ప్రతిపక్షాల దృష్టిలో) తర్వాత కూడా అధికార పార్టీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం తీసీపోనీ విధంగా, అంతకంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించింది.ఇది అందరూ ఆమోదించవలసిన వాస్తవం. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఎలాంటి అద్భుతాలు ఆశించారో ఏమో కానీ, వైసీపీ విజయాన్ని, ‘బెదిరించారు గెలిచారు’ అంటూ  చాలా తేలిగ్గా  తీసి పారేశారు.  ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని , కడుపు మీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి వైకాపా విజయం సాధించిందే కానీ, భరోసా  ఇచ్చికాదని అన్నారు. పవన్ ఆరోపణలలో చాలావరకు నిజం ఉంది , కానీ, అదే సమయంలో జనసేన, బీజేపీ కూటమి సహా ప్రతిపక్షాలు ప్రజల నాడి పట్టుకోలేక పోయారు.అది నిజం . గెలుపును పంచుకోవడంలో సెలెబ్రేట్ చేసుకోవడంలో కాదు,ఓటమిని హుందాగా తీసుకోవడంలోనే  నాయకుడి గౌరవం పెరుగుతుంది.