బీజేపీ కంటే కమ్యూనిస్టులే బెటర్!
posted on Mar 15, 2021 @ 3:38PM
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. జనసేనతో పొత్తు ఉన్నా.. ఏపీ మొత్తంగా కూడా వార్డుల్లో డబుల్ డిజిట్ క్రాస్ చేయలేకపోయింది. వామపక్షాలతో పోల్చితే బీజేపీ చాలా పూర్ గా ఉందని ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఏపీలో మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ కేవలం 7 వార్డులు, 1 డివిజన్ సొంతం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, అనంతపురం జిల్లా హిందూపురం, కర్నూల్ జిల్లా గూడూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో రెండేసి చోట్ల కమలం వికసించింది. కార్పొరేషన్లలో మాత్రం విశాఖపట్నంలో మాత్రమే ఒక డివిజన్‌లో గెలిచింది బీజేపీ.
మున్సిపల్ ఎన్నికల్లో తమకు పట్టున్న వార్డుల్లోనే బరిలో నిలిచిన వామపక్షాల అభ్యర్థులు 3 వార్డులు, 3 డివిజన్లలో విజయం సాధించారు. సీపీఐ 3 వార్డులు, ఒక డివిజన్‌లో గెలుపొందగా.. సీపీఎం అభ్యర్ధులు రెండు డివిజన్లలో గెలుపొందారు. విశాఖపట్నంలో సీపీఐ, సీపీఎంలు ఒక్కో డివిజన్‌ను కైవసం చేసుకోగా.. విజయవాడలో సీపీఎం ఒక స్థానంలో గెలుపొందింది. రాయలసీమలోని గుంతకల్, తాడిపత్రి, డోన్‌లలో ఒక్కో వార్డులో సీపీఐ విజయం సాధించింది. తాడిపత్రి మున్సిపాలిటీలో చైర్మెన్ ఎన్నికకు సీపీఐ కౌన్సిలరే ఇప్పుడు కీలకంగా మారారి.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన పార్టీ బోణీ కొట్టింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. 320 వార్డుల్లో పోటీ చేసిన జనసేన.. 18 వార్డుల్లో విజయం సాధించింది. 10 మున్సిపాలిటీల్లో బోణీ కొట్టింది. ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ప్రభావం ఉంటుందని భావించినా.. పెద్దగా విజయం సాధించలేదు. అమలాపురంలో 6 వార్డులు గెలుచి రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 4 వార్డులు గెలుచుకుంది. కార్పొరేషన్లలో జనసేన 224 డివిజన్లలో పోటీ చేసి 7 చోట్ల గెలుపొందింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో 3 డివిజన్లను గెలుచుకుంది. గుంటూరులో 2 చోట్ల, ఒంగోలు, మచిలీపట్నంలో ఒక్కో డివిజన్‌లో విజయం సాధించింది.