చంద్రబాబు, నారాయణలపై సీఐడీ యాక్షన్
మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు. బుధవారం మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం, సీఐడీ నోటీసులు ఇవ్వడంతోనే ఆగలేదు. అప్పటి మంత్రి నారాయణపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీఐడీ.. బుధవారం నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. నారాయణ ఇంటికి గేటు వేసి లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా సోదాలు కొనసాగించారు. ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాల్లో కూడా సీఐడీ అధికారులు సోదాలు చేశారు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో పది ప్రాంతాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
అటు.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. అక్కడ నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. 41(A) సి.ఆర్.పి.సి ప్రకారం నోటీసులు అందించారు. ఈనెల 22న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. ఇదే కేసులో ఈనెల 23న విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసుకు కట్టుబడి తమ ముందు హాజరుకాకపోయినా, ఇందులో తెలిపిన నిబంధనలను ఉల్లంఘించినా 41ఏ(3), (4) సి.ఆర్.పి.సి ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయవచ్చునని కూడా స్పష్టం చేశారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ‘‘గత ప్రభుత్వంలోని కొందరు పరపతి ఉన్న పెద్దలు మోసం చేసి, చట్ట విరుద్ధంగా, మోసపూరితంగా రైతుల భూములు లాక్కున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా అసైన్డ్ భూములు తీసేసుకుంటుందని కొందరు దళారులు చెప్పారు. దీంతో అమాయకులైన రైతులు ఆందోళనకు, అభద్రతాభావానికి గురయ్యారు’’ అని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు.
మోసం, కుట్రతో అసైన్డ్ భూములు లాక్కొన్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా 10 సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారాయణలను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ క్రైమ్ నంబర్ 5/2021 నమోదు చేసింది. వారిపై... 166, 167, 217, 120 (బి) ఐపీసీ రెడ్‌విత్ 34, 35, 36, 37 ఐపీసీలతోపాటు... ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1), (ఎఫ్) (జి)లపైనా కేసు పెట్టారు. చంద్రబాబు, నారాయణలకు సీఐడీ నోటీసులు.. నారాయణ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలతో రాజకీయంగా ఉద్రిక్తత పెరిగింది.