18 న బడ్జెట్ వ్యవసాయచట్టాలపై తీర్మానం ఉంటుందా ?
posted on Mar 15, 2021 @ 3:28PM
తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు మెదలయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు మొత్తం పది రోజుల పాటు, ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభ సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈనెల 18న ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు.
బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇటీవల మరణించిన నాగార్జున సాగర్ శాసన సభ్యుడు, నోముల నర్సింహయ్యకు సభ 16న సంతాపం తెలియచేస్తుంది. 17వ తేదీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ, దానిపై సమాధానం ఉంటుంది.19, 21 తేదీలను సెలవులుగా ప్రకటించారు.20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది.23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది 26న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
అయితే, బీఏసీలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వం చేసిన, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. గతంలో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో తెరాస పాల్గొన్న నేపధ్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ డిమాండ్’పై ఎలా స్పందిస్తుంది అనేది, ఆసక్తి కరంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ముందు కేంద్ర చట్టాలకు వ్యతిరేంగా నిర్వహించిన రాస్తా రోకో, కార్యక్రమానికి తెరాస మద్దతు ఇవ్వడమే కాకుండా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు మంత్రులు, పార్టీ నాయకులు ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని తూర్పార పట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగాఅసెంబ్లీ తీర్మాన చేస్తామని కూడా తెరాస ముఖ్య నేతలు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వం స్వరం మారింది. మరి, ఇప్పుడు కాంగ్రెస్ డిమాండ్’కి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.