రాబోయే రోజుల్లో మోడీనే దేవుడు! రాముడితో పోల్చిన బీజేపీ సీఎం
posted on Mar 15, 2021 8:59AM
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భగవంతుడితో పోల్చారు. ‘ద్వాపర, త్రేతాయగాలలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వచ్చారు. శ్రీరాముడు సమాజ హితం కోరి పనిచేశారు. అందుకే భగవంతుడయ్యాడు. రాబోయే రోజుల్లో ప్రధని నరేంద్ర మోదీ కూడా అలా కానున్నారని ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగ్ రావత్ అన్నారు. రుషికుల్ ఆయుర్వేదిక్ మహావిద్యాలయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పాలనాకాలంలో నూతన భారతం ఉదయించిందని చెప్పారు సీఎం రావత్. మోడీతో ఫొటో తీయించుకోవాలని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు తాపత్రయ పడుతూ క్యూ కడుతున్నారన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూన్తున్నారని తెలిపారు. మోడీ అధికారంలోకి రాకముందు దేశంలో అరాచకం తాండవించేదని.. ఇప్పుడు అంతా బాగుందని కీర్తించారు ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగ్ రావత్.
భారత ప్రధాని, రాష్ట్రపతి ఏ దేశానికైనా వెళితే అక్కడి దేశాధినేతలు లేచి నిలుచుంటారని రావత్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ తన శక్తియుక్తులను చాటింది. 200 ఏళ్ల పాటు భారత్‌ను బానిసగా చేసుకున్న అమెరికా ఇప్పుడు భారత్ దారిలో నడుస్తున్నదన్నారు. ఇది నరేంద్ర మోడీతోనే సాధ్యమయ్యిందన్నారు బీజేపీ ముఖ్యమంత్రి రావత్.