ఒక్క ఓటు కూడా రాలే..
posted on Mar 15, 2021 @ 10:22AM
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఎన్నికల కౌంటింగులో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని వార్డులు, డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థులకు భారీ మెజార్టీలు రాగా.. కొన్ని వార్డుల్లో మాత్రం పోటీ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. తాడిపత్రి మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఫలితం టై కావడంతో టాస్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. ఇక కొన్ని వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాలేదు. కొన్ని వార్డుల్లో ఒకటి, రెండు ఓట్లు వచ్చాయి.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల 5వ వార్డులో వైసీపీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు పోటీపడ్డారు. ఆ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన గోనమండ వెంకటేశ్వరరావుకు ఒక్క ఓటు కూడా రాలేదు. వెంకటేశ్వరరావు, అతని కుటుంబ సభ్యుల ఓట్లు 19వ వార్డులో ఉన్నాయి. అతను పోటీ చేసింది 5వ వార్డు కావడంతో తన ఓటు కూడా వేసుకోలేకపోయాడు.
అమలాపురం పురపాలక సంఘంలో పోటీ చేసిన 72 మంది అభ్యర్థులలో ఒక్క ఓటు కూడా రాని ఒకే ఒక్క అభ్యర్థిగా రాయుడు బాబ్జికుమార్ నిలిచారు. ఆయన 18వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన కుటుంబానికి చెందిన ఓట్లన్నీ 15వ వార్డులో ఉన్నాయి. దీంతో ఆయన పోటీ చేసిన 18వ వార్డులో ఓటు వేసుకునే అవకాశం బాబ్జికుమార్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు లేకుండా పోయింది. దీంతో వారి ఓట్లు పడలేదు. అయితే ఆయన్ను బలపరిచిన వార్డు ఓటర్లు కూడా బాబ్జికుమార్‌కు ఓట్లు వేయకపోవడంతో ఒక్క ఓటు కూడా రాని అభ్యర్థిగా ఆయన నిలిచిపోయారు. ఈ స్థానంలో నోటాకు 24 ఓట్లు రాగా చెల్లని ఓటు ఒకటి వచ్చింది.