రాజకీయ తెరపై.. సినీ వెలుగులు..
ఎన్నికల సమయంలో సెలబ్రిటీలు, ముఖ్యంగా, సినీరంగ ప్రముఖులను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతుంటాయి.కాషాయ దళం, బీజేపీలో అయితే ఈ ఆసక్తి కొంచెం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అయితే, అలా ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన సినీ ప్రముఖులలో చాలా వరకు వడపోతలో జారిపోతూనే ఉంటారు. కొద్దిరోజుల క్రితం, బెంగాలీ వృద్ధ నటుడు, మిదున్ చక్రవర్తి, ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పటికే రెండు పార్టీలు మారిన మిదున్ చక్రవర్తి, మూడవ పార్టీలో ఎంత కాలం ఉంటారో, ఈ వయసులో (70 ప్లస్) ఆయన పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తారో ఏమో కానీ, ఆయన చేరికకు బీజీపీనే కాదు, మీడియా కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఇచ్చింది. మిధున్ చక్రవర్తి ఎంట్రీతో ఏవేవో జరిగిపోతాయని మీడియా ఊదర కొట్టింది. ఒక్క మిధున్ చక్రవర్తి మాత్రమే కాదు, ఇంకొందరు, హీరోలు, విలన్లు, హీరోయిన్లు, బుల్లి తెర బెంగాలీ నటీ నటులు అనేక మంది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. చేరుతూనే ఉన్నారు.
నిజానికి, కొద్ది కాలం క్రితం వరకు ‘బెంగాలీ సినీ/టీవీ ఇండస్ట్రీలో తృణమూల్’దే పైచేయిగా వుంది.ఇప్పటికే,ఇటు బెగాలీ సినిమాలలో,అటు బుల్లి తెరమీద రాణించిన మిమీ చక్రవర్తి, నుసారత్ జహాన్’ 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి, పార్లమెంట్’ సెలబ్రిటీ ఎంపీలుగా చక్రం తిప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా దీపాంకర్ డే’సహా అనేక మంది బెంగాలీ నటులు తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు.అలాగే, మిధున్ కంటే ముందే,యంగ్ హీరో యాష్ దాస్ గుప్తా, సౌమిలి ఘోష్, పాపియా అధికారి వంటి అనేక మంది బెంగాలీ నటీనటులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.అంతే కాదు, బెగాలీ ఇండస్ట్రీలో రాజకీయ వివక్ష కూడా ఉందని, ప్రముఖ నటి అంజనా బసు ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన తనను ఇండస్ట్రీ వెలివేసిందని, మంచి టీఆర్పీ రేటింగ్ ఉన్నా తన సీరియల్ ప్రసారాన్ని రాజకీయ వత్తిళ్ళ కారణంగా నిలిపి వేశారని ఆమె చెపుతున్నారు.
ఇదిలా ఉంటే సినిమా ప్రముఖులకు కండువాలు కప్పేందుకు, రాజకీయ నాయకులు కొంచెం దిగివచ్చి మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇటీవల సీనియర్ బీజేపీ నాయకుడు,అనిర్బంజన్ గంగోపాధ్యాయ ప్రముఖ హీరో ప్రోసెన్’జిత్ చటర్జీ’ని పార్టీలోకి ఆహ్వానించేందుకు మేళ తాళాలతో ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, చటర్జీ రాజకీయాలలో చేరే ఆలోచన లేదని, సున్నితంగా చెప్పి పంపారు అనుకోండి అది వేరే విషయం.ఇదిలా ఉంటే, మరో ప్రముఖ నటుడు,తృణమూల్ ఎమ్మెల్యే చిరాంజిత్ చక్రవర్తి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్ల్యేగా పనిచేసిం తర్వాత రాజకీయాలు తన వంటికి పడవని అర్థమైందని ఆయనే చెప్పుకున్నారు.
ఇక రాజకీయాలు,సినిమా రంగాలు ఒకటిగా కలిసి పోయిన తమిళనాడులో పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. అయితే చాలా చాలా సంవత్సరాల తర్వాత ప్రధాన ద్రవిడ పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే ప్రత్యక్ష సినిమా లింకులు అంతగా లేని నాయకుల సారధ్యంలో ఎన్నికల బరిలో దిగుతున్నాయి.అయితే,చాలా కాలంగా రాజకీయాలలో ఉన్న విజయకాంత్, కొత్తగా అరంగేట్రం చేసిన కమల హసన్ వంటి వారి పక్క వాద్యపార్టీలు ఉన్నాయి. మరో వంక బీజేపీ తాతకు దగ్గులు నేర్పే పనిలో పడింది. సినిమా రంగ ప్రముఖలను ఆకట్టుకునేందుకు చాలా చాలా ప్రయత్నాలే చేసింది. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి అన్నట్లుగా, తమిళ మెగా స్టార్ రజనీకాంత్’ పై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది.అయినా, తమిళ నాడులోనూ సినీ ప్రముఖు చాలామందే కమల దళంలో చేరారు.తాజాగా కొద్ది రోజుల క్రితం తమిళ హాస్య నటుడు సెంథిల్ బీజేపీలో చేరారు. గతంలో ఏఐఏడీఎంకే, ఆ తర్వాత టీటీవీ దినకరన్ ఏఎంఎంకేలోనూ ఆయన పని చేశారు.అంతకు ముందే, ఖుష్బూ కాంగ్రెస్’కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, గౌతమి, రాధా రవి, నమిత, గంగై అమరన్, వి.శేఖర్ తదితరులు ఇప్పటికే బీజేపీలో చేరారు.
అయితే, ఒక్క బీజేపీలోనే కాదు, కాంగ్రెస్’లో ఇతర ప్రాంతీయ పార్టీలలోనూ అనేక, అగ్ర నటుడు అమితాబ్ నుంచి మన కోటా వరకు అనేక మంది సినిమా సెలబ్రిటీలు, చట్ట సభల మెట్టెక్కి కూడా, మళ్ళీ వెనక్కి వచ్చేశారు.అలా వచ్చిన వాళ్ళలో మన తెలగు వెలుగులు ఉన్నారు. ఏకంగా సొంత పార్టీలే పెట్టిన ఎన్టీఅర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయశాంతి మంచో చెడో రాజకీయాల్లో కొంతవరకు నిలతొక్కు కున్నారు. అలాగే అలనాటి కొంగర జగ్గయ్య మొదలు మోహన్ బాబు, బాబు మోహన్ వరకు, ఈ మధ్యనే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మురళీ మోహన్ వరకు, చట్ట సభల మెట్లెక్కి దిగి రాజకీయాల నుంచి తప్పుకున్నవారి జాబితా కూడా చాలా ఎక్కువగానే ఉంది.