ఎక్స్ అఫీషియోలో ట్విస్ట్! రసవత్తరంగా తాడిపత్రి ఎన్నిక
posted on Mar 15, 2021 @ 2:31PM
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. తాడిపత్రిలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాకపోవడంతో చైర్మెన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. ఇక్కడ ఎక్స్‌అఫీషియో ఓటు కోసం నలుగురు ఎమ్మెల్సీలు పెట్టుకున్న దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డి తిరస్కరించారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్, శమంతకమణిలు ధరఖాస్తు చేసుకోగా.. రూల్స్ ప్రకారం ఓటు అర్హత లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రాయదుర్గంలో ఓటు హక్కుతో ఎమ్మెల్సీ అయ్యారని కమిషనర్ వివరించారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా... రెండు వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. దీంతో మున్సిపాలిటీలో మొత్తం బలం టీడీపీకి 18, వైసీపీకి 16గా ఉంది. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. అధికార వైసీపీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం 18కి చేరుతుంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో.. ఆ పార్టీ సొంతబలం 19 అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ దీపక్ రెడ్డి ఓటును తిరస్కరించారు.
తాడిపత్రి మున్సిపాలిటీని ఎలాగైనా గెలుచుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. టీడీపీని చీల్చటానికి కూడా అధికార పార్టీ కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి... గెలిచిన వారందరిని క్యాంపుకు తరలించారు. ప్రస్తుతం టీడీపీ శిబిరంలోనే సీపీఐ, స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో గురువారం జరిగే చైర్మెన్ ఎన్నికల్లో టీడీపీకే పీఠం దక్కే అవకాశం ఉంది.