26 జిల్లాల్లో పెరిగిన కేసులు.. తెలంగాణలో మళ్లీ కరోనా పంజా
posted on Mar 15, 2021 @ 10:45AM
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. చాప కింద నీరులా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం 46 నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం 15 కేసులకు పెరిగాయి. కాగా శనివారం 50,998 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 228 మందికి పాజిటివ్ వచ్చింది.
ఆదివారం టెస్టుల సంఖ్య తగ్గడంతో కేసులు కొంత తగ్గాయి. ఆదివారం 38 వేల మందికి టెస్టు చేయగా.. 157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,654గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,983 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 718 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
శనివారం నాటికి తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 5,27,117 మంది కాగా, రెండో డోస్ టీకా తీసుకున్నవారు 2,22,080 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 7,49,197కు చేరింది.