జగన్ సర్కార్ విశాఖకు షిఫ్ట్ అయ్యే ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే...
posted on Mar 16, 2021 @ 6:06PM
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. మరోపక్క కారణాలేమైనప్పటికీ ఇటు ప్రస్తుత రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలలోను.. అటు వైసిపి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విశాఖలోని ఆ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలలో ఎదురు లేకుండా పోయింది. దీంతో తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందని వైసీపీ ప్రకటించుకుంటోంది. వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్నీ పడే పడే చెబుతున్నారు. ఇదే వేడిలో రాజధాని తరలింపు కూడా చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది .
ఇప్పటివరకు పలు కోర్టు కేసులు, తీర్పులు అడ్డంకిగా ఉండడంతో జగన్ ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేస్తూ వచ్చింది. అంతేకాకుండా గతంలో అనేక ముహూర్తాలు పెట్టినా.. కోర్టు కేసుల వల్ల అప్పట్లో అవన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా పుర ప్రజల తీర్పుతో ఇక రాజధాని తరలింపులో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది . దీనికోసం కోర్టు కేసుల విచారణలో.. తాజా ఎన్నికల ఫలితాలను ఉదహరణగా చూపించి.. తమ నిర్ణయాలకు ప్రజామోదం కూడా ఉందని చెప్పొచ్చని భావిస్తోంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం రాజధానిని తరలించడం సాధ్యం కాకపోయినా... సీఎం జగన్ మాత్రం త్వరలో విశాఖ నుండి తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కోసం సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా విశాఖకు చెందిన ఒక ప్రముఖ స్వామీజీ దీనికోసం మే ఆరున ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఇదే విషయం చెప్పారు.
ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పాలనా వ్యవహారాలు చూస్తుండగా మే ఆరో తారీఖు నుండి వైజాగ్ నుంచే పాలన జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు కేసులతో రాజధాని తరలింపు ఆలస్యమైనా సీఎం మాత్రం వైజాగ్ నుంచి పాలన చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పరిపాలన కోసం అవసరమైన ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను ఇప్పటికే సీఎం ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి . దీంతో మే మొదటి వారంలో కీలకమైన పరిపాలనా విభాగమంతా.. విశాఖ వెళ్లడానికి రెడీ అవుతోంది. మరోపక్క ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఉగాధి రోజున శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే తన మంత్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం విశాఖ వచ్చిన వెంటనే.. అన్ని వసతులతో కూడిన క్యాంప్ కార్యలయం కూడా స్థానికంగా సిద్ధం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను క్యాంప్ కార్యాలయం కోసం సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. తాత్కాలికంగా సీఎం ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. వైజాగ్ లో పాలనకు అనుకూలంగా చాలా ప్రదేశాలు ఉన్నప్పటికీ.. ఈ రిసార్ట్ ప్రభుత్వ స్థలంలో ఉండడంతో సీఎం జగన్ దీన్నే ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 28 ఎకారాల్లో విస్తరించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ లో పూర్తి స్థాయి విలాసావంతమైన సౌకర్యలు అందుబాటులో ఉన్నాయి. సీఎం జగన్ తలపెట్టిన ఈ తరలింపు సఫలం అవుతుందా లేక దీనికి కోర్టు కేసులు తీర్పులు అడ్డుగా నిలుస్తాయా వేచి చూడాలి.