షర్మిలకు డిప్యూటీ సీఎం పదవి!
posted on Mar 16, 2021 @ 4:33PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన షర్మిల.. వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు షర్మిలకు మద్దతు తెలిపారు. అయితే జగన్ తో విభేదాల వల్లే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగిన కొందరు నేతలు కూడా షర్మిలకు జగన్ తో గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు. జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే వైసీపీలో , జగన్ కుటుంబంలో పరిణామాలు కనిపిస్తున్నాయి. వైఎస్ వివేకాంద రెడ్డి వర్ధంతిలో పాల్గొనేందుకు షర్మిల పులివెందుల వెళ్లగా.. జగన్ ఫ్యామిలీ మాత్రం అక్కడికి రాలేదు. అంతేకాదు గతంలో షర్మిల వస్తే ఎంతో హడావుడి చేసే స్థానిక వైసీపీ నేతలు ఈసారి షర్మిలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏపీ సీఎం , తన అన్న జగన్ తో షర్మిలకు విభేదాలు తీవ్రంగానే ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
వైఎస్ షర్మిల కొత్త పార్టీ , ఆమెకు జగన్ తో విభేదాలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మకు షర్మిల అంటే చాలా ప్రేమ అని తెలిపారు. షర్మిలకు ఏదైనా కీలక పదవి ఇచ్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని జేసీ అభిప్రాయపడ్డారు. మరో ఏడాదిన్నరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ అడుగుపెడుతుందని దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం షర్మిల వార్మప్ చేస్తోందన్నారు జేసీ. ఏపీలో ఎంటరయ్యేందుకు ఇది కేవలం సన్నాహకమేనని చెప్పారు. ఆ తర్వాత విజయవాడకు షర్మిల షిఫ్టవడం ఖాయమన్నారు. రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరంలేదని, ఏపీలోనే అవసరం అన్నది షర్మిలకు తెలిసి వస్తుందన్నారు జేసీ దివాకర్ రెడ్డి.
ఒకవేళ షర్మిలకు.. జగన్ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తే కొత్త పార్టీ విషయంపై పునరాలోచన చేస్తుందేమో చూడాలంటూ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ సభ్యులందరూ పదవులు కోరుతుంటారని, జాతీయ పార్టీలే నయమని జేసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లిన జేసీ.. అక్కడి సీనియర్లతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల అంశంలో తన అభిప్రాయాలు వినిపించారు.