గెలుపు.. బలుపు! చంద్రబాబు టార్గెట్ అందుకేనా?
posted on Mar 16, 2021 @ 2:27PM
ఆదివారం మున్సిపల్ ఫలితాలు. వైసీపీ ఘన విజయం. విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ అనూహ్య గెలుపు. మంగళవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు. పోలా.. అర్థమై పోలా? కేసు ఎందుకు పెట్టారో.. చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారో తెలిసిపోలా? అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. స్థానిక సంస్థలు గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడటంతో రాష్ట్రంలో తమకిక తిరుగులేదనే అహంకారంతో విర్రవీగుతోంది జగన్ సర్కారు అనేది టీడీపీ ఆరోపణ.
అమరావతి ఆగ్రహం విజయవాడలో అధికారపార్టీని దహించి వేస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. నయానో, భయానో.. బెజవాడపైనా వైసీసీ జెండా ఎగరడం.. పక్కనే ఉన్న గుంటూరు సైతం అధికార పార్టీ హస్తగతమవడంతో జగన్ రెడ్డి సర్కారులో సమరోత్సాహం పెరిగింది. వెయ్యి ఏనుగుల బలంతో చంద్రబాబును అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. అందుకే, విపక్ష నేత చంద్రబాబు టార్గెట్ గా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. చరిత్రలో తొలిసారి ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వైసీపీ సర్కారు ఓవరాక్షన్ కు నిదర్శనం అని విమర్శిస్తున్నారు.
విభజన ఆంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్ దిశగా నడిపించడం.. ఏపీ కేపిటల్‌గా అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం.. ఇదే చంద్రబాబు చేసిన నేరం. అందుకు ఫలితమే ప్రతిపక్ష నేతకు నోటీసులు. ఏ అమరావతి కోసమైతే చంద్రబాబు అంత తాపత్రయ పడ్డారో.. ఆ కలల రాజధానిని కాలరాసి.. చరిత్రలో చంద్రబాబు పేరు లేకుండా చేసే ప్రయత్నమే ఇదంతా అనేది టీడీపీ మాట. ఇప్పటికే అమరావతిని మరుగున పడేశారు.. ఇప్పుడిక చంద్రబాబు పని పడుతున్నారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా ఐదేళ్లు సుపరిపాలన అందించిన చంద్రబాబును ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసు క్రియేట్ చేసి.. ఆ ఉచ్చును చంద్రబాబు మెడకు బిగించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో గుడ్డు మీద ఈకలు పీకి.. బలవంతపు కేసులు పెట్టడం.. వైసీపీ చేస్తున్న ప్రతీకార చర్యని.. అచ్చెంనాయుడు నుంచి వర్ల రామయ్య వరకూ.. టీడీపీ నేతలంతా ముక్తకంఠంతో మండిపడుతున్నారు.
ఎన్నికల్లో గెలిచామనే జోష్‌తో.. ప్రజాబలం తమకే ఉందనే భ్రమలో ఉంది వైసీసీ సర్కారు. స్థానికం ఎంతలా రణక్షేత్రంగా మారిందో.. ఎలా ఏకగ్రీవాలు అయ్యాయో.. ఎలా బెదిరింపులు, డబ్బు పంపిణీ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ గెలుపు బలుపు కాదని కేవలం వాపు మాత్రమేననేది టీడీపీ వాదన. ఎన్నికల ఫలితాలతో వైసీపీ సర్కారు కళ్లు నెత్తికెక్కాయని.. అందుకే చంద్రబాబుకు అమరావతి భూముల కేసులో నోటీసులు ఇచ్చారనేది తమ్ముళ్ల ఆగ్రహం. ఈ కేసుపై గతంలోనే హైకోర్టులో విచారణ జరగ్గా.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబుకు సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానం కూడా తేల్చేసింది. అయినా.. పాత కేసును మరింత తవ్వి.. ఆ దుమ్మంతా చంద్రబాబుపై ఎత్తిపోసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ మండిపడుతోంది. ఇక సంబంధంలేని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి.. ప్రతిపక్ష నేతను భయబ్రాంతులకు గురి చేయాలనుకోవడం వైసీపీ సర్కారు దిగజారుడుతనమే అంటున్నారు. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావమేనని.. ఆ వాపును చూసి బలుపు అనుకునే ప్రభుత్వం ఇలా బరితెగిస్తోందనేది టీడీపీ వర్షన్.