కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు? రేవంత్ టీమ్ జంప్ అందుకే..!
posted on Mar 16, 2021 @ 4:55PM
ఏమో.. గుర్రం ఎగరావచ్చు. అవును, కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పొట్టుకోవచ్చు. ఈ మాట అంటున్నది ఎవరో సామాన్యుడో, చిలక జోతిష్యుడో కాదు. మాజీ ఎంపీ, ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. అంత స్థాయి నేత.. అంతటి నిఖార్సైన నేత.. ఇంతటి మాటను ఇలా ఊరికే అంటారా? అస్సలు అనరు. ఆ మాట వెనుక ఏదో నిజం దాగుండే ఉంటుంది అంటున్నారు. అందుకే, కొండా కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యలో రేవంత్‌రెడ్డి మేటర్ కూడా జత కలవడంతో మరింత కాక పుడుతోంది.
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఏ ఎన్నిక వచ్చినా రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతాయి. అయితే, మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ సీన్ మారిపోయింది. దుబ్బాక, జీఎహ్ఎమ్సీ ఎలక్షన్స్ తర్వాత పోరు గులాబీ వర్సెస్ కమలంగా మారింది. హస్తం పార్టీ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు.. దేశంలోనే అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలవక తప్పదా? అందుకే కొండా అలా అన్నారా? అనే అనుమానం వస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రధాన శత్రువు. టీఆర్ఎస్‌ది అధికారం కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే చరిత్ర. అవసరమైతే గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు కేసీఆర్. అందుకే, తెలంగాణలో వేగంగా దూసుకొస్తున్న కమలదళాన్ని అడ్డుకోవాలంటే.. అవసరమైతే కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే...
ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామాతో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రేవంత్ ప్రధాన అనుచరుడైన కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి పాల్వాయి హరీష్‌బాబు బీజేపీ కండువా కప్పుకోవడం.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పార్టీని వీడటం.. ఇలా వరుస ఘటనలు అన్నీ రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని టాక్. పార్టీని వీడిన ఈ ముగ్గురు నేతలు రేవంత్ వర్గమే. ఇక, లేటెస్ట్‌గా హస్తం పార్టీకి హ్యాండిచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం రేవంత్ మనిషే. త్వరలోనే కొండా సైతం కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇలా రేవంత్ వర్గమే వరుసగా పార్టీని వీడుతుండటం.. బీజేపీలో చేరుతుండటం.. అంతా రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే జరుగుతోందని అంటున్నారు.
పీసీసీ చీఫ్ పోస్టు కోసం రేవంత్‌రెడ్డి కొంతకాలంగా గట్టిగా పోరాడుతున్నారు. అందుకు సీనియర్లు ససేమిరా అంటుండటంతో ఎంపిక ఆలస్యమవుతోంది. చిర్రెత్తుకొచ్చిన చిచ్చర పిడుగు రేవంత్.. తన మనుషులను ఒక్కక్కరిగా బీజేపీలోకి పంపుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పొత్తు పెట్టుకుంటే.. తాను పీసీసీ చీఫ్ పదవిలో ఉన్నా ఉపయోగం లేదు. కేసీఆర్‌ను గద్దె దింపి, జైలుకు పంపించడమే రేవంత్ ఏకైక లక్ష్యం. ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయితే అది సాధ్యం కాదు. అందుకే, అలా జరిగే అవకాశం ఉంటే తాను బీజేపీలోకి జంప్ అవుతాననే సిగ్నల్ ఢిల్లీ అధిష్టానానికి పంపి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికే ఇలా రేవంత్‌రెడ్డి తన అనుచరులతో పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. రేవంత్‌రెడ్డా మజాకా అంటున్నారు ఆయన అభిమానులు. ఇంతకీ, భవిష్యత్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు ఉంటుందా? రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అవుతారా? లేక, ఆ డైనమిక్ లీడర్ బీజేపీ వైపు డైవర్షన్ అవుతారా? ఏమో.. గుర్రం ఎగరావచ్చు...