విశాఖకు రాజధాని షిష్టింగ్? నోటీసులతో డైవర్షన్ గేమ్!
posted on Mar 16, 2021 @ 6:35PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయభేరి. రెండు రోజుల వ్యవధిలో ప్రతిపక్ష నేతకు సీఐడీ నోటీసులు. మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. హైకోర్టు గతంలోనే క్లీన్‌చీట్ ఇచ్చినా.. ఎలాగోలా బాబు మెడకు అమరావతి అసైన్డ్ భూముల కేసు ఉచ్చు బిగించాలానే ప్రయత్నం. ఇదంతా ఎందుకు? సడెన్‌గా ఇప్పుడే ఎందుకు? అంటే దానికో లెక్కుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉలుకు పలుకు లేకుండా సడెన్‌గా హైదరాబాద్‌కు ఊడిపడ్డారు ఏపీ పోలీసులు. ఉదయమే చంద్రబాబు ఇంటి కాలింగ్ బెల్ కొట్టి.. నోటీసులు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా అమరావతి అసైన్డ్ భూముల కేసు సీఐడీకి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఫలితాలు వెలువడిన రెండు రోజులకే సర్కారు ఎందుకింతలా హడావుడి చేస్తోంది? ఎలాగూ గెలిచారుగా? విజయం వారిదేగా? అయినా, ఈ వేధింపులు ఎందుకు? ఉన్నట్టుండి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఎందుకిచ్చారు? అనే అనుమానం అందరిలోనూ.
నోటీసుల వెనుక పక్కా పొలిటికల్ వ్యూహం దాగుందని అంటున్నారు. తెర వెనుక ఏదో గూడు పుఠాణి జరుగుతోందని తెలుస్తోంది. అదేంటో కూడా లీకులొస్తున్నాయి. మూడు రాజధానుల చిక్కుముడి విప్పేందుకు.. రాజధానికి అమరావతి నుంచి విశాఖకు రాత్రికి రాత్రి షిఫ్ట్ చేసేందుకు.. చంద్రబాబుకు సీఐడీ నోటీసుల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. ఇదంతా సర్కారు ఆడుతున్న డైవర్షన్ డ్రామాలో భాగమంటూ భగ్గుమంటున్నాయి విపక్షాలు.
ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం.. రెండు కార్పొరేషన్లలోనూ వైసీపీ గట్టి పట్టు సాధించింది. అమరావతి సెంటిమెంట్ బెజవాడ ఎన్నికల్లో కనిపిస్తుందని.. ప్రజాగ్రహానికి ఫ్యాన్ కాలిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఫ్యాన్ గాలి రివ్వున వీచింది. అమరావతి పక్కనే ఉన్న గుంటూరు కార్పొరేషన్‌లోనూ అమరావతి ప్రభావం పని చేయలేదు. అటు వైజాగ్‌లోనూ వైసీపీకి ఎదురు లేకుండా పోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని తెలిసినా.. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఆదరించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు అక్కడి వారంతా జై కొట్టారని లెక్కేస్తున్నారు. ఇలా.. విజయవాడ, గుంటూరు, విశాఖ ఫలితాలతో.. ప్రభుత్వంలో ఉత్సాహం రెట్టించింది. ఇదే మంచి తరుణమని.. ఆలసించినా ఆశాభంగమని భావిస్తోంది. రాజధానిని రాత్రికి రాత్రే అమరావతి నుంచి విశాఖకు మార్చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. అందుకు, ముహూర్తం కూడా నిర్ణయించేశారట. ఫలానా రోజున కేపిటల్ షిప్టింగ్ అంటూ ప్రజల్లో, సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. తాజాగా, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఇదే ఆరోపించారు.
రాజధాని మార్పు అంశం ఇప్పటికే హైకోర్టులో ఉంది. ఫైనల్ తీర్పు వచ్చే వరకూ అమరావతి నుంచి ఇటుక కూడా కదిలించలేరని రైతులు హెచ్చరిస్తున్నారు. కేపిటల్ మార్పు విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్న సర్కారు.. దాన్ని అమలు చేయలేక అడుగు ముందుకు వేయలేకపోతోంది. హైకోర్టు కేసులు, రైతుల నుంచి నిరసనలు, చంద్రబాబు పోరాటంతో సందిగ్థంలో పడింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాభిప్రాయం తమవైపే ఉందంటూ రాజధాని మార్పుపై దూకుడు పెంచబోతోంది జగన్‌రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగానే.. చంద్రబాబుకు సీఐడీ నోటీసులతో ప్రతిపక్ష నేతను ముందస్తుగా కట్టడి చేయడం.. విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడం.. అమరావతి రైతులను భయబ్రాంతులకు గురి చేయడం.. ఇదంతా టాపిక్ డైవర్షన్ స్కీమ్‌లో భాగమే అంటున్నారు. ఇదంతా అమరావతిని విశాఖకు షిఫ్ట్ చేయడానికి సర్కారు ఆడుతున్న మైండ్ గేమ్ అనుమానిస్తున్నారు. రాజధాని తరలింపు ముహూర్తం ఫిక్స్ అయిందని.. ఇక ఫిష్టింగే ఆలస్యం అంటున్నారు.