మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వండి...
posted on Mar 16, 2021 @ 1:41PM
కొద్ది రోజుల క్రితం వరకు దేశంలో తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. తాజాగా నమోదవుతున్న పాజిటీవ్ కేసులలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా 15 వేలకు తగ్గకుండా పాజిటీవ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ నేసథ్యంలో మహారాష్ట్రలో తాజా పరిస్థితులపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన ఆందోళన వ్యక్తం చేసారు. .
దేశంలోని ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన మహారాష్ట్రలోని కోరుకున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో సగం పైగా ఆ రాష్ట్రం నుంచే నమోదవుతున్నా విషయాన్నీ అయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్ళీ లాక్ డౌన్ వంటి చర్యలు చేపడితే.. దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బ తినే ప్రమాదముందని అయన పేర్కొన్నారు. దీంతో ఈ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. రాష్ట్రంలోని పౌరులందరికీ వ్యాక్సిన్లు అందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర అనుమతులు ఇవ్వాలని కోరారు. అదేసమయంలో వ్యాక్సిన్ల కొరత కూడా ఉండకూడదని ఆనంద్ ట్వీట్ చేశారు. అయన తన ట్వీట్ లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని, అలాగే కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్ధన్ ను కూడా ట్యాగ్ చేశారు.
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు ఒక నెటిజన్ స్పందిస్తూ.. కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే పెంచితే సరిపోదు. సమాంతరంగా కరోనా పరీక్షలు, ట్రేసింగ్, మెరుగైన చికిత్స కూడా అందాలి. ఇంకా ప్రజలు కూడా క్రమశిక్షణతో మెలగాలని రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఆనంద్ మహీంద్రా... "అవును.. నేను మీతో అంగీకరిస్తున్నాను. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకపోతే మనం రెండు, మూడు, నాలుగు దశల కరోనా వ్యాప్తితో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంద"ని ఆందోళన వ్యక్తం చేశారు.