తిరుపతిలో సంకుల సమరం! పార్టీలకు ప్రతిష్టాత్మకం
posted on Mar 16, 2021 @ 6:16PM
సరిగ్గా నెల. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. 30 రోజుల సమయం. మూడు పార్టీలకు కీలక రాజకీయ సమరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ జోరు మీదుంది. స్థానిక సమరంలో ఓటమితో ప్రతిపక్ష టీడీపీ డిఫెన్స్‌లో ఉంది. జనసేన మద్దతుతో బీజేపీ సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. తిరుపతి సంకుల సమరంలో గెలుపు ఎవరిదైనా.. గెలుపు కోసం పోరాటం మాత్రం ఓ రేంజ్‌లో సాగడం ఖాయం. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి సీటును 2019లో భారీ మెజార్టీతో గెలుచుకుంది వైసీపీ. బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల 40 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కొడుకే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా... అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాురు జగన్. దీంతో తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి బరిలో ఉండనున్నారు. డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థి అంటూ గతంలో వైసీపీ లీకులు ఇచ్చింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్ లో ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదే అనే ధీమాతో ఉంది వైసీపీ.
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి గతానికి భిన్నంగా అందరికంటే ముందుగా టీడీపీ అధిష్టానం తమ అభ్యర్థిని నిలబెట్టింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి ఎన్నికకు సంబంధించి గతంలోనే పార్టీ నేతలను అప్రమత్తం చేశారు చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడారు. దళిత ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే... ఆతని కుటుంబ సభ్యులను పరామర్శించలేదు సీఎం జగన్. దీనిపై దళిత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇదే అస్త్రంగా ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే పనబాక పోటీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీకి తిరుపతిలో అభ్యర్థి కూడా లేరని.. పనబాక లక్ష్మి పేరును ప్రకటించినా ఆమె పోటీకి సిద్ధంగా లేరని ఆయన ఆరోపిస్తున్నారు.
బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. ఆయన్ను ఒప్పించి బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్టు ప్రకటించాయి. తిరుపతిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న బీజేపీ.. ఆశావాహులైన పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన తుది లిస్ట్‌ను తయారు చేసింది. ఇప్పటికే ఆ అభ్యర్థికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల కిందటే బీజేపీలో చేరారు. ఆయన దాదాపుగా ఖరారు కావచ్చొని తెలుస్తోంది. అయితే తిరుపతిలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ తీరు నచ్చకే పవన్ పోటీకి దూరంగా ఉన్నారంటున్నారు. దీంతో ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన నుంచి ఎంతవరకు సహకారం అందుతుందన్నది సందేహమే. కాంగ్రెస్ నుంచి చింతామోహన్ కూడా మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది.
తిరుపతి ఎస్సీ రిజర్వడ్ లోక్ సభ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యలేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన గూడురు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో సూళ్లూరుపేట, సత్యవేడు, గూడురు ఎస్సీ రిజర్వ్ డు అసెంబ్లీ నియోజకవర్గాలు.