చాలా బాధేస్తోంది.. నేనూ బతకాలి కదా..
posted on Mar 16, 2021 @ 3:39PM
"మీరు కేసీఆర్‌ను ఓడించలేరు. నేను సీఎం.. నేను సీఎం.. అంటూ పార్టీని నాశనం చేశారు. కాంగ్రెస్ పార్టీ దుస్థితి చూసి చాలా బాధేస్తోంది. కాంగ్రెస్‌లో బతికే ఛాన్స్ లేదు. కొత్త మార్గాలు చూసుకోండి."ఇలా ఒకప్పడు తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ మాజీ నేత, ఫైర్ బ్రాండ్ లీడర్ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ఆసక్తికర స్టేట్‌మెంట్స్ ఇవి. సలహాలు, సూచనలు, కోపం, బాధ, ఆగ్రహం.. ఇలా రకరకాల వేరియేషన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ గురించి ఆయన చెప్పిన జోస్యం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే.. జేసీ సమక్షంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆఫ్ ది రికార్డ్ మాటొకటి ఆన్ రికార్డ్ అవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అదే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారంకు మరింత కన్ఫర్మేషన్ వస్తోంది.
జేసీ దివాకర్‌రెడ్డి. బోలామనిషి. మంచి మాటకారి. మొహమాటం అస్సలు ఉండదు. కడుపులో ఏమీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు బయటకు అనేస్తారు. ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోరు. అలాంటి జేసీ.. సడెన్‌గా తెలంగాణ అసెంబ్లీ భవనంలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. పాత పార్టీకి చెందిన పాత దోస్తులను కలిశారు. సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తదితర బడా నేతలంతా అక్కడే ఉన్నారు. అంతా కలిసి ఆ రోజుల్లో... అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. అంతలోనే తేరుకొని.. మళ్లీ వర్తమానంలోకి వచ్చి.. భవిష్యత్ గురించి మాట్లాడుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ దుస్థితికి హస్తం నేతలే కారణమంటూ పాత సహచరులను ఏకిపారేశారు జేసీ. "నేను పుట్టింది పెరిగింది.. నా ఉన్నతికి కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చూసి చాలా బాధేస్తోంది. మీరు కేసీఆర్‌ను ఓడించలేరు. నేను సీఎం.. నేను సీఎం.. అంటూ పార్టీని నాశనం చేశారు. తెలంగాణ వచ్చాక మీరు, మేమూ ఇద్దరం ఆగమైపోయాం." అంటూ పార్టీ నేతలను తప్పుబట్టారు దివాకర్‌రెడ్డి. "కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయింది.. నేను కూడా బతకాలి కదా.. కాంగ్రెస్‌లో బతికే ఛాన్స్ లేదు." అంటూ తాను కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరడానికి కారణమేంటో చెప్పారు జేసీ.
ఈ సందర్భంగా అక్కడో మరో ఆసక్తికర సంభాషణ జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామంగా మారింది. జేసీతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఇప్పుడు టీఆర్ఎస్‌పై యుద్ధం చేయాలి. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి లేదు. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను." అంటూ ఆ కీలక నిర్ణయం ఏంటో చెప్పబోతుండగా.. పక్కనే ఉన్న సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కోమటిరెడ్డిని చెప్పొద్దంటూ వారించారు. దీంతో.. నోటి దాకా వచ్చిన ఆ మాటను అనకుండానే ఆపేశారు కోమటిరెడ్డి. ఇంతకీ.. కోమటిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది అందరికీ తెలిసిందే అయినా.. ఆ మాట ఆయన నోట వచ్చుంటే ఇంకా కన్ఫామ్‌గా ఉండేది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయనే తానో నిర్ణయం తీసుకున్నానని జేసీతో అనడం.. అదేంటో చెప్పద్దంటూ భట్టి ఆపడంతో.. అది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడమే అయ్యుంటుందని అంటున్నారు. ఇప్పటికే కూన శ్రీశైలంగౌడ్ పార్టీ వీడటం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి దూరమవగా.. ఈ సమయంలో కోమటిరెడ్డి సైతం పార్టీకి హ్యాండ్ ఇస్తే అది కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.