ఏడేండ్లుగా అదే డ్రామా! ఉద్యోగులతో కేసీఆర్ సర్కార్ ఆట
posted on Mar 16, 2021 @ 5:32PM
స్వరాష్ట్రం కోసం పోరాడారు.. ఉద్యమాన్ని హోరెత్తించారు. సొంత పాలనలో పని చేయాలనుకున్నారు.. కాని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా.. వారి కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఏడేండ్లు కావస్తున్నా సొంత రాష్ట్రంలో పనిచేసే భాగ్యం వారికి లేకుండా పోయింది. ఇది తెలంగాణ స్థానికత ఉండి ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగుల ఆవేదన.
తమను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని ఏడేండ్లుగా పోరాడుతున్నారు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు. ఇదిగో తీసుకువస్తాం.. అదిగో తీసుకువస్తున్నాం అంటూ ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నికలు వచ్చినప్పుడు జీవోలు ఇచ్చి హడావుడి చేస్తూ.. ఎన్నికలు ముగియగానే మళ్లీ మర్చిపోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి ఉద్యోగుల తరలింపుపై కేసీఆర్ సర్కార్ లో కదలిక వచ్చింది. ఏపీలో పని చేస్తున్న 669 మంది తెలంగాణ స్థానికత ఉద్యోగులకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని మార్చి9 ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు లేఖ రాసింది. అయితే ఆ లేఖలో ఎలాంటి క్లారిటీ లేదు. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. దీనిపైనే ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏండ్లకు పెంచింది. తెలంగాణలో మాత్రం 58 ఏండ్లే. ఇక్కడ కూడా పెంచుతామని చెబుతున్నా అమలు మాత్రం చేయలేదు. అంతేకాదు జగన్ సర్కార్ గత జూలైలోనే 27 శాతం పీఆర్సీ ప్రకటించింది. తెలంగాణలో ఇంతవరకు అతీగతీ లేదు. ఇస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. దీంతో ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి తీసుకురావాలంటే.. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒక వేళ అక్కడ పీఆర్సీ తీసుకుంటూ.. తెలంగాణకు వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికి స్పష్టత లేదు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులకు సొంత రాష్ట్రానికి తీసుకువస్తామని చెబుతున్న కేసీఆర్ సర్కార్.. అందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. వచ్చే ఉద్యోగుల కోసం కొత్త పోస్టులు స్పష్టించాల్సి ఉంది. అది లేకుండా తీసుకువచ్చినా ఉపయోగం ఉండదు. ఇన్ని సమస్యలు ఉన్నా.. వాటిపై స్పష్టత లేకుండా ఉద్యోగులకు తీసుకువస్తామంటూ ప్రకటన చేయడం మోసపూరితమే అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కేసీఆర్ సర్కార్ తీరును గమనిస్తున్న ఉద్యోగులు కూడా ఏపీలో పని చేస్తున్న వారిని తీసుకొచ్చే యోచన లేదనే భావనకు వచ్చారంటున్నారు.
విభజన సమయంలో 2 వేల మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను కమలనాథన్ కమిటి ఏపీకి కేటాయించింది. అప్పటి నుండి తెలంగాణ ఉద్యోగులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న ఉద్యోగుల కోసం టీఎన్జీవో, టీజీవో సంఘాలు ఒత్తిడి తేవడంతో విడతల వారీగా 12 వందల మంది ఉద్యోగులను అమరావతి నుంచి తీసుకువచ్చారు. మిగిలిన 800 మంది అక్కడే ఉన్నారు. వీరిని కూడా తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది కాని కార్యరూపం దాల్చడం లేదు. సొంత రాష్ట్రంలో పనిచేయాలనే ఆశ తీరకుండానే ఏపీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు చనిపోయారు. మరికొందరు రిటైర్ అయ్యారు. మిగిలిన 669 మంది తెలంగాణ స్థానికత ఉద్యోగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నారు. వీళ్ల కోసమే ఇటీవల ఏపీకి లేఖ రాసింది..తెలంగాణ సర్కార్.